రామేశ్వరం బ్లాస్ట్: దశాబ్దం కిందటే దాడికి కుట్రలు
x

రామేశ్వరం బ్లాస్ట్: దశాబ్దం కిందటే దాడికి కుట్రలు

సౌత్ ఇండియాలోని కీలక ప్రాంతాలపై బాంబు దాడులు చేసేందుకు ఉగ్రసంస్థలు కొన్ని సంవత్సరాల నుంచి ప్రణాళికలు వేస్తున్నట్లు విచారణలో తేలింది.


రామేశ్వరం కెఫెలో పేలుడు పై దర్యాప్తు జరుగుతున్న కొద్ది సంచలన నిజాలు బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గుర్తించిన ఇద్దరు కీలక నిందితులు కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లికి చెందినవారు కాగా, దక్షిణ భారతదేశంలో ఎక్కువగా పనిచేస్తున్న అనేక నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధం కలిగి ఉన్నారని తేలింది.

బెంగళూరులోని ప్రముఖ కేఫ్‌లో ముస్సావీర్ హుస్సేన్ షాజిబ్ (30) బాంబును అమర్చాడని ఎన్‌ఐఏ నిర్ధారించగా, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా (30) కీలక కుట్రదారు అని నమ్ముతోంది. షాజిబ్, తాహా ఇద్దరూ తమిళనాడులో ఉగ్రవాద కేసుల్లో వాంటెడ్. కొంతకాలంగా దేశంలో "మోస్ట్ వాంటెడ్" టెర్రరిస్టుల జాబితాలో వీరి పేర్లు ఉన్నాయి.
ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం అందించిన వారికి రూ. 10 లక్షల రివార్డులను అందజేస్తామని ఎన్ఐఏ ప్రకటించింది. షాజిబ్, తాహా ఇద్దరూ నిషేధిత సంస్థలైన అల్ ఉమ్మా, (తమిళనాడుకు చెందిన ఉగ్రవాద సంస్థ), అల్-హింద్, (కేరళ)లో సభ్యులు. రహస్య సమాచారం ప్రకారం, గ్రూపులకు వేర్వేరు పేర్లు ఉండవచ్చు కానీ వాటి లక్ష్యాలన్నీ ఒకేవిధంగా ఉన్నాయి.
అనుమానితులిద్దరూ ఉగ్రవాద కార్యకలాపాల్లో శిక్షణ పొందారని, 2010 నాటి అనేక కేసులతో సంబంధం ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అలాగే, ఉగ్ర సంస్థలతో ప్రత్యేకంగా వ్యవహరించే తమిళనాడు క్యూ బ్రాంచ్ 2020లో అరెస్టు చేసిన మెహబూబ్ పాషాతో ఇద్దరికీ సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ అనుమానిస్తోంది.
తమిళనాడులో హిందూ అనుకూల నేత హత్య, కన్యాకుమారిలో పోలీసు హత్య, మైసూర్ లో పేలుడు వంటి ఉగ్రవాద కార్యకలాపాల్లో షాజీబ్, తాహాతో పాటు గతంలో అరెస్టయిన ముజమ్మిల్ షరీఫ్, షబ్బీర్‌ల ప్రమేయం ఉందని ఎన్‌ఐఏ భావిస్తోంది.
NIA విచారణ
కర్ణాటకలో 12, తమిళనాడులో ఐదు, ఉత్తరప్రదేశ్‌లో ఒకటి ఇలా దేశంలోని వివిధ ప్రాంతాల్లో 18 చోట్ల దాడులు నిర్వహించిన ముజమ్మిల్ షరీఫ్‌ను ఎన్‌ఐఏ ఇటీవల అరెస్టు చేసింది. మార్చి 1న బెంగళూరులో జరిగిన పేలుళ్ల కుట్రదారుల్లో ఇతను ఒకడని ఏజెన్సీ చెబుతోంది. మరిన్ని వివరాలు రాబట్టేందుకు అతడిని ప్రత్యేక బృందాలు విచారించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
బాంబులు అమర్చిన షాజిబ్‌ సముద్ర మార్గంలో భారత్‌ నుంచి వెళ్లిపోయినట్లు అనుమానిస్తున్నారు. అయితే అతడు ఇంకా భారత్‌లోనే తలదాచుకుంటున్నాడనే అంశంతో సహా అన్ని కోణాల్లో ఎన్‌ఐఏ ఆరా తీస్తోంది. షాజిబ్ మహ్మద్ జునేద్ సయ్యద్ అనే మరో ఉగ్రవాది తో పాటు పలువురి నకిలీ కార్డులు ఉపయోగిస్తున్నాడని దర్యాప్తు సంస్థ, అలాగే హిందువులు పేరుతో సైతం ఆధార్ వంటి కార్డులు ఉపయోగిస్తున్నాడని తెలుస్తోంది.
తీర్థహళ్లిలోని వీరిద్దరి ఇళ్లలో ఎన్‌ఐఏ బృందం సోదాలు నిర్వహించగా కొన్ని డిజిటల్ ఆధారాలు లభించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. NIA ఇద్దరి బంధువులలో దాదాపు 55 మందిని కూడా ప్రశ్నించారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ జైళ్లలో ఉన్న ఖైదీలు, అండర్ ట్రయల్‌లలో ఉన్న 40 మంది ఉగ్రవాద నిందితులను కూడా ప్రశ్నించారు. 2010 నుంచి కర్ణాటక, తమిళనాడు, కేరళలో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి పట్టుబడిన ఈ వ్యక్తులందరూ ఈ మూడు రాష్ట్రాల్లో పరస్పరం అనుసంధానించబడిన కేసులతో సంబంధాలు కలిగి ఉన్నారు.
