ఆగి.. సాగిన లోకేష్‌ యాత్ర

విశాఖపట్నంలో యాత్ర ముగిసే అవకాశం


ఆగి.. సాగిన లోకేష్‌ యాత్ర
x
TDP GENERAL SECRETARY NARA LOKESH PADAYAATRA

సీఎం జగన్‌పై ఘాటు విమర్శలు

పెరిగిన అనుభవం, ప్రశ్నించే తత్వం
పలువురితో మమేకం
విశాఖపట్నంలో యాత్ర ముగిసే అవకాశం
(జిపి వెంకటేశ్వర్లు)
మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్ట్‌తో ఆగిపోయిన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర తిరిగి ముందుకు సాగుతోంది. పాదయాత్రలో లోకేష్‌ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నాడు. ఈ సైకో జగన్‌ ధనవంతులు, పేదల మధ్య యుద్ధమంటున్నాడు. ఈయన పేదవాడా అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నాడు. చంద్రబాబునాయుడు జైల్లో ఉన్నంతకాలం ఢిల్లీ, హైదరాబాద్, అమరావతిల్లో సమాలోచనలు చేసి బెయిల్‌పై బయటకు తీసుకు రావడంలో లోకేష్‌ కృతకృత్యుడయ్యాడని పలువురు రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
పాదయాత్రవల్ల అనుభవం పెరిగింది. జనంతో మమేకమై అడుగులు వేస్తున్నారు. చిన్నా పెద్దా, యువత తేడా లేకుండా అందరినీ పలకరిస్తూ ముందుకు సాగుతున్నాడు. 79 రోజుల పాటు బ్రేక్‌పడిన పాదయాత్ర 2023 నవంబరు 27న తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం కోనసీమ జిల్లాలో యాత్ర సాగుతున్నది. నేటికి 213వ రోజుకు పాదయాత్ర చేరుకున్నది.
తండ్రి జైల్లో ఉండగా అన్నీ తానై..
నారా లోకేష్‌ తండ్రి చంద్రబాబునాయుడు ఏపీలోని రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉండగా అన్నీ తానై లోకేష్‌ పార్టీని నడిపించారు. పార్టీలో సీనియర్‌ నాయకులను కలుపుకుని పలు సార్లు ప్రెస్‌మీట్లు ఏర్పాటు చేసి ప్రభుత్వ విధానాలు, సీఎం జగన్‌ తీరును దుయ్యబట్టారు. మీడియా వారిపై సెటైర్లు వేస్తూ జోష్‌ తీసుకొచ్చారు. తన తల్లి నారా భువనేశ్వరితో నిజం గెలవాలంటూ పలు చోట్ల సభలు నిర్వహించారు. ఈ సభల్లో భువనేశ్వరి మహిళలను ఆకట్టుకోగలిగింది. కొందరు వృద్ధ మహిళలు ఈమె ప్రసంగానికి కన్నీరు పెట్టారు. సానుభూతిని సంపాదించడంలో భువనేశ్వరి విజయం సాధించారు.
పవన్‌ కళ్యాణ్‌తో సఖ్యతగా...
యువగళం పాదయాత్ర ఆగిన సమయంలో పలు మార్లు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌తో అడుగులు వేశారు. పవన్‌ కళ్యాణ్‌కూడా పలు సందర్భాల్లో లోకేష్‌తో అడుగులు కలిపారు. చంద్రబాబు జైల్లో ఉండగా ఆయనను కలిసిన పవన్‌ కళ్యాణ్‌ జైలు బయట ప్రెస్‌మీట్‌ పెట్టి తమ పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతుందని ప్రకటించారు. ఆ సందర్భంలోనూ లోకేష్‌ తన మామ నందమూరి బాలకృష్ణతో కలిసి సమాలోచనలు చేసి అడుగులు వేశారు. అప్పుడప్పుడూ మంగళగిరి నియోజకవర్గాన్ని కలియతిరుగుతూ గడిపారు. ప్రస్తుతం పాదయాత్ర కొనసాగిస్తున్నారు.
పెరిగిన ప్రశ్నించే తత్వం
పాదయాత్ర సభల్లో ప్రశ్నించడం బాగా అలవాటు చేసుకున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విరుచుకు పడటం, సమస్యలపై గళం విప్పడం, తాము చేసిన ప్రతి పనినీ ప్రభుత్వం తప్పుపట్టడం ఏమిటని ప్రశ్నించడం పలువురిని ఆకర్షిస్తున్నది. ఈ పాదయాత్ర లోకేష్‌ మైలేజీని పెంచిందనడంలో సందేహం లేదు.


Next Story