
రాష్ట్రపతి అడిగిన ప్రశ్నలను ఇతర రాష్ట్రాల సీఎంలతో చర్చిస్తా..
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్..
రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి/గవర్నర్ గరిష్ఠంగా మూడు నెలల్లోగా వాటిని ఆమోదించడం లేదా తిప్పి పంపడం చేయాలని సుప్రీంకోర్టు నిర్దేశించిన నేపథ్యంలో.. సమయం గురించిన ప్రస్తావన, నిబంధన రాజ్యాంగంలో లేనప్పుడు.. సుప్రీంకోర్టు తీర్పు ఎలా చెల్లుబాటు అవుతుందని ముర్ము అత్యున్నత న్యాయస్థానాన్ని తిరిగి ప్రశ్నించారు.
శాసనసభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్లు ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవి తీవ్ర జాప్యానికి గురికావడంపై సుప్రీంకోర్టు (Supreme Court) గత నెల 8న సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి అంశాలపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ గవర్నర్‌తో పాటు రాష్ట్రపతికి గడువు విధించింది. ఈ తీర్పును రాష్ట్రపతి (Droupadi Murmu) ప్రశ్నించారు. రాజ్యాంగంలో అలాంటి నిబంధనే లేనప్పుడు.. సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇచ్చిందని? అది ఎలా చెల్లుబాటు అవుతుందని ముర్ము అడిగారు. రాజ్యాంగంలోని 143(1) అధికరణం ప్రకారం తనకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించుకొన్న రాష్ట్రపతి ముర్ము.. ఈ మేరకు సుప్రీంకోర్టును వివరణ కోరారు.
సుప్రీం తీర్పు ఇదే..
తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆమోదించకుండా తన వద్దే ఉంచుకోవడం సరికాదని ఈ ఏడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీనికి సంబంధించి 415 పేజీల తీర్పు వెలువరించింది. రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి/గవర్నర్ గరిష్ఠంగా మూడు నెలల్లోగా ఆమోదించడమో, తిప్పి పంపించడమో చేయాలని నిర్దేశించింది. బిల్లులను వెనక్కి పంపితే అందుకు గల కారణాలనూ తెలపాలని స్పష్టం చేసింది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని నేరుగా ఆశ్రయించవచ్చని తేల్చిచెప్పింది.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును రాష్ట్రపతి అడిగిన ప్రశ్నపై ఇతర ముఖ్యమంత్రులతో చర్చిస్తానని స్టాలిన్(MK Stalin) చెప్పారు. "మేం ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు, నాయకుల అభిప్రాయాన్ని తీసుకుంటాం. దాని ప్రకారం ముందుకు వెళ్లాం’’, అని విలేకరులతో అన్నారు. మరో ప్రశ్నకు..2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. “కేవలం 2026లోనే కాదు, 2031లోనూ, 2036లోనూ ద్రవిడ మున్నేట్ర కళగం పాలన కొనసాగుతుందని చెప్పారు.