
ధర్మస్థలలో బయటపడ్డ అస్థిపంజరం
ధర్మస్థల ఆలయ పారిశుధ్య కార్మికుడు చెప్పిన ఆరు చోట్ల తవ్వకాలు జరపగా.. ఒక చోట మాత్రం పుర్రె, ఎముకలు లభించాయి..
కర్ణాటక(Karnataka) ధర్మస్థల(Dharmasthala)లో సామూహిక ఖననాల(mass burial)పై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) గురువారం (జూలై 31) తవ్వకాలు మొదలుపెట్టింది. 1998-2014 మధ్యకాలంలో ఆలయ, నదీ పరిసరాల్లో మహిళలు, మైనర్ల మృతదేహాలను తాను ఖననం చేశానని, కొంతమంది మృతదేహాలను దహనం చేశారని ఆలయ మాజీ పారిశుధ్య కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కర్ణాటక సిద్ధరామయ్య (CM Siddaramaiah) ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. తానుచేసిన ఈ పనికి పశ్చాత్తాపడుతున్నానని, ఆ భారం తగ్గించుకోడానికి పోలీసులకు ఫిర్యాదు చేశానని కూడా పారిశుధ్య కార్మికుడు పోలీసులకు చెప్పాడు. అతను చెప్పిన ఆరు చోట్ల తవ్వకాలు జరపగా.. ఒక చోట మాత్రం పూర్తి అస్థిపంజరం బయటపడింది. మిగతా 5 చోట్ల మానవ అవశేషాలు కనిపించలేదు.
మరో 13 అనుమానిత ప్రదేశాల్లో తవ్వకాలు..
పారిశుధ్య కార్మికుడు చెప్పిన మరో 13 అనుమానిత ప్రదేశాల్లో తవ్వకాలు జరపాల్సి ఉంది. ఈ తవ్వకాలు దక్షిణ కన్నడ జిల్లా డిప్యూటీ కమిషనర్, అటవీ అధికారులు, ఇతర సంబంధిత అధికారుల సమక్షంలో జరుగుతున్నాయి. వారి వెంట వైద్య సిబ్బంది, ఫోరెన్సిక్ సైన్స్ నిపుణులు కూడా ఉంటున్నారు.
పారిశుధ్య కార్మికుడు చెప్పిన ప్రదేశాల వద్ద భద్రత కోసం పోలీసులను ఉంచారు. వాటికి నెంబర్లు కేటాయించి తవ్వకాలు జరుపుతున్నాయి. నేత్రావతి నది స్నాన ఘాట్ (స్నాన్ ఘాట్) ప్రాంతంలోనూ తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ధర్మస్థల గ్రామ పంచాయతీకి చెందిన కార్మికులు ఈ పనుల్లో నిమగ్నమయ్యారు.