
సీజే రాయ్
‘‘అధికారుల వేధింపులతోనే రాయ్ ఆత్మహత్య‘‘
కుటుంబ సభ్యుల ఆరోపణ, రాయ్ ను గంటన్నర విచారించిన ఐటీ అధికారులు, కీలక డాక్యుమెంట్లు తీసుకొస్తా అని ఛాంబర్ వెళ్లిన రాయ్
కేరళకు చెందిన ఐటీ అధికారుల వేధింపుల వల్లే కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ సీజే రాయ్ ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. రాయ్ శుక్రవారం ఐటీ అధికారులు బెంగళూర్ లోని తన కార్యాలయంలో సోదాలు చేస్తున్న సందర్భంగా లైసెన్స్డ్ తుపాకీతో తన ఛాతీ ఎడమ వైపు కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కేరళకు చెందిన ఆదాయపు పన్ను బృందం మూడు రోజుల పాటు జరిపిన సోదాలు, విచారణ తన సోదరుడిని ఆత్మహత్య చేసుకునే ప్రేరేపించిందని రాయ్ సోదరుడు సిజె బాబు ఆరోపించారు.
వైట్ గోల్డ్ సంస్థ యజమాని బాబు, రాయ్‌కు ఎటువంటి అప్పులు, వివాదాలు లేదా బాహ్య బెదిరింపులు లేవని చెప్పారు. “తనకు శత్రువులు లేరు, ఆర్థిక ఇబ్బందుల్లో లేరు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆయన నాకు ఫోన్ చేసి ఆదాయపు పన్ను అధికారులు వచ్చి తనపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. ఒత్తిడి భరించలేకపోతున్న అన్నారు ”అని బాబు ఆరోపించారు. అదనపు కమిషనర్ కృష్ణ ప్రసాద్ నేతృత్వంలో ఐటీ బృందం ఈ సోదాల్లో పాల్గొందని ఆయన చెప్పారు.
రాయ్ దుబాయ్ నుంచి వచ్చారు..
గత నెల వరకూ దుబాయ్ లోనే ఉన్న రాయ్.. తరువాత తన కార్యాలయాల్లో జరిగిన ఐటీ సోదాల సమాచారంతో హఠాత్తుగా బెంగళూర్ కు వచ్చారు.
శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆయన తన కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనను దర్యాప్తు అధికారులు దాదాపు 90 నిమిషాల పాటు విచారించారు. తన ఆదాయ లావాదేవీలకు సంబంధించి తగిన ఆధారాలు చూపించమని అధికారులు కోరారు.
వాటిని తీసుకొస్తామని చెప్పిన రాయ్.. తన ఛాంబర్ వెళ్లి అక్కడే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సిబ్బంది రాయ్ ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఈ సంఘటన తర్వాత, ఆదాయపు పన్ను అధికారులు మూడు ఇన్నోవా వాహనాల్లో ఆవరణ నుండి బయలుదేరి, 10 బ్యాగుల పత్రాలను తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
సంఘటన స్థలాన్ని సందర్శించిన బెంగళూర్ పోలీసులు
ఐటీ అధికారులు వెళ్లిపోయిన తరువాత బెంగళూర్ పోలీసులు సంఘటన జరిగి ప్రదేశాన్ని పరిశీలించారు. పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ... మధ్యాహ్నం 3.15 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని చెప్పారు. కంపెనీ డైరెక్టర్ ఫిర్యాదు చేశారు.
“రాయ్ తుపాకీని ఉపయోగించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉపయోగించిన పిస్టల్ రకం, దానికి లైసెన్స్ ఉందా, ఎన్ని రౌండ్లు కాల్చారు," వంటి వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. తరువాత పోలీసులు ఆదాయపు పన్ను అధికారులను కూడా ప్రశ్నించారు. దర్యాప్తు కోసం రాయ్ కు చెందిన రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
న్యాయం కావాలి
కాన్ఫిడెంట్ గ్రూప్ న్యాయ సలహదారు పతాపట్ ప్రకాశ్ మాట్లాడారు. రాయ్ కు సామాజిక స్పృహ ఎక్కువని అన్నారు. కోవిడ్ సమయంలో కూడా సిబ్బందికి జీతాలు అందించారని చెప్పారు. “అంత బలం ఉన్న వ్యక్తి ఈ చర్య తీసుకోవడం తీవ్ర ఒత్తిడిని సూచిస్తుంది. నిష్పాక్షిక దర్యాప్తును మేము కోరుతున్నాము” అని ఆయన అన్నారు.
రాయ్ భార్య, పిల్లలు దుబాయ్‌లో ఉన్నారు, అతని సోదరుడు శనివారం బెంగళూరు చేరుకుంటారని భావిస్తున్నారు. మృతదేహాన్ని నారాయణ ఆసుపత్రి నుంచి సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించారు. కుటుంబం వచ్చిన తర్వాత అక్కడ పోస్ట్‌మార్టం నిర్వహిస్తారు. ఆసుపత్రి, పరిసర ప్రాంతాలలో భారీ పోలీసు భద్రతను మోహరించారు.
(ఆత్మహత్యలను నివారించవచ్చు. సహాయం కోసం ఆత్మహత్య నివారణ హెల్ప్‌లైన్‌లకు కాల్ చేయండి. నేహా ఆత్మహత్య నివారణ కేంద్రం - 044-24640050, ఆత్మహత్య నివారణ, భావోద్వేగ మద్దతు కోసం ఆసరా హెల్ప్‌లైన్ - +91-9820466726, కిరణ్, మానసిక ఆరోగ్య పునరావాసం - 1800-599-0019, దిశ 0471- 2552056, మైత్రి 0484 2540530, స్నేహ ఆత్మహత్య నివారణ హెల్ప్‌లైన్ 044-24640050)
Next Story

