ప్రజ్వల్ తమ్ముడు సూరజ్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు..
మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబాన్ని లైంగిక వేధింపుల ఆరోపణలు వెంటాడుతున్నాయి. గతంలో ప్రజ్వల్.. ఇప్పుడు ఆయన మరో మనవడు సూరజ్‌పై కేసు నమోదైంది. ఇంతకూ ఏం జరిగింది?
ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, జేడీ(ఎస్) ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. హోలెనరసిపుర ఎమ్మెల్యే హెచ్డి రేవణ్ణ పెద్ద కుమారుడు సూరజ్ జూన్ 16 సాయంత్రం హోలెనరసిపురా తాలూకాలోని గన్నికాడలోని తన ఫామ్‌హౌస్‌లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చేతన్ కెఎస్ (27) అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఐపిసి సెక్షన్లు 377 (అసహజ సెక్స్), 506 (నేరపూరిత బెదిరింపు) కింద సూరజ్‌పై శనివారం సాయంత్రం హోలెనరసిపుర పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆరోపణలను ఖండించిన సూరజ్
అయితే మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ మనవడు, కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి అన్న కొడుకు అయిన సూరజ్ (37) ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. చేతన్ తన నుండి రూ. 5 కోట్లు గుంజడానికి తప్పుడు ఫిర్యాదు చేశాడని సూరజ్ ఆరోపించాడు. సూరజ్‌ని పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదు.
ఇదంతా డబ్బు గుంజేందుకే..
సూరజ్ సన్నిహితుడు శివకుమార్ ఫిర్యాదు మేరకు చేతన్‌పై కూడా పోలీసులు దోపిడీ కేసు నమోదు చేశారు. సూరజ్ నుంచి భారీ మొత్తంలో డబ్బులు లాగడానికే చేతన్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని శివకుమార్ ఆరోపించారు. సూరజ్ నుంచి చేతన్ తొలుత రూ. 5 కోట్లు డిమాండ్ చేశాడని, ఆ తర్వాత ఆ మొత్తాన్ని రూ. 2 కోట్లకు తగ్గించాడని ఆరోపణలు వచ్చాయి.
ప్రజ్వల్ అరెస్ట్..
పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఇప్పటికే సూరజ్ సోదరుడు, హసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల లోక్ సభ ఎన్నికలలో కూడా ప్రజ్వల్ పోటీ చేశారు. అయితే ఎన్నికలకు ముందు రోజు తన అశ్లీల వీడియోలు బయటకు రావడంతో ఆయన జర్మనీకి పారిపోయారు. ఈ మధ్యనే తిరిగిరావడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.
బెయిల్‌పై ప్రజ్వల్ తల్లిదండ్రులు..
ప్రజ్వల్ బాధితురాలిని కిడ్నాప్ చేశాడని ఆయన తండ్రి రేవణ్ణను పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. ఇదే కేసులో ప్రజ్వల్ తల్లి భవానీ ఆంటిసిపేటరీ బెయిల్ పొందారు.