"భారతదేశం అంతటా పనిచేస్తున్న ఇతర ఉగ్రవాద అనుమానితులతో వారికి సంబంధాలు ఉన్నప్పటికీ, వారి ప్రాథమిక దృష్టి కర్ణాటక, కేరళ, తమిళనాడుపైనే ఉంటుంది" అని కొన్ని వర్గాలు ఫెడరల్‌కి తెలిపాయి.
దేశంలో ఐ.ఎస్.ఐ.ఎస్
NIA ప్రకారం, షాజీబ్ కి మెహబూబ్ పాషా శిక్షణనిచ్చాడు. అయితే ఇతడిని 2020లో తమిళనాడు క్యూ బ్రాంచ్ కోలార్‌లో మరో ఇద్దరితో కలిపి అరెస్టు చేసింది. దీనికి సంబంధించి ఎన్ఐఏ చార్జీషీట్ దాఖలు చేసి, 17 మందిపై అభియోగాలు మోపింది. వీరంతా కలిసి భారత్ లో ఐఎస్ఐఎస్ పేరిట ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొంది. ముఖ్యంగా తమిళనాడు, కర్నాటక కేంద్రంగా ఈ కార్యకలాపాలు జరుగుతున్నాయంది. బెంగళూరులోని గురప్పనపాళ్య నివాసి అయిన పాషా, తమిళనాడులోని కడలూర్‌కు చెందిన ఖాజా మొయిదీన్, సాదిక్ బాషాతో కలిసి భారతదేశంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ అయిన ఐఎస్‌ఐఎస్ భావజాలం వ్యాప్తి చేస్తూ ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఎన్ఐఏ చార్జీ షీట్ పేర్కొంది.
పాషా ప్లాట్లు
NIA ప్రకారం, నిందితులు, ఏప్రిల్ 2019 నుంచి, దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా కర్ణాటక, తమిళంలో ఉగ్రవాద దాడులకు పాల్పడేందుకు పాషా ఇంటి నుంచి, అలాగే గురుప్పన్‌పాళ్యలోని అల్-హింద్ కార్యాలయంలో బాంబు దాడులకు కుట్ర పన్నారు. వీటిలో షాజిబ్, తాహా కూడా పాలుపంచుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.
పాషా జూలై 1, 2019 నుంచి జనవరి 10, 2020 వరకు గురప్పనపాళ్యం ఇంట్లోనే ఉన్నాడు. అతను తీవ్రవాద కుట్రల గురించి చర్చించడానికి ఇంట్లో వరుస సమావేశాలు నిర్వహించేవాడని తరువాత తేలింది. బెంగళూరులోని సీసీబీ (సిటీ క్రైం బ్రాంచ్), నిఘా విభాగం అధికారులు వీటికి సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. తరువాత, జాయింట్ ఆపరేషన్ నిర్వహించి, 2020లో పాషా తో అనేక మంది కుట్రదారులని అరెస్టు చేశారు. పేలుడు పదార్థాలు ఇతర సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు.
బేస్ ఉద్యమం
షాజిబ్, తాహా వారి నాయకుడు మెహబూబ్ పాషాతో పాటు "బేస్ మూవ్‌మెంట్"లో కూడా పాల్గొన్నారని తేలింది. వీరు న్యాయమూర్తులు కోర్టులు, పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిసింది. 2014లో తమిళనాడుకు చెందిన హిందూ సంస్థ ఇందు మక్కల్ కట్చి నాయకుడు కేపీ సురేష్ కుమార్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఖ్వాజా ముహినుద్దీన్ అలియాస్ జలాల్. అతని అనుచరులే పాషా, తాహా. పాషా సమావేశాల్లో షాజిబ్, తాహా కూడా ఉన్న సమయంలో ఇలాంటి అనేక టెర్రర్ కుట్రలకు వ్యూహాలు రచించారు. సాక్ష్యాధారాల ఆధారంగా, వారందరిపై 2020 జనవరిలో బెంగళూరులోని సుద్దగుంటెపాళ్య పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
పాత కేసులు
ఈ ఉగ్రవాదులు ఇంతకముందు 2016లో మైసూర్ కోర్టు దగ్గర బాంబు పేలుళ్లకు పాల్పడింది. అలాగే జనవరి 8, 2020న కేరళ సరిహద్దులోని కలియక్కవిలై మార్కెట్ రోడ్ చెక్‌పోస్టు వద్ద కన్యాకుమారి ఎస్‌ఎస్‌ఐ వై విల్సన్‌ హత్యలో పాలుపంచుకున్నారు. బెంగళూరులోని మల్లేశ్వరంలో గల బీజేపీ రాష్ట్ర కార్యాలయం జగన్నాథ భవన్‌ ముందు 2013లో జరిగిన బాంబు పేలుడుకు కూడా పాషా, అతని మనుషులే పాల్పడ్డారని దర్యాప్తు బృందాలు పేర్కొన్నాయి. ఆ పేలుడు తర్వాత తమిళనాడులోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు పథకం పన్నారని ఆరోపించారు.
బెంగళూరులోని బన్నేరుఘట్ట రోడ్డులో అల్ హింద్ ట్రస్ట్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు పాషా సిద్ధమవుతున్నాడని, అదే ట్రస్ట్ పేరుతో చామరాజనగర్ జిల్లా గుండ్లుపేటలో ఒకటి కొనుగోలు చేసేందుకు బేరం కుదుర్చుకున్నాడని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Read More
Next Story