మాకో ప్రత్యేక రాష్ట్రం కావాలంటున్న కర్నాటక రైతులు.. ఎందుకలా?
x

మాకో ప్రత్యేక రాష్ట్రం కావాలంటున్న కర్నాటక రైతులు.. ఎందుకలా?

తాము ఇప్పటికే ఓ సారి నిర్వాసితులు అయ్యాయి. ఇప్పుడు మా భూములను అటవీ భూములుగా ప్రకటించి మరోసారి నిర్వాసితులుగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


దేశంలో ప్రత్యేక రాష్ట్రాల ఉద్యమాలు జరిగి దాదాపు దశాబ్ధ కాలం అవుతోంది. చివరిగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమాల తరువాత అంత గొప్ప రాష్ట్ర ఉద్యమం మరొకటి జరగలేదు. ప్రస్తుతం రాష్ట్ర హోదా కోల్పోయిన జమ్మూకాశ్మీర్ కు మళ్లీ ఇస్తామని కేంద్రం ప్రకటిస్తోంది. కానీ అక్కడ ఉద్యమాలు మాత్రం జరగడం లేదు. కానీ ప్రస్తుతం కర్ణాటక కొండ ప్రాంతాల్లో మళ్లీ ప్రత్యేక రాష్ట్ర నినాదం మోగుతోంది. కన్నడ నాట మూడు దశాబ్దాల తరువాత మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు ప్రారంభం అయ్యాయని చెప్పవచ్చు.

సోమవారం నుంచి రాష్ట్రంలోని పశ్చిమ కనుమల జిల్లాల రైతులు సాగర్‌లో నిరవధిక నిరసనను ప్రారంభిస్తారని ప్రకటించారు. 1996-97లో చివరిసారిగా ఇటువంటి ఆందోళనలు జరిగాయి. ఆధునిక దేవాలయాలుగా అభివర్ణిస్తున్న డ్యాముల నిర్మాణం వల్ల తమ జీవనోపాధి పోతోందని, నిర్వాసితులమవుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడు దశాబ్దాలుగా ఇలాగే జరుగుతోందని ప్రజలు ఆందోళనలకు దిగారు.
ఇళ్లు, జీవనోపాధి పోయింది
జలవిద్యుత్ ప్రాజెక్టులైన షరావతి, భద్ర, సవేహక్లు, చక్ర, వారాహి వంటి జలవిద్యుత్ ప్రాజెక్టులు కర్ణాటక అంతటా వెలుగులు నింపగా, ఇవి ఘాట్లలోని మల్నాడు ప్రాంతంలోని ప్రజల బతుకుల్లో చీకటికి కారణమయ్యాయి. ఇక్కడ నిర్మించిన ప్రాజెక్ట్ ల వల్ల ప్రజలు తమ ఇళ్లను కోల్పోయారు.
వారి భూముల నుంచి నిర్వాసితులయ్యారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారం లేదా పునరావాసం పొందలేదు. సొంత కష్టంతో ఇతర ప్రాంతాల్లో స్థిరపడినా.. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని అటవీభూమిగా ప్రకటించడంతో మరోసారి నిర్వాసితులవుతామని ఆందోళన చెందుతున్నారు. ఒకే ప్రజలు రెండు సార్లు నిర్వాసితులు కావడం ఏంటనీ ప్రశ్నిస్తున్నారు.
1940లో షరావతి లోయలో - రాష్ట్రంలోని కొండ ప్రాంతంలో నిర్మించిన రిజర్వాయర్లలో హిరేభాస్కర ఆనకట్ట మొదటిది. అప్పటి నుంచి, షిమోగాలోని మూడు జిల్లాల్లో 100 కిలోమీటర్ల పరిధిలో 10 కంటే ఎక్కువ ఆనకట్టలు నిర్మించారు. చిక్కమగళూరు, ఉత్తర కన్నడ లో ఇవి కేంద్రీకరించబడ్డాయి. ఈ ప్రాజెక్ట్ ల వల్ల వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
అయితే ఇటీవల 2011-12లో షిమోగా జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాల రెవెన్యూ భూములను అటవీ భూమిగా నోటీసులు జారీ చేశారు. అందులో కనీసం 1.5 లక్షల ఎకరాలు సాగు విస్తీర్ణం ఉన్న భూములు ఉన్నాయి. ఇక్కడే ప్రాజెక్ట్ ల నిర్వాసితులు తమ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు.



