కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న సూపరింటెండెంట్ ఆత్మహత్య
x

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న సూపరింటెండెంట్ ఆత్మహత్య

కర్ణాటకలో ఓ ఉన్నతాధికారి ఆత్మహత్య సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని కుదిపేస్తుంది. బలవన్మరణానికి కారకుడైన మంత్రిని బర్తరప్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.


కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కార్పొరేషన్ (KMSDSC) సూపరింటెండెంట్ పి చంద్రశేఖర్ (48) మే 28న తన స్వస్థలం శివమొగ్గలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడి డెత్‌నోట్‌ ఆధారంగా ముగ్గురు సహోద్యోగులను సస్పెండ్ చేశారు. అదే నోట్‌లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బి నాగేంద్ర పేరు ప్రస్తావించకపోయినా.. ఆయన ప్రమేయం కూడా ఉన్నట్లు సమాచారం. ఈ సుసైడ్ ఇప్పుడు రాష్ట్రంలో కలకలం రేపుతోంది.

అసలు సూసైడ్ నోట్‌లో ఏముంది?

కార్పొరేషన్‌కు కేటాయించిన రూ.187 కోట్ల నుంచి రూ.80 నుంచి 85 కోట్లు దారి మళ్లిన విషయాన్ని చంద్రశేఖర్ తన ఆరు పేజీల సూసైడ్ నోట్‌లో వివరించారు. మంత్రి కార్యాలయం, ఎండీ పద్మనాభం, అకౌంట్స్ మేనేజర్ పరశురాం దుర్గన్న సహా కీలక అధికారుల పాత్రను అందులో రాశారు. అవినీతి అధికారులపై చర్య తీసుకోవాలని నోట్‌లో చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.

‘వెంటనే బర్తరఫ్ చేయాలి’

మంత్రి నాగేంద్రను జూన్ 6 లోపు బర్తరఫ్ చేయకపోతే రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపడతామని భారతీయ జనతా పార్టీ హెచ్చరించింది. నాగేంద్రను వెంటనే కేబినెట్ నుంచి తప్పించాలని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర డిమాండ్ చేశారు. ఘటనపై కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని ఆయన కోరుతున్నారు.

గతంలో ఇలా..

మంత్రి నాగేంద్ర ప్రమేయం ఉందనడానికి ఆధారాలు లేవని కర్ణాటక హోంమంత్రి చెబుతున్నారు. అప్పటి బీజేపీ మంత్రి ఈశ్వరప్పపై వచ్చిన ఆరోపణలకు ఆధారాలు లేకపోయినా కాంగ్రెస్ నేతల డిమాండ్ మేరకు ఆయనను పదవి నుంచి తప్పించిందని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

బీజేపీ అధికారంలో ఉండగా..

2022లో కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నపుడు..మంత్రి కేఎస్ ఈశ్వరప్ప ఓ ప్రాజెక్టులో 40 శాతం కమీషన్ అడిగారని ఆరోపిస్తూ ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈశ్వరప్పను తక్షణమే పదవి నుంచి తొలగించాలని అప్పట్లో కాంగ్రెస్ పట్టుబట్టింది. ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డికె శివకుమార్‌ వారిలో ఉన్నారు.

చంద్రశేఖర్ మరణం.. అవినీతి రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్ల ద్వారా ప్రజా సంక్షేమానికి కేటాయించిన డబ్బు ఎలా దారిమళ్లుతుందో బహిర్గతం చేసింది.

ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించిన అధికారులపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణ కోసం చంద్రశేఖర్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. చంద్రశేఖర్‌ ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగి కావడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారని మాజీ పోలీసు అధికారి రమేష్‌ గౌడ చెప్పారు.

(ఆత్మహత్యలను నివారించవచ్చు. సహాయం కోసం దయచేసి ఆత్మహత్య నివారణ హెల్ప్‌లైన్‌లకు కాల్ చేయండి: నేహా ఆత్మహత్య నివారణ కేంద్రం - 044-24640050; కిరణ్, మానసిక ఆరోగ్య పునరావాసం - 5900000 0019, దిశ 0471- 2552056, మైత్రి 0484 2540530, స్నేహ ఆత్మహత్యల నివారణ హెల్ప్‌లైన్ 044-24640050.)

Read More
Next Story