సీటు రాలేదన్న ఆవేదనతో తమిళనాడు ఎంపీ కన్నుమూత
సీటు దక్కలేదన్న మనస్థాపంతో బలవన్మరణ యత్నం చేసిన ఓ తమిళనాడు ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి ఈవేళ మరణించారు.
సీటు దక్కలేదన్న మనస్థాపంతో బలవన్మరణ యత్నం చేసిన ఓ తమిళనాడు ఎంపీ కన్నుమూశారు. ఐదురోజుల కిందట మత్తు బిళ్లలు మింగి ఆస్పత్రిలో చేరిన తమిళనాడు ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి ఈవేళ గుండెపోటుకు గురై మరణించారు. ఆయన వయసు 77 ఏళ్లు. లోక్‌సభ ఎన్నికలకు ముందు తమిళనాడులో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే నేత గణేశమూర్తి ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో బలవన్మరణ యత్నం చేశారు. కోయంబత్తూర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం కన్నుమూశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో భాగంగా ఎండీఎంకే తరఫున ఈరోడ్ సీటు నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో కూటమి సర్దుబాట్లలో భాగంగా ఎండీఎంకేకు తిరుచ్చి కేటాయించారు. అక్కడి నుంచి దురైవైగోను ఎండీఎంకే తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో గణేశమూర్తి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మత్తు బిళ్లలు మింగారు. మార్చి 24న ఈ సంఘటన జరిగింది. నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన.. ఈ ఉదయం పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్లు పోలీసులు చెప్పారు.