శబరిమల పరిపాలనాధికారి మురారి బాబు అరెస్టు..
x

శబరిమల పరిపాలనాధికారి మురారి బాబు అరెస్టు..

అయ్యప్ప గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాల కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్‌‌ను అరెస్టు చేసిన సిట్..


Click the Play button to hear this message in audio format

కేరళ(Kerala)లోని శబరిమల ఆలయం (Sabirimala Ayyappa Temple) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బి మురారి బాబును గురువారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్టు చేసింది. ఆలయంలో విగ్రహాలకు బంగారు తాపడం బరువు వ్యత్యాసం కేసులో ఆయనను ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB) ఇప్పటికే సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి (అక్టోబర్ 22) చంగనస్సేరిలోని ఆయన నివాసం నుంచి మురారి బాబును సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని, తిరువనంతపురంలోని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. బాబు బంధువులు గురువారం ఉదయం క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి వచ్చారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో మురారి బాబును అరెస్టు చేసినట్లు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. తరువాత వారు బాబును కలిసేందుకు అనుమతించారు. పతనంతిట్టలోని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు మురారి బాబు ఈ రోజు సిట్ అధికారులు హాజరుపరిచి, కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.


అసలు ఏమిటీ వివాదం?

శబరిమలలో గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించారు. వాటిని సరిచేయించి కొత్త బంగారు పూత తాపడాలను అందిస్తానని ఉన్నికృష్ణన్‌ అనే దాత తీసుకెళ్లారు. ఈ పనిని చెన్నైలోని ఓ సంస్థకు అప్పగించారు. 2019లో వాటిని తొలగించే సమయంలో తాపడాల బరువు 42.8 కిలోలుగా ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. అయితే, ఆ తాపడాలను తమ వద్దకు తెచ్చినప్పుడు బరువు 38.28 కిలోలు మాత్రమే ఉందని సదరు కంపెనీ పేర్కొంది. అంతేగాక ఆలయం నుంచి తాపడాలను తొలగించిన దాదాపు 40 రోజుల తర్వాత వాటిని చెన్నైలోని కంపెనీకి అందించినట్లు సమాచారం. ఈ పరిణామాలపై ఇప్పటికే హైకోర్టు పలు అనుమానాలు వ్యక్తంచేసింది. ఉన్నట్లుండి తాపడాల బరువు 4.524 కేజీలు తగ్గడాన్ని తీవ్రంగా పరిగణించింది. వీటిని తిరిగి అమర్చినప్పుడు ఎందుకు బరువును సరిచూడలేదని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై క్రిమినల్​ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించింది.

ఈ కేసులో రెండో నిందితుడు మురారి బాబు కాగా ప్రధాన నిందితుడు, బెంగళూరుకు చెందిన వ్యాపారి ఉన్నికృష్ణన్‌ పొట్టీని సిట్‌ అధికారులు ఇప్పటికే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 30 వరకూ ఆయన్ను సిట్‌ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశించింది.

శబరిమల అయ్యప్ప దేవాలయంలోని విగ్రహాల బంగారం తాపడం బరువు వ్యత్యాసం కేసు దేశ వ్యాప్తంగా చ‌ర్చనీయాంశం కావడంతో ఇందులో ఏదైనా కుట్ర జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)కు కేరళ హైకోర్టు సూచించింది.

Read More
Next Story