కర్నాటకలో ఎస్‌ఐ ఆత్మహత్య.. అవినీతి, వేధింపులే కారణం?
x
ఎమ్మెల్యే చన్నారెడ్డి, ఎస్ఐ పరశురాం (ఫైల్)

కర్నాటకలో ఎస్‌ఐ ఆత్మహత్య.. అవినీతి, వేధింపులే కారణం?

కర్నాటకలో ఎస్‌ఐ ఆత్మహత్య కలకలం రేపుతోంది. బదిలీకి తన భర్త నుంచి ఎమ్మెల్యే లంచం తీసుకుని చివరకు బలవన్మరణానికి కారకుడయ్యారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.


బెంగళూరుకు 490 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాద్గిర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో పరశురామ్ సబ్-ఇన్‌స్పెక్టర్ పనిచేస్తున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన పరశురామ్ ఆగస్టు 3న తన ఇంట్లో శవమై కనిపించాడు. పరశురామ్ అకాల మరణానికి యాద్గిర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చన్నారెడ్డి పాటిల్, అతని కుమారుడు పంపన్నగౌడ కారణమని మృతుడి భార్య, బావ ఆరోపిస్తున్నారు. రాజకీయ నాయకులతో పాటు పోలీసు శాఖలోని కొందరి అవినీతిపరుల వేధింపుల వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని పరశురాం భార్య శ్వేత ఆరోపిస్తున్నారు. దళితుడు కావడంతో తన భర్త పట్ల వివక్ష చూపుతూ.. డబ్బుల కోసం ఎమ్మెల్యే, ఆయన కొడుకు తన భర్తను తీవ్ర వేధింపులకు గురిచేశారని ఫిర్యాదు చేశారు.

కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. యాద్గిర్ సిటీ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయిస్తానని చెప్పడంతో పరశురాం చన్నారెడ్డి పాటిల్‌కు భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాడు. ఒక సంవత్సరం పూర్తి కాకముందే తిరిగి పరశురాంను సైబర్ క్రైమ్ విభాగానికి బదిలీ చేశారు. పరశురాం మరణించడానికి ఒకరోజు ముందు శుక్రవారం మంత్రి ప్రియాంక్ ఖర్గేతో ఫోన్‌లో మాట్లాడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఎమ్మెల్యేపై ఫిర్యాదు..

డబ్బుల కోసం తన భర్తను వేధించారని ఎమ్మెల్యే, ఆయన కుమారుడిపై శ్వేత ఫిర్యాదు చేశారు. డబ్బు కోసం పదే పదే ఒత్తిడి తెచ్చారని, దళితుడైన తన భర్తపై వివక్ష చూపారని పోలీసు సూపరింటెండెంట్ కె సంగీతకు ఫిర్యాదు చేశారు.

లంచాలకు రుచిమరిగారు..

బదిలీల్లో పారదర్శకత లేదని, లంచాలు తీసుకుని ఎమ్మెల్యేలు ట్రాన్స్‌ఫర్లు చేయిస్తున్నారని పరశురామ్‌ బావ వెంకటస్వామి ఆరోపిస్తున్నారు. యాద్గిర్ సిటీ పోలీస్ స్టేషన్‌‌లో చేరిన ఏడు మాసాలకే మరోచోటికి బదిలీ చేయడం పరశురామ్‌ను తీవ్రంగా బాధించిందని చెప్పారు. పరశురాం నుంచి డబ్బులు తీసుకున్న చన్నారెడ్డి పాటిల్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పరశురామ్ మరణించిన పదిహేడు గంటల తర్వాత పోలీసులు చన్నారెడ్డి పాటిల్‌తో పాటు ఆయన కుమారుడిపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఆర్థిక దుస్థితి గురించి బాధపడ్డాడు

బలవన్మరణానికి పాల్పడే ముందు పరశురామ్ తన ఆర్థిక ఇబ్బందుల గురించి తనతో చెప్పాడని పరశురాం మిత్రుడు ఎర్రిస్వామి పేర్కొన్నారు. "బదిలీ కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. నా దగ్గర అంత డబ్బు లేదు. గతంలో నా భార్య బంగారం నగలు తాకట్టుపెట్టి లంచం ఇచ్చాను. ఇప్పుడు మరోసారి తాకట్టు పెట్టాను" అని పరశురామ్‌ చెప్పిన మాటలను ఎర్రిస్వామి గుర్తుచేశాడు. "బదిలీ కోసం చాలా మంది దగ్గర అప్పులు చేశాడు. తన తండ్రి పేర ఉన్న భూమిని కూడా విక్రయించాలనుకున్నాడు.’’ అని చెప్పాడు.

ఎమ్మెల్యే రాజీనామాకు డిమాండ్..

ఎమ్మెల్యే చన్నారెడ్డి పాటిల్ వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ నేత బసనగౌడ పాటిల్ యత్నాల్ డిమాండ్ చేశారు. పరశురాం మృతి సహజమేనని, ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదన్న హోంమంత్రి జి పరమేశ్వర.. ఎస్‌ఐ మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కర్నాటకలో వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న వారిలో పరశురామ్ మొదటి పోలీసు అధికారి కాదు. అంతకుముందు కూడా చాలా మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు.

డీఎస్పీ ఎంకే గణపతి 2016 జూలైలో మడికేరిలోని ఓ లాడ్జిలో శవమై కనిపించిన విషయం తెలిసిందే. తన సీనియర్ అధికారులు, అప్పటి హోం మంత్రి కెజె జార్జ్‌ వేధించడంతో పాటు బెదిరింపులకు గురిచేశారని చనిపోయే ముందు సెల్ ఫోన్లో రికార్డు చేశారు. అప్పట్లో గణపతి బలవన్మరణం తీవ్ర కలకలం రేపింది. కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి బదిలీ చేశారు. అయితే మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత జార్జ్‌తో పాటు ఇతర అధికారులను సీబీఐ క్లిన్ చిట్ ఇచ్చింది.

మరికొన్ని ఘటనలు..

2017లో తుమకూరు జిల్లాలో ఇన్‌స్పెక్టర్ భీమా నాయక్ ఆత్మహత్య చేసుకున్నారు. సీనియర్ల వేధింపులే కారణమని నాయక్ కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ ఘటన కూడా పోలీసు యంత్రాంగం తీరును ఎత్తిచూపింది.

బదిలీల్లో అసమానతలు, పైస్థాయి అధికారుల వేధింపులతో 2020లో సబ్-ఇన్‌స్పెక్టర్ మల్లికార్జున్ బండిగార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మరో ఉదాహరణ.

(ఆత్మహత్యలను నివారించవచ్చు. సహాయం కోసం దయచేసి ఆత్మహత్య నివారణ హెల్ప్‌లైన్‌లకు కాల్ చేయండి: నేహా ఆత్మహత్య నివారణ కేంద్రం - 044-24640050; ఆత్మహత్య నివారణ, భావోద్వేగ మద్దతు, గాయం సహాయం కోసం ఆసరా హెల్ప్‌లైన్ +91-9820466726; కిరణ్, మానసిక ఆరోగ్య పునరావాసం - 590000 0019, దిశ 0471- 2552056, మైత్రి 0484 2540530, స్నేహ ఆత్మహత్యల నివారణ హెల్ప్‌లైన్ 044-24640050.)

Read More
Next Story