
‘నిధులు కేటాయింపునకు కేంద్రంపై ఒత్తిడి తెస్తా’
"మానవ-జంతు సంఘర్షణలను తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తా,’’ - వయనాడ్ ఎంపీ ప్రియాంక.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) వాద్రా తన నియోజకవర్గం వయనాడ్(Wayanad)లో పర్యటిస్తున్నారు. తనను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు చెబుతూ.. ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. తిరువంబాడి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ బూత్ స్థాయి నేతలతో ప్రియాంక సమావేశమయ్యారు. జనవరి నుంచి ఇప్పటివరకు వాయనాడ్‌లో అడవి జంతువుల దాడులతో నలుగురు మరణించిన నేపథ్యంలో.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఇప్పటికే మానంతవాడిలో పులి దాడి చేయడంతో మహిళ చనిపోయిన ఘటనపై కలెక్టర్, అటవీ శాఖ అధికారులతో చర్చించానని, వారు నిధుల కొరత ఉందని చెప్పారని ప్రియాంక పేర్కొన్నారు.
"మానవ-జంతు సంఘర్షణలను తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. అలాగే అవసరమైన చోట CSR నిధుల సమీకరణ ప్రయత్నిస్తా," అని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అదనపు నిధులు కేటాయించాలని కోరుతూ లేఖ రాస్తానని కూడా చెప్పారు.
ఎరణాడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ బూత్ స్థాయి నేతలనుద్దేశించి మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై ఆమె విమర్శలు చేశారు. దేశ చరిత్రలో తొలిసారి ఒక ప్రభుత్వం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
"మన పోరాటం కేవలం రాజకీయాలు, సిద్ధాంతాల కోసం మాత్రమే కాదు. దేశ మౌలిక స్ఫూర్తిని కాపాడేందుకు, దేశ రక్షణకు జరుగుతోంది," అని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలనుద్దేశించి.. "మీరు నా ఎన్నికలో ఎంతో నిబద్ధతతో పని చేశారు. అందుకు నేను నిజంగా కృతజ్ఞురాలిని," అని పేర్కొన్నారు. చివరగా ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న 38వ నేషనల్ గేమ్స్‌లో కేరళకు వాలీబాల్ పోటీల్లో బంగారు, వెండి పతకాలు గెలుచుకున్న వాయనాడ్ క్రీడాకారులను అభినందించారు.
ప్రియాంక సోమవారం వాండూరు, నిలంబూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ స్థాయి నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. అడవి జంతువుల దాడులతో మృత్యువాతపడ్డ కుటుంబాలను పరామర్శించనున్నారు. ఎన్నికలలో గెలుపొందాక ప్రియాంక వయనాడ్‌లో పర్యటించడం ఇది రెండోసారి. జనవరి 28న వాయనాడ్‌లోని ప్రియదర్శిని ఎస్టేట్ వద్ద కాఫీ గింజలు ఏరేందుకు వెళ్లిన సమయంలో పులి దాడిలో మృతి చెందిన మహిళ కుటుంబాన్ని కలిసేందుకు హై రేంజ్ జిల్లా పర్యటన చేశారు. అదేరోజు డిసెంబర్‌లో తన కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్న కాంగ్రెస్ మాజీ జిల్లా నాయకుడు ఎన్ ఎం విజయన్ కుటుంబాన్ని కూడా పరామర్శించారు.