కంచ ఐలయ్య లాంటివారు సమాజానికి అవసరం: సిద్దరామయ్య
x

కంచ ఐలయ్య లాంటివారు సమాజానికి అవసరం: సిద్దరామయ్య

ప్రొఫెసర్ కంచ ఐలయ్యలాంటివారు సమాజానికి అవసరమని కర్నాటక సీఎం సిద్దరామయ్య అన్నారు.


నేడు కర్ణాటకలోని రాయచూర్ జిల్లా తింతని బ్రిడ్జ్ దగ్గర, కనకపీఠం ఆధ్వర్యంలో 'మా జాతి సూర్యుడు అవార్డును' కంచ ఐలయ్యకు అందజేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా ఈ అవార్డ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడారు. కంచ ఐలయ్య సమాజ శ్రేయస్సు కోసం ఎన్నో పుస్తకాలు రాసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారన్నారు. ఈ కులాధిపత్య అసమాన సమాజంలో ప్రొఫెసర్ కంచ ఐలయ్య లాంటివారి అవసరం చాలా ఉందన్నారు.

కంచ ఐలయ్య బ్రాహ్మణాధిపత్యానికి వ్యతిరేకంగా నేటి పరిస్థితులకు అనుగుణంగా ‘వై ఐయామ్ నాట్ ఏ హిందు, బఫెల్లో నేషనలిజం’ లాంటి అనేక రచనలు చేశారు. అవి కులాధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా, ఆధునిక శూద్ర సమాజ పురోగతికి, సమసమాజ స్థాపనకు ఎంతగానో దోహదపడేలా ఐలయ్య సిద్ధాంత రచన చేయడాన్ని కనక పీఠం కొనియాడింది.

ఎక్కడో తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలోని మారుమూల పల్లె పాపయ్య పేటలో, కురుమ కులంలో జన్మించిన కంచ ఐలయ్య యావత్ భారతదేశం గర్వించే స్థాయికి ఎదగడం కురుమ కులానికే గర్వకారణమని కనక పీఠం ప్రశంసించింది. కనుకనే ఐలయ్యకు యావత్ కురుమ సమాజం తరపున 'మా జాతి సూర్యుడు' అవార్డును అందజేస్తున్నామన్నారు. అనంతరం కనక పీఠం పీఠాధిపతి శ్రీ సిద్ధారామానంద మహాస్వామి సగర్వంగా తలపాగా తొడిగి రూ. 50వేల నగదును కంచ ఐలయ్యకు అందజేశారు.

కంచ ఐలయ్య మాట్లాడుతూ కర్ణాటక ప్రభుత్వం తమ రాష్ట్రంలోని దళిత బహుజనుల పిల్లలందరికీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ప్రారంభించాలని, అగ్రకులాల పిల్లల చదువులకు బహుజనుల పిల్లలు ఏ మాత్రం తీసిపోకుండా చూడాలని సిద్ధరామయ్యని కోరారు. జాతి సూర్యుడిగా అవార్డు ఇచ్చిన కనకపీఠం ఇచ్చిన వారికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సభలో కేంద్ర ఎరువులు, రసాయన శాఖ మంత్రి భగవంత్ ఖుభా, కర్ణాటక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బైరతి సురేష్, తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ చలకాని వెంకట్ యాదవ్, ప్రొఫెసర్ నర్రి యాదయ్య, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ విప్లవ్, దాసరి శ్రీనివాస్, ఉస్మానియా విద్యార్థులు కొంగల పాండు, గురునాధ్, సురేందర్, దయ్యాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Read More
Next Story