
తమిళంలోనే దుకాణాలు, సంస్థల పేర్లు
సర్క్యులర్ జారీ చేయనున్న పుదుచ్చేరి సీఎం ఎన్. రంగసామి
దుకాణాలు, సంస్థల పేర్లు తమిళంలో ఉండాలని త్వరలో సర్క్యులర్ జారీ చేయనున్నట్లు పుదుచ్చేరి(Puducherry) సీఎం ఎన్. రంగసామి(CM Rangasamy) తెలిపారు. అసెంబ్లీలో జీరో అవర్లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే జి. నెహ్రూ అలియాస్ కుప్పుసామి ప్రశ్నకు సీఎం రంగసామి బదులిచ్చారు. "యజమానులు తమ దుకాణల పేర్లను తమిళంలో కనిపించేలా రాయాలని సర్క్యులర్ విడుదల చేస్తాం," అని ప్రకటించారు. ఈ విషయంలో ఎలాంటి సడలింపు ఉండకూడదని, తమిళ గౌరవం నిలబెట్టేలా సర్క్యులర్ జారీ చేయాలని నెహ్రూ ప్రభుత్వాన్ని కోరారు.
"ప్రభుత్వ విభాగాల కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వాన పత్రాలు తమిళ భాషలో ఉండాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇది తమిళ భాషపై ప్రేమ, గౌరవాన్ని సూచిస్తుంది," అని సీఎం పేర్కొన్నారు.
అంతకుముందు ప్రశ్నోత్తరాల సమయంలో పబ్లిక్ వర్క్స్ అండ్ ఫిషరీస్ శాఖ మంత్రి కె. లక్ష్మీనారాయణన్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. సముద్రపు తీరం కోల్పోకుండా ఉండేందుకు పుదుచ్చేరి తీరప్రాంతంలో మొత్తం 24 కి.మీ పొడవునా రాళ్లను బౌల్డర్లు) అమర్చనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు రూ. 1,000 కోట్లు అవసరమవుతాయని, ఇందుకు కేంద్రం సాయం కోరనున్నట్లు తెలిపారు.