మంగళసూత్రం, మోదీ  మ్యాచ్ కావంటున్న ప్రియాంక
x

మంగళసూత్రం, మోదీ మ్యాచ్ కావంటున్న ప్రియాంక

దేశం కోసం సోనియాగాంధీ తన మాంగల్యాన్ని త్యాగం చేసిందని ప్రియాంకగాంధీ అన్నారు. ప్రధాని మోదీ బంగ్లా ముస్లిం చోరబాటుదారులకు కాంగ్రెస్ దోచిపెడుతోందనే వ్యాఖ్యలకు..


సోనియా గాంధీ దేశం కోసం తన మాంగళ్యాన్ని త్యాగం చేసిందని ప్రియాంకగాంధీ వాద్రా అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలన లో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. దేశంలో స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో 55 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉందని, దేశంలో ఎక్కడా చూసిన స్వేచ్చ కనిపించేదని చెప్పారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో, బంగ్లాదేశీ ముస్లిం చొరబాటు దారుల గురించి మోదీ చేసిన వ్యాఖ్యలకు ప్రియాంక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

“ఈ దేశంలో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి? మీ మంగళసూత్రాన్ని కాంగ్రెస్ లాక్కుంటుందంటూ రెండు రోజుల క్రితం ఒకరు ఆరోపించారు. 55 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంది. మీ బంగారాన్ని లేదా మంగళసూత్రాన్ని కాంగ్రెస్ ఎప్పుడైనా లాక్కుందా?'' అని బెంగళూరులో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె ప్రశ్నించారు.
ప్రజలు కష్టపడి సంపాదించి కట్టిన పన్నులను కాంగ్రెస్ బంగ్లాదేశ్ ముస్లిం చొరబాటుదారులకు ఇస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల క్రితం రాజస్తాన్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో విమర్శించారు. ఈ వ్యాఖ్యలను ప్రియాంక ప్రస్తావించారు. దేశంలో యుద్దాలు సంభవించినప్పుడు ఇందిరాగాంధీ తన బంగారాన్ని దేశానికి విరాళంగా ఇచ్చారు. నా తల్లి కూడా తన మంగళసూత్రాన్ని దేశం కోసం త్యాగం చేసిందని ప్రజలకు గుర్తు చేశారు.
'మంగళసూత్రం' యొక్క ప్రాముఖ్యతను నరేంద్ర మోదీ అర్థం చేసుకుని ఉంటే, అతను ఇలాంటి అనైతిక మాటలు మాట్లాడేవాడు కాదు" అని ఆమె అన్నారు. మహిళల సేవా స్ఫూర్తి, భారతదేశ సంప్రదాయాలన్నిటికీ పునాది అని ప్రియాంక అన్నారు.
కుటుంబంలో అందరూ నిద్రపోయే వరకు మహిళలు నిద్రపోరు, కుటుంబంలో ఇబ్బందులు తలెత్తినప్పుడు మహిళలు తమ ఆభరణాలను తాకట్టు పెడతారని అన్నారు. "మహిళలు ఇతరులను ఖాళీ కడుపుతో నిద్రపోనివ్వరు. బదులుగా తమ కడుపు ఖాళీగా ఉంచుకుని నిద్రపోవడానికి వారు ఇష్టపడుతుంటారు." అని చెప్పారు.
“ఈ వ్యక్తులకు (బిజెపి) మహిళల పోరాటం తెలియదు. రైతు అప్పుల పాలైనప్పుడు, అతని భార్య తన మంగళసూత్రాన్ని తాకట్టు పెడుతుంది. కుటుంబంలో కుమార్తె వివాహం లేదా ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు, ఆ మహిళ తన ఆభరణాలను తనఖా పెడుతుంది, ”అని ప్రియాంక వ్యాఖ్యానించారు.
మహిళల కష్టాలు మోదీకి అర్థం కావడం లేదని,2016 లో మోదీ ఏకపక్షంగా నోట్లరద్దు చేసి మహిళలు దాచుకున్న పొదుపును మొత్తం కొల్లగొట్టారని అన్నారు. కోవిడ్ లాక్ డౌన్లు ప్రకటించి అనేకమంది కార్మికులను నగరాల్లో చిక్కుకునేలా చేశారని, అప్పుడు మహిళలు బతకడానికి ఆభరణాలు తాకట్టు పెట్టారని, అప్పుడు మోదీ ఎక్కడున్నారని ప్రశ్నించారు.
రైతుల ఆందోళనలో 600 మంది రైతులు చనిపోయారు. ఆ మహిళల 'మంగళసూత్రం' గురించి మోదీ ఒక్కసారైనా ఆలోచించారా? మణిపూర్‌లో ఒక మహిళను నగ్నంగా ఊరేగించినప్పుడు, మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు. ఆమె మంగళసూత్రం గురించి ఎందుకు ఆలోచించలేదు? అని ప్రియాంక ప్రశ్నించారు.
ఈరోజు ఎన్నికల కోసం మాత్రమే మీరు మహిళల గురించి మాట్లాడుతున్నారు, వారి ఓట్లు తీసుకోవడానికి, వారిని భయపెట్టడానికి మాత్రమే," ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్న మోదీ సిగ్గుపడాలి. దేశంలో సమస్యలను పక్కదారి పట్టించేందుకు చీప్ టాక్, చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని, ఎలాంటి రాజకీయాలు కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని కోరారు.
“మీకు 'నైటిక్ రాజనీతి' (నైతిక రాజకీయాలు) కావాలా లేదా 'నాటక్ రాజనీతి' (నాటక రాజకీయాలు) కావాలా అని మీరు నిర్ణయించుకోవాలి; 'సత్తా కి రాజనీతి' (అధికార రాజకీయాలు) లేదా 'సత్య కి రాజనీతి' (సత్య రాజకీయాలు); 'పరోపకర్' (ప్రయోజనం) లేదా 'అహంకార్' (అహం)" అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అన్నారు. ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని, మీరు మేల్కొనకపోతే ఈ దేశం అగాధంలోకి వెళ్లిపోతుందని ఆమె అన్నారు.
Read More
Next Story