
మేడారం సమ్మక్క- సారలమ్మ గద్దెలు
తెలంగాణలో జనవరి అంతా జాతర్లేనా?
మకర సంక్రాంతి నుంచి ప్రారంభం కానున్న కొత్తకొండ, ఊరుగొండ జాతరలు, నెలాఖరున జనంలోకి రానున్న మేడారం సమక్క- సారలమ్మ
కొత్త ఏడాదిలో ప్రారంభంలోనే తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో జాతరలు ప్రారంభం కానున్నాయి. ఈ జాతరలలో కొన్ని తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ(Sammakka-saralamma) జాతరతో సంబంధం ఉంది.
కొన్ని జాతరలకు వెళ్లి మొక్కు తీర్చుకుంటూనే సమ్మక్క సారలమ్మ జాతరలో వనదేవతలకు మొక్కులు సమర్పించాలనే ఆచారం తెలంగాణలో వందల ఏళ్లుగా కొనసాగుతోంది.
వీటిలో అతి ముఖ్యమైన జాతరలు ఏంటీ? వీటికి ఎలా వెళ్లాలి? వాటి ప్రాధాన్యత ఏమిటీ? వంటి అంశాలు ‘ది ఫెడరల్ ’ మీ కోసం అందిస్తోంది.
కొత్తకొండ జాతర
ఉత్తర తెలంగాణలో సమ్మక్క- సారలమ్మ తరువాత రెండో అతిపెద్ద జాతరగా కొత్తకొండ జాతర(Kothakonda Jathara)పేరుపొందింది. ఇక్కడ ప్రధాన దైవం శ్రీ వీరభద్ర స్వామి(Veerabhadra swamy). ఇక్కడ ఏటా మకర సంక్రాంతి(Sankranti) పర్వదినం సందర్భంగా జాతర ప్రారంభం అవుతుంది.
దాదాపు నెల రోజుల పాటు సాగే ఈ జాతరకు కనీసం ఐదు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. స్వామి వారికి కోరమీసాలు, గుమ్మడికాయలు సమర్పిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతుందని భక్తుల విశ్వాసం.
సంక్రాంతి, కనుమ పండగనాడు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఏ గుడికి లేని విధంగా ఈ గుడికి మూడు ప్రధాన ధ్వజ స్తంభాలు ఉంటాయి. స్థానికంగా వీరభద్ర స్వామిని కొత్తకొండ ఈరన్నగా పిలుస్తారు. స్వామివారి కాలు ఒక పక్కకు వంగి ఉండటం ఇక్కడ మనకు కనిపిస్తుంది.
ఈ జాతరకు తెలంగాణ ఆర్టీసీ హుజూరాబాద్, హన్మకొండ నుంచి ప్రత్యేకంగా బస్సులు నడుపుతుంది. రోడ్ మార్గానా రావాలనుకున్న భక్తులు హనుమకొండ- సిద్ధిపేట ప్రధాన రహదారిలో ఉన్న ముల్కనూర్ చేరుకుంటే అక్కడి నుంచి ఆటోల ద్వారా కొత్తకొండకు వెళ్లవచ్చు.
ఊరుగొండ లక్ష్మీ నరసింహస్వామి జాతర..
హనుమకొండ జిల్లాలో ఉన్న మరో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఊరుగొండ లక్ష్మీ నరసింహ స్వామి. ఈ స్వామి వారి జాతర కూడా మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రారంభం అవుతుంది.
జాతర అధికారికంగా ఈ నెల 8 నుంచే ప్రారంభం అయిన.. ప్రధాన ఘట్టం మాత్రం సంక్రాంతి పర్వదినం నాడు బండ్లు తిరుగుట, స్వామివారు గుట్టమీదకు వెళ్లడంతో పీక్ స్టేజ్ కు వెళ్తుంది.
ప్రజలు వేలాది తరలి వచ్చి నరసింహుడికి మొక్కులు సమర్పించుకుంటారు. ఈ జాతరకు వెళ్లాలంటే హనుమకొండ- కాళేశ్వరం ప్రధాన రహదారి మధ్యలోనే ఊరుగొండ ఉంటుంది. నిత్యం ఈ ఊరు నుంచే ఆర్టీసీ బస్సులు వెళ్తుంటాయి. నేరుగా ఊరుగొండలో దిగితే స్వామివారిని దర్శించుకోవచ్చు.
