వాటి గురించి మోదీ ఎందుకు నోరు విప్పరు? ప్రశ్నించిన కర్ణాటక సీఎం
x

వాటి గురించి మోదీ ఎందుకు నోరు విప్పరు? ప్రశ్నించిన కర్ణాటక సీఎం

నా గురించి మాట్లాడే ముందు తన పార్టీలో ఉన్న అవినీతిపరుల గురించి తెలుసుకోమని చెప్పండి అని ప్రధాని మోదీకి కర్ణాటక సీఎం ఘాటుగా సమాధానమిచ్చారు.


ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల హర్యానాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తన ప్రసంగంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రస్తావన తీసుకొచ్చారు. ‘కర్ణాటక ముఖ్యమంత్రిని చూడండి. ఆయన భూ కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనపై విచారణకు హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.’ అని మోదీ వ్యాఖ్యానించారు. దీంతో సీరియస్ అయిన సిద్ధరామయ్య మోదీకి కౌంటర్ ఇచ్చారు. బీజేపీలో చాలా మంది అవినీతిపరులు ఉన్నారు. ముందు పార్టీని చక్కదిద్దుకోవాలని హితవు పలికారు.

‘ముందు తన పార్టీని చక్కదిద్దుకోమని చెప్పండి’

‘‘ఆయన పార్టీ (బీజేపీ)లో చాలా మంది అవినీతిపరులు ఉన్నారు. ముందు పార్టీని చక్కదిద్దుకోమనండి. నరేంద్ర మోదీ హిండెన్‌బర్గ్ (రిపోర్ట్) గురించి ఎందుకు మాట్లాడరు? మణిపూర్‌పై ఎందుకు మాట్లాడరు? మణిపూర్‌లో ఎందుకు పర్యటించలేదు? రాహుల్ గాంధీ (కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత) ఈ సమస్యలను లేవనెత్తారు. దానిపై మోదీ ఎందుకు మాట్లాడరు? అని విలేకరులను సిద్ధరామయ్య ఎదురు ప్రశ్నించారు.

సిద్ధరామయ్య ఎఫ్ఐఆర్ నమోదు

ముడా స్థలం కేటాయింపు కేసులో సిద్ధరామయ్య, ఇతరులపై లోకాయుక్త పోలీసులు శుక్రవారం ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదు చేశారు. బెంగళూరులోని ప్రత్యేక కోర్టు బుధవారం సిద్ధరామయ్యను విచారించాలని లోకాయుక్త పోలీసులకు సూచించిన విషయం తెలిసిందే.

సీఎం సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతికి 14 స్థలాల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్న ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆయనపై విచారణ జరిపేందుకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అనుమతి మంజూరు చేశారు. గవర్నర్ అనుమతిని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా గవర్నర్ ఉత్తర్వులను సమర్థిస్తూ తీర్పు వచ్చింది.

ఆయన నా లీగల్ అడ్వయిజర్..

ఎఫ్‌ఐఆర్‌ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, సీనియర్‌ న్యాయవాది ఏఎస్‌ పొన్నన్న తనను కలవడం గురించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. "ఆయన నా న్యాయ సలహాదారు. నేను ప్రతి రోజూ ఆయనతో చర్చిస్తాను. ఆయన పర్యటన ప్రత్యేకం కాదు.. ప్రతి రోజూ నాతో విషయాలు చర్చిస్తారు.. నేను మైసూరులో ఉన్నందున ఆయన తన నియోజకవర్గానికి (విరాజ్‌పేట) వెళుతున్నప్పుడు నన్ను కలిశారు. జేడీ(ఎస్) నేత, కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తనపై చేసిన కొన్ని ఆరోపణలపై అడిగిన ప్రశ్నకు సిద్ధరామయ్య స్పందిస్తూ, "కుమారస్వామి అబద్ధాలు మాత్రమే మాట్లాడతారు. ఆయన వ్యాఖ్యలకు నేను స్పందించను" అని పేర్కొన్నారు.

Read More
Next Story