
రన్యా రావుకు బెయిల్ నిరాకరణ
బంగారం అక్రమ రవాణా కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కన్నడ నటి..
బంగారం అక్రమ రవాణా కేసులో కన్నడ నటి రన్యా రావు(Ranya Rao) బెయిల్ (bail) పిటిషన్‌ను బెంగళూరు సెషన్స్ కోర్టు మూడోసారి కూడా తిరస్కరించింది. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మార్చి 3న పోలీసులు ఆమెను అరెస్టు చేసి, దుబాయ్ నుంచి అక్రమంగా తీసుకొస్తున్న రూ. 12.56 కోట్ల విలువైన 14.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బెయిల్ తిరస్కరణ నేపథ్యంలో రన్యారావు తరపు లాయర్లు త్వరలో హైకోర్టును ఆశ్రయించనున్నారు. ప్రస్తుతం రన్యారావు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
విదేశాల్లో బంగారం కొనేందుకు హవాలా సొమ్మును వినియోగించినట్లు రన్యారావు విచారణలో అంగీకరించారు. పోలీసులు ఆమె సహాయ నటుడు తరుణ్ రాజ్‌ను కేసులో రెండో నిందితుడిగా చేర్చారు. ‘‘రన్యా, రాజ్ కలిసి దుబాయ్‌కి 27 సార్లు వెళ్లి వచ్చారు. ఉదయం వెళ్లి సాయంత్రానికి తిరిగి వచ్చేవారు.’’ అని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) న్యాయవాది మధు రావు తెలిపారు.
బెయిల్ నిరాకరణకు కారణాలు..
ఈ కేసులో అంతర్జాతీయ సంబంధాలున్నాయని, బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని DRI తరుపు లాయర్ కోర్టుకు వివరించారు. బంగారు అక్రమ రవాణా వల్ల ఖజానాకు రూ. 48 మిలియన్లకు పైగా నష్టం వాటిల్లిందని డీఆర్ఐ వాదన. బుధవారం సాహిల్ జైన్ అనే వ్యాపారిని కూడా అరెస్టు చేసింది డీఆర్ఐ. ఇతను రన్యా తెచ్చిన బంగారాన్ని కరిగించి అమ్మే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.