
పెరియసామి
తమిళనాడు మంత్రికి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ
ఈడీకి వ్యతిరేకంగా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన మంత్రి, కొట్టివేసిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం
తమిళనాడు గ్రామీణాభివృద్ధి మంత్రి, డీఎంకే సీనియర్ నాయకుడు పెరియసామికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన, ఆయన కుమారుడు సెంథిల్ కుమార్, కుమార్తె ఇందిరా పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన మనీలాండరింగ్ దర్యాప్తును రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన రిట్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద ఎన్ ఫోర్స్ మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) ఆస్తుల అటాచ్ మెంట్, జప్తులు వంటి తదుపరి చర్యలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి మనీంద్ర మోహన శ్రీ వాస్తవ, న్యాయమూర్తి జి అరుల్ మురుగన్లతో కూడిన డివిజన్ బెంచ్ తిరస్కరించింది.
రెండు కోట్ల విలువన ఆస్తులు..
2006 నుంచి 2011 వరకూ పెరియసామి మంత్రిగా ఉన్న సమయంలో రెండు కోట్ల రూపాయలకు పైగా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఈ కేసు ప్రారంభం అయింది. డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్(డీవీఏసీ) ముందుగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
ఇదే సమయంలో ఈడీ కేసు నమోదు చేసి సమాంతర దర్యాప్తు ప్రారంభించింది. డీవీఏసీ కేసుతో ప్రత్యేక కోర్టు మొదట పెరియసామిని విడుదల చేసింది. కానీ మద్రాస్ హైకోర్టు 2025 ఏప్రిల్ లో దానిని కొట్టివేసి, విచారణకు ఆదేశించింది.
ఈ దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే అది ఈడీ కార్యకలాపాలను ప్రభావితం చేయమని ఆదేశించలేదు. డిసెంబర్ 17, 2025న అదే బెంచ్ మంత్రికి మధ్యంతర ఉపశమనం నిరాకరించింది. జనవరి 5, 2026 నాటికి తన కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది.
ఈడీ దర్యాప్తుకు మార్గం సుగమం..
ఈ రోజు పిటిషన్లను విచారించిన న్యాయస్థానం.. పిటిషనర్లు న్యాయ నిర్ణయ అధికారం ముందు చర్యలను సవాల్ చేయకండా నేరుగా హైకోర్టును ఆశ్రయించడం ద్వారా చట్టబద్దమైన పరిష్కారాలను వదిలివేశారని వాదించింది.
దీనిని బెంచ్ గుర్తించి, నిందితుల పిటిషన్లను తోసిపుచ్చింది. పరిష్కారం కోసం పీఎంఎల్ఏ కింద తగిని అధికారులను సంప్రదించాలని పెరియసామి పక్షానికి సూచించింది.
తమిళనాడులో అధికార పార్టీ ప్రముఖులపై కేంద్ర సంస్థ వరుస చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో డీఎంకే నాయకుడిపై పరిశీలనను తీవ్రతరం చేస్తూ, ఈడీ దర్యాప్తుకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగడానికి మార్గాన్ని సుగమం చేసింది.
రాష్ట్రప్రభుత్వం, కేంద్ర దర్యాప్తు సంస్థల మధ్య ఘర్షణ పెరగడానికి ఇది మరో ఉదాహారణగా రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.
Next Story

