
ధర్మస్థల కేసు SIT అధికారి మొహంతి బదిలీ?
‘‘మొహంతి స్థానంలో మరొకరితో భర్తీ చేయడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు’’ - హోంమంత్రి పరమేశ్వర
కర్ణాటక(Karnataka) ధర్మస్థల(Dharmstala)లో "సామూహిక ఖననాల" ఆరోపణలపై దర్యాప్తు చేస్తోన్న SIT బృందానికి సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రణబ్ మొహంతి నాయకత్వం వహిస్తున్న వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన త్వరలో కేంద్ర ప్రభుత్వ విధులకు వెళ్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారుల ఎంప్యానెల్‌మెంట్ లిస్టులో ఆయన పేరు కూడా ఉంది. దాంతో ఆయన త్వరలో రిలీవ్ అవుతారన్న వస్తున్న వార్తలపై సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) స్పందించారు. మొహంతి కేంద్ర ప్రభుత్వ విధులకు వెళితే ఆయన స్థానంలోకి మరొకరు వస్తారని చెప్పారు. అయితే మొహంతి స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని హోంమంత్రి జి పరమేశ్వర చెప్పారు. ఈ అంశంపై కొందరు అనవసరంగా తప్పుడు పోస్టులు పెడుతుండడం మంచిదికాదన్నారు.
దర్యాప్తును దారి మళ్లించడానికి SIT చీఫ్‌ను మారుస్తున్నారన్న ఆరోపణలపై.. పరమేశ్వర స్పందించారు. "అలాంటప్పడు SIT ఎందుకు ఏర్పాటు చేసేవాళ్ళం? వాస్తవాలు బయటకు రావాలని మాత్రమే ప్రభుత్వం కోరుకుంటోంది. అందుకే సిట్ వేశాం. దర్యాప్తు అనంతరం నివేదికలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. మాకు కావలసింది ఇదే. ప్రజలు కోరుకుంటోంది కూడా అదే," అని మంత్రి పరమేశ్వర సమాధానమిచ్చారు.
‘‘ఇందులో రాజకీయాలు లేవని, ఎవరినీ రక్షించాలన్న ఎజెండా ప్రభుత్వానికి లేదు. దర్యాప్తు పారదర్శకంగా జరగాలని మేం అధికారులకు చెప్పాం. దర్యాప్తు పూర్తయి సిట్ నివేదిక అందాక ఈ విషయంపై మాట్లాడతా,’’ అని పరమేశ్వర చెప్పారు.
మొహంతి నేతృత్వంలోని SIT బృందంలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (రిక్రూట్‌మెంట్) MN అనుచేత్, IPS అధికారులు సౌమ్యలత SK,జితేంద్ర కుమార్ దయామా ఉన్నారు. వీరితో పాటు ఉడిపి, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ నుంచి ఇరవై మంది పోలీసు సిబ్బంది - ఇన్స్పెక్టర్లు, సబ్-ఇన్స్పెక్టర్లు, హెడ్ కానిస్టేబుళ్ళు, కానిస్టేబుళ్ళను వీరికి అటాచ్ చేసిన విషయం తెలిసిందే.
అసలు కేసేమిటి?
1998-2014 మధ్యకాలంలో తాను కొన్ని వందల మంది మహిళలు, యువతులు, మైనర్ బాలికలు మృతదేహాలను ఖననం చేశానని ధర్మస్థల ఆలయ మాజీ పారిశుధ్య కార్మికుడి ఒకరు ఇటీవల పోలీసులకు చెప్పారు. ఈ విషయం చాలాసార్లు బయటకు చెప్పాలనుకున్నా.. కొంతమంది చంపేస్తామని బెదిరించడంతో చెప్పలేకపోయానని.. పశ్చాత్తాప భావన వెంటాడుతుండడంతో ధైర్యం కూడగట్టుకుని ఇప్పుడు ఫిర్యాదు చేసేందుకు వచ్చానని చెప్పాడు.
ఈ కేసు ధర్మస్థల పుణ్యక్షేత్రంతో ముడిపడి ఉండడం, సున్నితమైనది కావడంతో కర్ణాటక సిద్ధరామయ్య (CM Siddaramaiah) ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. ఇటు సిట్ అధికారులు పారిశుధ్య కార్మికుడు చెప్పిన ఆరు చోట్ల తవ్వకాలు జరిపించారు. ఒక చోట మాత్రం పూర్తి అస్థిపంజరం బయటపడింది. మిగతా 5 చోట్ల మానవ అవశేషాలు కనిపించలేదు. మరో 13 అనుమానిత ప్రదేశాల్లో తవ్వకాలు జరపాల్సి ఉంది. ఈ తవ్వకాలు దక్షిణ కన్నడ జిల్లా డిప్యూటీ కమిషనర్, అటవీ అధికారులు, ఇతర సంబంధిత అధికారుల సమక్షంలో జరుగుతున్నాయి. వారి వెంట వైద్య సిబ్బంది, ఫోరెన్సిక్ సైన్స్ నిపుణులు కూడా ఉంటున్నారు.