అప్పుడు ప్రజ్వల్.. ఇప్పుడు భవానీ..
మహిళలపై లైంగిక ఆరోపణలను ఎదుర్కొంటున్న కర్ణాటక ఎంపీ ప్రజ్వల్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఇదే కేసులో ఆయన తల్లి భవాని కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అయన తల్లి భవాని కోసం వెతుకుతోంది. ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను ప్రజ్వల్ తండ్రి, హోలెనరసిపుర జెడి(ఎస్) ఎమ్మెల్యే హెచ్‌డి రేవణ్ణ కిడ్నాప్ చేశారు. ఈ కేసులో ఆయన అరెస్టయి ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇదే కేసులో భవానీని పోలీసులు విచారించాలనుకుంటున్నారు.
భవానికి సిట్ నోటీసు..
ఇదే కేసులో సిట్ అధికారులు భవానీని నోటీసు అందజేశారు. ‘మిమ్మల్ని విచారించేందుకు జూన్ 1న మీ ఇంటికి వస్తాం. అందుబాటులో ఉండండి’ అని ఆ నోటీసు సారాంశం. అనుకున్న సమయానికి పోలీసులు ఆమె ఇంటికి వెళ్లారు. ఆమె అక్కడ లేరు. అప్పటికి భవాని ఇంటి వద్ద ఇద్దరు మహిళా లాయర్ల ఉన్నారు. భవానికి ఆరోగ్యం సరిగా లేదని, కుదుటపడగానే సిట్ ముందు విచారణకు హాజరవుతానని వారు పోలీసులకు చెప్పారు.
పోలీసుల గాలింపు..
ఇటు పోలీసులు భవానీ కోసం వివిధ ప్రాంతాల్లో అన్వేషణ మొదలుపెట్టారు. మైసూరు, హాసన్, బెంగళూరు, మాండ్య, రామనగర సహా పలు ప్రాంతాల్లో గాలించింది. ఆమె బంధువుల ఇళ్లలో కూడా తనిఖీ చేశారు. అయినా ఆచూకీ లభించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇది చట్టపరమైన ప్రక్రియ..
“సిట్ అధికారులు భవానిని అరెస్టు చేయడానికి వెతుకుతున్నారు. ఆమె ఎక్కడ ఉందో తెలియదు. ఆమె దొరికిన తర్వాత అరెస్ట్ చేస్తారు. ఇది చట్టబద్ధమైన ప్రక్రియ తప్ప మరొకటి కాదు' అని హోం మంత్రి పరమేశ్వర బెంగళూరులో విలేకరులతో అన్నారు.
ప్రజ్వల్ అరెస్టు..
పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై శుక్రవారం (మే 31) ప్రజ్వల్‌ను అరెస్టు చేశారు. ఏప్రిల్ 21న లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలు లీక్ కావడంతో ఆయన జర్మనీకి పారిపోయాడు. శుక్రవారం జర్మనీ నుంచి తిరిగి వచ్చిన ప్రజ్వల్‌ను సిట్ అధికారులు బెంగళూరు విమానాశ్రయంలో అరెస్టు చేశారు. నగరంలోని ప్రత్యేక కోర్టు జూన్ 6 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నాగలక్ష్మి చౌదరి సిఫారసు మేరకు కర్ణాటక ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.