ఐనవోలు జాతర..
హనుమకొండ జిల్లాలో ఉన్న మరో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఐనవోలు. ఇక్కడ కొలువైనది మల్లికార్జునుడు. కాకతీయుల కాలంలో(Kakatiya) ప్రస్తుతం ఉన్న స్వామివారి గుడిని నిర్మించారు.
స్వామి వారి జాతర కూడా పుష్యమాసంలోనే జరగడం ఆనవాయితీగా ఉంది. మనకు కాకతీయులు నిర్మించిన గుడి నిర్మాణాలు అబ్బురపరుస్తాయి. పరమశివుడు ఇక్కడ మనకు వ్యక్తరూపంలో దర్శనమిస్తారు.
గ్రామీణ ప్రజలు స్వామి వారిని మల్లన్న దేవుడిగా పిలుస్తారు. తెలంగాణలో ఉన్న ఏడుగురు మల్లన్నల కథలో ఐనవోలు మల్లన్న పెద్దవాడు. కాకతీయుల కాలంలో స్వామి వారిని మైలార దేవుడిగా పూజలందుకున్నాడు.
ఇక్కడకు కొన్ని ప్రత్యేక పర్వదినాలలో నాగసాధువులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఐనవోలుకు వెళ్లాలంటే హనుమకొండ నుంచి బస్సులు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చే వారు హనుమకొండకు వచ్చే ముందు కరుణాపురంలో దిగితే అక్కడి నుంచి ఆటోలు అందుబాటులో ఉంటాయి.
కొమురవెల్లి మల్లన్న జాతర..
మల్లన్న దేవుళ్ల కథలో రెండో వాడు, కొంటే దేవుడిగా పేరు పొందినవాడు కొమురెల్లి మల్లన్న. తెలంగాణలో సమ్మక్క- సారలమ్మ జాతర ముందు కొమురెల్లి మల్లన్నను(Komuravelli Mallakharjunudu) దర్శించుకోవడం భక్తుల ఆనవాయితీ. సుతిమాను గుండు ఎక్కడం, గంగరేగ్గాయ చెట్టుకింద స్వామి వారికి పట్నాలు వేయడం ఇక్కడ ప్రత్యేకత.
ఇక్కడ కూడా శివుడు వ్యక్తరూపంలో మల్లన్నదేవుడిగా విగ్రహం రూపంలో దర్శనమిస్తాడు. ఐనవోలులో కూడా స్వామివారికి పట్నాలు వేయడం ఆనవాయితీగా ఉంది. కొమురెల్లి మల్లన్న కథలో ముస్లిం రాజుల ప్రస్తావన ఉండటం మరో ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ పసుపును బండారిగా పిలుస్తారు.
ఈ బండారుని స్వామివారు ముస్లింల నుంచి ఎత్తుకుని వచ్చాడని భక్తులు నమ్ముతారు. అందుకే స్వామివారికి బండారును సమర్పిస్తారు. పట్నం వేసిన తరువాత ఆచారమంతులు(దేవుడిని వివాహం చేసుకున్న వ్యక్తులు) పట్నం మీద ఒకరకమైన మత్తులో నాట్యం చేయడం మనకు ఇక్కడ కనిపిస్తుంది.
కొమురవెల్లికి హైదరాబాద్ నుంచి రావాలనుకునేవారు మనకు సిద్ధిపేట రావడానికి 20 కిలోమీటర్ల ముందు ప్రత్యేక ఆర్చ్ కనిపిస్తుంటాయి. ఆ దారిలో 15 కిలోమీటర్లు వెళితే నేరుగా కొమురవెల్లికి చేరుకోవచ్చు. మల్లన్న దేవుడికి గ్రామీణ ప్రాంతాలలో పూజలు చేసే వారిని ‘ఒగ్గులు’గా పిలుస్తారు.
నాగోబా జాతర..
