కిడ్నాప్ కేసులో భవానీ రేవణ్ణకు సుప్రీంకోర్టు నోటీసు
x

కిడ్నాప్ కేసులో భవానీ రేవణ్ణకు సుప్రీంకోర్టు నోటీసు

పలువురి మహిళలపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీ(ఎస్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.


పలువురి మహిళలపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీ(ఎస్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓ బాధితురాలిని కిడ్నాప్ చేసిన కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) భవానీని నిందితురాలిగా పేర్కొన్నారు. దాంతో ఆమె హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు. దీన్ని సవాల్ చేస్తూ సిట్ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం భవానీ రేవణ్ణకు నోటీసు జారీ చేసింది.

అత్యున్నత న్యాయస్థానంలో ఆసక్తికర వాదనలు..

సుప్రీం కోర్టులో కేసు విచారణ సందర్భంగా సిట్ తరఫున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. భవానీ రేవణ్ణకు హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్ వెంటనే జోక్యం చేసుకుని, రాజకీయ కారణాలను పక్కనపెట్టి హైకోర్టు చెప్పిన కారణాలేంటని ప్రశ్నించారు. కొడుకు చేసిన నేరాలను ప్రోత్సహించడంలో తల్లి పాత్ర ఏమిటి? అందుకు సాక్ష్యాలున్నాయా? ఆమెకు నోటీసులు జారీ చేయాల్సిన అవసరం ఏముంది? ఆని ఆయన ప్రశ్నించారు. సీఆర్‌పీసీ సెక్షన్ 164 కింద జ్యుడిషియల్ మెజిస్ట్రేట్‌ బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారని, బాధితురాలి నిర్బంధించడంలో భవానీ పాత్ర ప్రస్తావన అందులో ఉందని సిబల్ పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ కాంత్ తిరిగి స్పందిస్తూ.. ఒక మహిళకు ఉన్న స్వేచ్ఛ అంశాన్నే తాము పరిశీలిస్తున్నామని, ఆమె దోషి అయినట్లయితే అంతిమంగా విచారణలో తేలుతుందని అన్నారు. సిబల్ తన వాదనను తిరిగి కొనసాగిస్తూ, మహిళ అనే కారణంగా ఆమెకు నేరంలో ప్రమేయం లేదనే అభిప్రాయానికి బెంచ్ రాకూడదని అన్నారు. వాదోపవాదనల అనంతరం ఎట్టకేలకు భవానీ రేవణ్ణకు నోటీసులు పంపేందుకు ధర్మాసనం అంగీకరించింది.

JD(S) చీఫ్, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడయిన ప్రజ్వల్ హాసన్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఎన్నికలు జరగానికి ముందు రోజు ఆయన అశ్లీల వీడియోలు బయటకు రావడంతో దేశం వీడారు. మే 31న జర్మనీ నుంచి బెంగళూరుకు తిరిగిరావడంతో ఆయనను కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సిట్ అధికారులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

Read More
Next Story