విద్యార్థుల వలసలను నివారించాలి..యూడీఎఫ్
x

విద్యార్థుల వలసలను నివారించాలి..యూడీఎఫ్

విద్యార్థుల వలసలను ఆపకపోతే కేరళ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతుందని కేరళలోని యూడీఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది.


కేరళలో విద్యార్థుల వలసలు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) ఆందోళన వ్యక్తం చేస్తోంది. గురువారం అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తింది. ప్రమాదకర ఈ ధోరణికి ముగింపు పలకకపోతే కేరళ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతుందని పేర్కొంది. ఈ అంశంపై చర్చించాలని పట్టుబట్టింది. అయితే ఈ ధోరణి ఒక్క కేరళకే పరిమితం కాదని, గ్లోబలైజేషన్‌లో విద్యార్థుల వలసలు సాధారణమేనని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు సమాధానమిచ్చారు. స్పీకర్ చర్చకు అనుమతి నిరాకరించడంతో ప్రతిపక్షాలు వాకౌట్‌ చేశాయి.

ఆ అంశాన్నీ ప్రభుత్వం పరిశీలిస్తోంది..

‘‘విద్యార్థుల వలసలు చాలా తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి. విద్యార్థులు చదువుతో పాటు పనిచేసుకునే సౌలభ్యం ఉండడంతో విదేశాలకు వెళ్తున్నారు. వీసా నిబంధనలు సరళతరం చేయడం కూడా వలసలకు కారణం. ఈ వలసల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ‘నేర్చుకుంటూనే సంపాదించండం’ ప్రాజెక్టులను ప్రారంభించింది’’ అని విద్యాశాఖ మంత్రి వివరించారు. ఇదే సమయంలో విద్యార్థులకు ఉద్యోగాల ఆశచూపి విదేశాలకు పంపే ఏజెన్సీలను నియంత్రించేందుకు చట్టాలను రూపొందించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి తెలిపారు.

జాతీయ స్థాయిలో కేరళలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో మంచి ఫలితాలు వస్తున్నందున ఈ అంశంపై సభలో చర్చించాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు.

మంత్రి వాదనతో కాంగ్రెస్ ఎమ్మెల్యే మాథ్యూ కుజల్నాదన్ ఏకీభవించలేదు. రాష్ట్రంలో విద్యార్థుల మనుగడకు సరైన పరిస్థితులు లేకపోవడంతో కేరళను వీడుతున్నారని ఆరోపించారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి నిలిచిపోవడమే దానికి కారణమని అభిప్రాయపడ్డారు. పట్టణ నిరుద్యోగం అత్యధికంగా ఉండడాన్ని కుజల్‌నాదన్ కూడా ఎత్తి చూపారు.

అయితే కుఝల్‌నాదన్ వాదనలు వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉన్నాయని బిందు కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సతీశన్ కూడా విద్యార్థుల వలసలు ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ప్రతిపక్షం వ్యతిరేకం కాదంటూనే.. చాలామంది విద్యార్థులు భారీ మొత్తంలో డబ్బులు ఖర్చుపెట్టి విదేశాలను వెళ్తున్నారని.. అయితే ఇక్కడ చేసే ఉద్యోగాలే అక్కడ చేస్తున్నారని గుర్తు చేశారు. చదువులు పూర్తయిన తర్వాత కూడా విద్యార్థులు తిరిగి కేరళకు రాకపోవడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు.

Read More
Next Story