
డబ్బు కోసం ‘టెకీ’ దుర్మార్గం
వ్యాపారం కోసం అడిగినంత ఇవ్వడం లేదని తల్లిదండ్రుల హత్య
ఉన్నత చదువులు చదివి, అమెరికాలో ఉద్యోగం చేసి భారత్ కు తిరిగి వచ్చిన ఓ టెకీ కన్న తల్లిదండ్రులను హత్యచేశాడు. బెంగళూర్ లోని విజ్ఞాన నగర్ లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆర్థిక విషయాల నేపథ్యంలో జరిగిన వాగ్వాదం.. చివరకు హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు.
గాయపడిన వృద్ధ దంపతులను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన హెచ్‌ఏఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం (ఫిబ్రవరి 11) జరిగింది. నిందితుడిని రోహన్ చంద్ర భట్ (33)గా గుర్తించారు. చనిపోయిన వారిని రిటైర్డ్ నేవీ కెప్టెన్ నవీన్ చంద్ర భట్ (60), ఆయన భార్య డాక్టర్ శ్యామల భట్ (55)గా పోలీసులు గుర్తించారు. శ్యామల భట్ వృత్తిరీత్యా దంతవైద్యురాలు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం...రోహన్ తన తల్లిదండ్రులతో ఇంట్లో వారితో గొడవకు దిగాడు. ఈ సందర్భంగా మాటమాట పెరిగి కత్తితో తల్లిదండ్రులపై దాడు చేశాడు. గొడవ జరుగుతుండగా చుట్టుపక్కల వారు ఇంటిలోకి వచ్చే ప్రయత్నం చేశారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన వారిని ఓల్డ్ ఎయిర్ పోర్ట్ లోని
మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు చనిపోయారని వైద్యులు చెప్పారు.
ఆర్థిక సమస్యలే కారణమా?
రోహన్ గతంలో అమెరికాలో ఉద్యోగం చేసి మూడేళ్ల క్రితం బెంగళూరుకు తిరిగి వచ్చినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. స్వతంత్రంగా ప్రాజెక్టు వర్క్‌లు చేస్తూ వ్యాపారాన్ని విస్తరించాలకున్నారు.
కానీ ఆర్థిక సమస్యల కారణంగా దానిని తాను అనుకున్నట్లు విస్తరించలేకపోయాడు. తల్లిదండ్రుల దగ్గర ఉన్న కొంత నగదును తనకు ఇవ్వాల్సిందిగా కోరినట్లు, అయితే అందుకు వారు నిరాకరించినట్లు ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. తన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకువచ్చినట్టు చెప్పారు.
వారు సాయం చేయలేమని ఖరాఖండిగా చెప్పడంతో గొడవ మొదలైంది. రోహన్ కొంతకాలంగా వర్తుర్ ప్రాంతంలో ఇంటికి అద్దెకు తీసుకుని వేరుగా ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. రోహన్ సోమవారం రాత్రి మళ్లీ తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడు. డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో గొడవ మొదలైంది.
అరెస్ట్, దర్యాప్తు..
ఘటన అనంతరం పోలీసులు రోహన్‌ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. ఇంకా అతన్ని పూర్తిగా ప్రశ్నించాల్సి ఉందని తెలిపారు. ఈ ఘటనపై నిందితుడి సోదరికి సమాచారం ఇచ్చినట్టు చెప్పారు. ఆమె ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని, బెంగళూరుకు చేరుకున్న తర్వాత శవపరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు.
Next Story