రైతుల డిమాండ్లు
అటవీ హక్కుల చట్టం ప్రకారం, నష్టపరిహారం భూకేటాయింపులు కోరుతూ సమర్పించిన 90,000 దరఖాస్తులను పూర్తిగా ప్రభుత్వం పక్కన పెట్టిందని, దీనివల్ల కొండ ప్రాంతంలోని చాలామంది ప్రజలు వీధినపడుతున్నారని ఈ పోరాటంలో చురుకుగా పాల్గొంటున్న టీఎన్ శ్రీనివాస్ వివరించారు.ఆయన ఫెడరల్ కర్ణాటకతో మాట్లాడుతూ.. గత ఆరు దశాబ్ధాలుగా ఇక్కడి రైతులు నిరంతరం అణచివేతను ఎదుర్కొంటున్నారని అన్నారు.
ఇప్పుడు వివిధ ప్రాజెక్టుల బాధితులకు హక్కు పత్రాలు ఇవ్వాలని, అటవీ హక్కుల దరఖాస్తులను పునఃపరిశీలించాలని, షిమోగా జిల్లాను ప్రత్యేక కేసుగా పరిగణించి భూహక్కులు మంజూరు చేయాలని సహా 14 డిమాండ్లను రైతులు ప్రభుత్వం ముందుంచారు. అలాగే కేపీసీ భూమిని వారి వారసులకు తిరిగి ఇవ్వాలని, శరావతి బాధితుల గ్రామాలకు పౌరసౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
నిరవధిక సత్యాగ్రహం
హెచ్ గణపతియప్ప స్థాపించిన షిమోగా జిల్లా రైతు సంఘం, వరద బాధితులు, భూ నిర్వాసితుల ఐక్య వేదిక సహా పలు ఇతర సంస్థలు సోమవారం నుంచి నిరవధిక దీక్షకు పిలుపునిచ్చాయి. “మన కొండ ప్రాంతాలలో నివసించే వారి ప్రాణాలను కాపాడటానికి ఇది మా చివరి యుద్ధం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 6 ప్రకారం మాకు ప్రత్యేక రాష్ట్ర హోదా కావాలి. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మానవ హక్కుల ఉల్లంఘనలు, కొండ గిరిజనులపై అన్యాయాలు చేశాయి. పథకాలు, చట్టాల పేరుతో ప్రజల జీవించే హక్కును కాలరాశారు’’ అని శ్రీనివాస్ ఆరోపించారు.
మూడు దశాబ్దాల తర్వాత
మూడు దశాబ్దాల క్రితం కూడా సాగర్ పట్టణంలో ప్రభుత్వం 1996-97లో మైనింగ్ కోసం సమీప ప్రాంతాలను సర్వే చేయడం ప్రారంభించినప్పుడు ఈ ప్రాంత ప్రజలు పెద్దఎత్తున నిరసన చేపట్టారు.
ఆ సమయంలో జరిగిన నిరసన సభలో మాట్లాడిన మెగసెసె అవార్డు గ్రహీత కెవి సుబ్బన్న.. కొండవాలు ప్రజల కష్టాల పరంపర కొనసాగుతూనే ఉందన్నారు. ప్రభుత్వాలు గుడ్డివి, వారు లాభం పొందగలిగితే, వారు స్థానిక ప్రజల ఖర్చుతో మైనింగ్, జలవిద్యుత్ ప్రాజెక్టులను క్లియర్ చేస్తారు. అందుకే మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేశారు.
Read More
Next Story