బర్రెలక్క.. పెళ్లంట!
x

బర్రెలక్క.. పెళ్లంట!

చదివినా ఉద్యోగం రాలేదు, అందుకే బర్రెలు కాస్కుంటున్నానని ఓ వీడియోను పోస్ట్ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి వరల్డ్ ఫేమస్ అయిన బర్రెలక్క పెళ్లిపీటలెక్కబోతోంది..


బర్రెలక్క గుర్తుందిగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సంచలనం సృష్టించిన బర్రెలక్క సరిగ్గా పార్లమెంటు ఎన్నికలకు ముందు లగ్గానికి రెడీ అయ్యారు. తొందర్లో పెళ్లి చేసుకోబోతున్నానని, పెళ్లి కార్డును సోషల్‌ మీడియాలో పెట్టింది. బర్రెలక్క ఎలియాస్‌ శిరీష, ప్రిన్సెన్స్‌ గా నెటిజన్లకు పరిచయమైన ఆమె తనకు ఉద్యోగం రానందుకు నిరసనగా ఓ వీడియో చేసి జనం మీదికి వదిలితే అది కాస్త సంచలనమైంది. ‘హాయ్‌ ప్రెండ్స్‌.. డిగ్రీ చదువుకున్నా ఉద్యోగం రాలేదని, బర్రెలు కాయాల్సి వస్తోంది’ అంటూ ఇన్‌స్ట్రాగమ్‌లో చేసిన ఒక్కపోస్టుతో శిరీష ఎంతో ఫేమస్‌ అయ్యింది. ఆ పోస్టుతోనే శిరీష కాస్తా బర్రెలక్క అయ్యింది. అలా పాపులర్‌ అయిన బర్రెలక్క.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ వీడియో అటు దిరిగి ఇటు దిరిగి అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దాకా.. అక్కడి నుంచి లండన్‌ దాకా పోయింది. ఆమె చేసిన వీడియోపై ఆవేళ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్‌ వరకు ఎందరెందరో సెటైర్లు వేసినా ఓటు లేని చుట్టుపక్కల జనం జేజేలు కొట్టారు. కొల్లాపూర్‌ నుంచి బరిలోకి దిగిన ఆమె ఎన్నికల ఖర్చు కోసమంటూ తృణమో ఫణమో కూడా పంపారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ కి ముందు పార్లమెంటు ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానని ప్రకటించారు. తన ఎంగేజ్మెంట్‌ అయిన విషయాన్నీ వీడియో రూపంలో షేర్‌ చేశారు. సమయాభావం వల్ల ఎవ్వర్నీ పిలవలేక పోయానని కూడా బాధ పడిపోయారు. ఇప్పుడు ఏకంగా పెళ్లి కార్డును ఫేస్‌ బుక్‌ లో షేర్‌ చేశారు. తనకు కాబోయే భర్తతో వీడియో ఇదేనంటూ షేర్‌ చేశారు. ఆ వీడియోలో పేరు చెప్పలేదు గాని ఇప్పుడు పేరు బయటికి వచ్చింది. అతని పేరు వెంకటేశ్‌.

ఇంతకీ పెళ్లి ఎప్పుడంటే...
ఇప్పుడు బర్రెలక్క వెడ్డింగ్‌ కార్డ్‌ బయటికి వచ్చింది. పెళ్లి కుమారుడి పేరు వెంకటేశ్‌. తాజాగా సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేసిన బర్రెలక్క.. ‘నిశ్చితార్థం కోసం మేకప్‌ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పండి’ అంటూ తాను మేకప్‌ వేసుకుంటున్న వీడియోను ఇన్‌స్ట్రాగమ్‌లో పోస్ట్‌ చేసింది. వెంకటేష్‌ వెడ్స్‌ శిరీష అని, బ్రాకెట్‌ లో బర్రెలక్క అని రాసి ఉంది. శ్రీమతి మారేడు బక్కమ్మ, మారేడు బాలకృష్ణయ్య పేరిట ఆహ్వానాలు ప్రింటయ్యాయి. గురువారం మార్చి 28వ తేదీ వీళ్ళ పెళ్లి. ఇందుకు సంబంధించిన వీడియోని సాయి తేజ టాకీస్‌ ప్రజెంట్స్‌ అనే ఇంస్ట్రాగామ్‌ పేజ్‌ వాళ్ళు షేర్‌ చేశారు. నాగర్‌ కర్నూలు జిల్లా పెద్దపల్లి గ్రామంలో పెళ్లి జరుగునుంది. ఈ పెళ్లి కార్డు చూసిన వారందరూ బర్రెలక్క పెళ్లంటూ తెగ గ్రీటింగ్స్‌ పంపుతున్నారు.


Read More
Next Story