AIADMK నుంచి సెంగొట్టయ్యన్‌ బహిష్కరణ.. కారణమేంటి?
x

AIADMK నుంచి సెంగొట్టయ్యన్‌ బహిష్కరణ.. కారణమేంటి?

సెంగొట్టయ్యన్‌‌కు రహస్య అజెండా ఉందంటున్న పార్టీ సీనియర్లు..


Click the Play button to hear this message in audio format

తమిళనాట ఊహించని రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏఐఏడీఎంకే సంస్థాగత కార్యదర్శి, ఈరోడ్ అర్బన్ జిల్లా కార్యదర్శి సెంగొట్టయన్‌ను తక్షణమే బాధ్యతల నుంచి తప్పించినట్లు పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.


బహిష్కరణకు కారణమేంటి?

అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజ్గం (AIADMK) సీనియర్ నాయకుడు KA సెంగొట్టయన్(Sengottaiyan) పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి(Palaniswami)కి 10 రోజుల అల్టిమేటం జారీ చేశారు. పార్టీని వీడిన, బహిష్కరణకు గురైన నాయకులు, కార్యకర్తలను తిరిగి వెనక్కు తీసుకురావాలని బహిరంగంగా డిమాండ్ చేశారు. తమిళనాడు(Tamil Nadu)2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఐక్య ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కూడా కోరారు. అలా చేస్తేనే పళనిస్వామి ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు. గోబిచెట్టిపాళయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో శుక్రవారం (సెప్టెంబర్ 6న) ఈ వ్యాఖ్యలు చేశారు. "పార్టీని వీడిన వారిని నిర్ణీత కాలవ్యవధిలోపు తిరిగి పార్టీలోకి తీసుకురావాలి. అలా చేస్తేనే పళనిస్వామి ప్రచారంలో పాల్గొంటా’’ అని కూడా అన్నారు.


సెంగొట్టయన్ ఎవరు?

సెంగొట్టయన్ రాజకీయానుభవం ఉన్న సీనియర్ నాయకుడు. ఎంజి రామచంద్రన్ (ఎంజిఆర్) అన్నాడీఎంకేను స్థాపించిన సమయంలో 1972లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. 1975లో పార్టీ సర్వసభ్య సమావేశానికి కోశాధికారిగా కూడా వ్యవహరించారు. 1977లో ఏఐఏడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ నేతృత్వంలో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన సెంగొట్టయన్.. తమిళనాడు రాజకీయాల్లో చాలాకాలంగా ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచారు. ఏఐఏడీఎంకే అధికారంలో ఉన్నప్పుడల్లా రవాణా, అటవీ, వ్యవసాయం, సమాచార, రెవెన్యూ శాఖలకు మంత్రిగా ఉన్నారు. జయలలిత, ఓ పన్నీర్‌సెల్వం తర్వాత పార్టీలో మూడో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా సెంగొట్టయన్‌కు పేరుంది. MGR మరణానంతరం పార్టీ ఐక్యంగా, బలంగా ఉండేందుకు జె. జయలలిత నాయకత్వం వహించమని ఒప్పించే బాధ్యత కూడా సెంగొట్టయన్ తీసుకున్నారు.


‘నాకెలాంటి బాధ లేదు’

తనను తొలగించిన కొన్ని గంటల తర్వాత సెంగొట్టయన్ తన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహించారు. పార్టీ నిర్ణయంతో తనకు ఎలాంటి బాధ లేదన్నారు.

"నాకు బాధగా లేదు. పార్టీ బాధ్యతల నుంచి నన్ను తప్పించినందుకు సంతోషంగా ఉంది. బహిష్కరణకు గురైన నాయకులతో కలిసి ఉందాం అని చెప్పాను. అన్నాడీఎంకే తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నా. అందుకే నేను అలా మాట్లాడాను." అని పేర్కొన్నారు. తొలగించే ముందు తన వివరణ అడిగి ఉండాల్సిందని గోబిచెట్టిపాళయంలోని తన నివాసంలో విలేకరులతో అన్నారు.

"పార్టీకి దూరంగా ఉన్న, బహిష్కరణకు గురైన వ్యక్తులకు ఏకం చేసే పని 10 రోజుల్లోపు ప్రారంభించాలని మాత్రమే నేను చెప్పాను. అనేక మంది కార్యకర్తల అభిప్రాయమది. ఐక్యంగా ఉంటే AIADMK గెలుస్తుందని చాలా మంది ఓటర్లు అంటున్నారు. కలిసి పోరాడడం పార్టీకి చాలా అవసరం. నా వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదు.”అని సమాధానమిచ్చారు.

పశ్చిమ తమిళనాడుకు చెందిన సెంగొట్టయన్ చాలా నెలల నుంచి ప్రస్తుత నాయకత్వం పనితీరుపై అసంతృప్తితో ఉన్నారని పార్టీ అంతర్గత వర్గాల సమాచారం. ఆయనను పక్కన పెట్టడం ఇదే మొదటిసారి కాదు. జూలై 2012లో జయలలిత స్వయంగా ఆయనను పార్టీ ప్రధాన కార్యాలయ కార్యదర్శి పదవి నుంచి తొలగించారు.


‘రహస్య అజెండా ఉంది.’

“నేను కూడా పార్టీలో సీనియర్ నాయకుడిని. కానీ నేను నా పార్టీ నిబంధనలను పాటిస్తాను. సెంగొట్టయన్‌కు అభిప్రాయ భేదాలు ఉంటే ఆయన సర్వసభ్య సమావేశంలో మాట్లాడి ఉండాలి. ఆయన తొలగింపు ఎన్నికలపై ప్రభావం చూపదు. ఆయనకు వేరే రహస్య అజెండా ఉందని మా అనుమానం” అని అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు ఎస్. సెమ్మలై అన్నారు.

Read More
Next Story