క్షతగాత్రులకు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పరామర్శ
x
గాయపడ్డ ప్రయాణికుడిని పరామర్శిస్తున్న ఉదయనిధి.. Image source : ELECTORAL EDGE

క్షతగాత్రులకు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పరామర్శ

తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చెన్నైలోని ప్రభుత్వ స్టాన్లీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రయాణికులను శనివారం ఉదయం పరామర్శించారు.


తమిళనాడులో మరో రైలు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీ కొట్టింది. ఈ ఘటన నిన్న రాత్రి 8.30 గంటల ప్రాంతంలో జరిగింది. మైసూరు నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా దర్బాంగ వెళ్లాల్సిన భాగమతి ఎక్స్‌ప్రెస్‌ (12578) తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వేస్టేషన్‌ సమీపంలో నిలిచివున్న గూడ్స్ రైలును ఢీ కొట్టింది. దీంతో 13 ప్యాసింజర్ బోగీలు పట్టాలు తప్పాయి. సమాచారం అందిన వెంటనే వివిధ శాఖల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులెవరూ మరణించలేదని దక్షిణ రైల్వే ప్రకటించింది. గూడ్స్‌ రైలును ఢీకొన్నప్పుడు ముందుభాగంలో అన్నీ ఏసీ కోచ్‌లే ఉండటంతో వాటిలో ఉండే ప్రయాణికులు మాత్రమే గాయపడ్డారు. వారందరినీ సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

ఘటన ఎలా జరిగింది?

నిన్న రాత్రి 8.27 ప్రాంతంలో పొన్నేరి స్టేషన్‌ దాటి కవరైపెట్టై స్టేషన్‌కు చేరుకుంటున్న సమయంలో ప్యాసింబర్ రైలు ప్రధాన లైను నుంచి లూప్‌లైన్‌లోకి వెళ్లడం, ఆ లైన్‌లో ఆగి ఉన్న గూడ్స్‌ రైలును ఢీకొట్టడం క్షణాల్లో జరిగిపోయాయి. ఎక్స్‌ప్రెస్‌ రైలుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా రైల్వే అధికారులు వెల్లడించారు.

మొత్తం 1360 మంది ప్రయాణికులు..

రైలులో మొత్తం 1,360 మంది ప్రయాణికులు ఉన్నారని తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ డాక్టర్ టి ప్రభుశంకర్ తెలిపారు. 19 మంది ప్రయాణికులు గాయపడగా, వారిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా ట్రాక్ పునరుద్ధరణ పనులకు 16 గంటల సమయం పడుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

క్షతగాత్రులను పరామర్శించిన ఉదయనిధి..

తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ రైలు ప్రమాదంలో గాయపడి చెన్నైలోని ప్రభుత్వ స్టాన్లీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రయాణికులను శనివారం ఉదయం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "రెస్క్యూ ఆపరేషన్ కోసం మంత్రి, ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికారులు స్పాట్‌లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వెంటనే 22 అంబులెన్స్‌లను స్పాట్‌కు పంపాం. ఎటువంటి ప్రాణనష్టం లేదు, గాయపడ్డ ప్రయాణికులకు స్టాన్లీ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. పోలీసులు డిపార్ట్‌మెంట్, ఫైర్ అండ్ రెస్క్యూ డిపార్ట్‌మెంట్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, మెడికల్ టీమ్‌లు రెస్క్యూ ఆపరేషన్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. రైలు ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.’’ అని కోరారు.

ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. గతంలో జరిగిన ప్రమాదాల నుంచి ఏ మాత్రం పాఠాలు నేర్పుకోలేదు. ఈ ప్రభుత్వం మేలుకునేలోపు ఎంకెంతమంది ప్రాణాలు గాల్లో కలవాలో’’ అంటూ ట్వీట్ చేశారు.

Read More
Next Story