
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్
36 సంవత్సరాల తరువాత కర్ణాటకలో విద్యార్థి సంఘాల ఎన్నికలు
నిషేధం ఎత్తివేసే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం
మూడు దశాబ్ధాల తరువాత కర్ణాటక లో తిరిగి విద్యార్థి ఎన్నికలు నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రకటించారు. ఎన్నికల పద్దతులను అధ్యయనం చేసి, నివేదిక సమర్పించడానికి పార్టీ నాయకులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.
రాష్ట్ర విద్యా సంస్థలలో విద్యార్థుల ఎన్నికలపై 36 సంవత్సరాలుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇది దక్షిణ భారతంలో క్యాంపస్ రాజకీయాలను తిరిగి ప్రారంభించినట్లు అవుతుంది.
నవంబర్ లో జరిగిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో శివకుమార్ ఈ ప్రతిపాదన గురించి మాట్లాడారు. విద్యార్థి సంఘాల ఎన్నికలను తిరిగి ప్రవేశపెట్టడం వల్ల క్యాంపస్ లలో రాజకీయ నాయకత్వాన్ని సృష్టించడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు.
కమిటీలో మంత్రులు, శాసనసభ్యులు, విద్యార్థి నాయకులు..
డిప్యూటీ సీఎం ఏర్పాటు చేసిన తొమ్మిది మంది సభ్యుల కమిటీకి వైద్య విద్య మంత్రి శరణ్ ప్రకాశ్ పాటిల్ కన్వీనర్ గా నియమితులయ్యారు. ఈ ప్యానెల్ లో ఉన్నత విద్యా మంత్రి ఎంసీ సుధాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్ యూఐ) రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఉన్నారు. డిసెంబర్ 27న రాసిన లేఖలో కమిటీ తన నివేదిక, సిఫార్సులను 15 రోజుల్లోగా సమర్పించాలని కోరినట్లు శివకుమార్ తెలిపారు.
‘‘విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం వల్ల విద్యార్థులలో ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని ప్రొత్సహిస్తుంది. ఇటువంటి ఎన్నికలు విద్యార్థులలో విద్యా క్రమ శిక్షణను కాపాడుకోవడానికి, నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి సహాయపడుతాయని పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్యక్తం చేసిన అభిప్రాయాల ఆధారంగా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కెపీసీసీ) విద్యార్థి సంఘాల ఎన్నికలను తిరిగి ప్రవేశపెట్టాలని సూచించింది’’ అని ఆయన వివరించారు.
ప్రస్తుత పరిస్థితులను అంచనా వేయడానికి, అటువంటి ఎన్నికలు నిర్వహించడం సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఈ కమిటీని ఏర్పాటు చేశారు దాని సిఫార్సులతో పాటు సమగ్ర నివేదికను సమర్పించే బాధ్యత దీనికి అప్పగించారు.
హింస కారణంగా నిషేధం..
1989 కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడూ కర్ణాటకలో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిషేధించబడ్డాయి. అప్పటి ముఖ్యమంత్రి వీరేంద్ర పాటిల్(1989-90) ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కళాశాల క్యాంపస్ లలో వరుస హింసాత్మక సంఘటనలు, ఘర్షణల నేపథ్యంలో విద్యార్థి జీవితంలో రాజకీయ పార్టీల ప్రభావం పెరుగుతుందనే ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికలు ఏ దశల్లో నిర్వహించవచ్చో అధ్యయనం చేయడం, సిఫార్సు చేయడం, ఎన్నికలు నిర్వహించడం వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు, పరిణామాలను పరిశీలించడం, రాజకీయ పార్టీ బ్యానర్ల కింద, సిద్దాంతాల ఆధారంగా లేదా విద్యార్థి సంక్షేమంపై దృష్టిసారించిన రాజకీయేతర పద్దతిలో ఎన్నికలు నిర్వహించాలా వద్దా అని నిర్ణయించడం కమిటీ నిబంధనలలో ఉన్నాయి.
అభ్యర్థుల అర్హత ప్రమాణాలు, ఎన్నికల విధానాల, వ్యవస్థలు, ఖర్చులు, పారదర్శకత, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాలు, భద్రతా ఏర్పాట్లు, ప్రాతినిధ్యం, చేరిక, మహిళలు, అణగారిన వర్గాలు, వికలాంగ విద్యార్థులకు రిజర్వేషన్ లేదా కోటాలు, విద్యా షెడ్యూల్ లకు అంతరాయం కలిగించకుండా విద్యార్థి సంఘం నిబంధనలను కూడా ప్యానెల్ పరిశీలిస్తుంది.
శివకుమార్ అనేక సందర్భాలలో తాను విద్యార్థి నాయకుడిగా ఉన్న రోజులను గుర్తుకు తెచ్చుకున్నాడు. విద్యార్థి రాజకీయాలు తన రాజకీయ ప్రయాణాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు.
Next Story