ఆదిలాబాద్ జిల్లాలో జరిగే గోండు(Gondu) గిరిజనుల పండగే నాగోబా జాతర(Nagoba). ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాంపూర్ గ్రామంలో ఈ జాతర జరుగుతుంది. గోండులు నాగేంద్రుడిని దేవుడిగా కొలుస్తారు. పుష్యమాసంలో వచ్చే అమావాస్య రోజున ఈ జాతర ప్రారంభం అవుతుంది.
గోండు, ప్రధాన్, కోలాం వంటి తెగలు ఈ జాతర వైభవంగా జరుపుకుంటారు. ఈ జాతర సుమారు 10 రోజుల పాటు జరుగుతుంది. నాగేంద్రుని అభిషేకం చేయడానికి కాలినడకన గోదావరి నదికీ చేరుకుని నీళ్లు తీసుకుని మళ్లీ కాలినడకన కేస్లాంపూర్ చేరుకుని నాగేంద్రుడికి ఆ జలాలతో అభిషేకం చేస్తారు.
ఇక్కడ ప్రజా దర్భార్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గిరిజనుల సమస్యలు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా హజరై వింటారు. ఇక్కడకు ఆదిలాబాద్ నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నాగోబా జాతరను రాష్ట్ర పండగగా ప్రకటించింది.
వేములవాడ..
ఉత్తర తెలంగాణలో వేములవాడ ప్రధాన శైవ పుణ్యక్షేత్రం. సమ్మక్క- సారలమ్మ జాతరకు వెళ్లాలన్నా, తిరుపతి, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలన్నా మొదట వేములవాడకు(Vemulavaada) రావడం ఉత్తర తెలంగాణలోని ప్రధాన ఆచారం.
ఇక్కడ శివుడు రాజరాజేశ్వరుడిగా, అమ్మవారిని రాజేశ్వరి దేవిగా కోలువుదీరారు. స్థానికంగా ప్రజలు రాజేశ్వరుడిని.. ఎములాడ రాజన్నగా పిలుస్తారు. ప్రతి ఊరిలోనూ కనీసం 50 కి తక్కువ కాకుండా రాజన్న పేరు కలిగిన వ్యక్తులు మనకు దర్శనమిస్తారు. ఆయన మీద భక్తితో రాజయ్య, రాజేశ్, రాజన్న, లింగయ్య పేర్లు ఉత్తర తెలంగాణలో ఎక్కువగా కనిపిస్తాయి.
కోడెను కట్టుగా సంప్రదాయం ఇక్కడ ప్రత్యేకత. ప్రస్తుతం వేములవాడ ప్రధాన ఆలయ పునర్మిణ పనులు సాగుతున్నాయి. శివుడిని భీమేశ్వర ఆలయంలో నిలిపి కొలుపులు కొలుస్తున్నారు.
మహాశివరాత్రి ఇక్కడ వైభవంగా నిర్వహిస్తారు. వేములవాడకు రాష్ట్రంలో ప్రధాన ఆధ్యాత్మిక క్షేత్రం కావడంతో ఇక్కడకు రవాణా సౌకర్యాల కొరత లేదు. ప్రధాన ప్రాంతాల నుంచి ఆర్టీసీ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. సమక్క జాతర సందర్భంగా ప్రస్తుతం భక్తులతో వేములవాడ కిటకిటలాడుతోంది.
కొండగట్టు..
వేములవాడ నుంచి కొండగట్టు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి వేములవాడ రాజన్న దర్శనం తరువాత కొండగట్టు వెళ్లి స్వామి హనుమ దర్శనం చేసుకోవడం కూడా ఆచారంగా మారింది.
చుట్టు అడవులు, కొండలతో ఉన్న ప్రాంతం గుండా వేములవాడ నుంచి కొండగట్టుకు ప్రయాణ మార్గం ఆహ్లదకరంగా ఉంటుంది. కొండగట్టు గుట్ట వద్ద ఇప్పుడిప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొండపైన కేవలం హరిత హోటల్ మాత్రమే అందుబాటులో ఉంది.
కొండ దిగువ ప్రాంతంలో రూములు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ కోతుల బెడద అధికం. సమ్మక్క సారలమ్మ జాతర సమయంతో పాటు, హనుమాన్ జయంతి, శ్రీరామ నవమి సందర్భంగా కొండగట్టు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి జిల్లా కేంద్రమైన జగిత్యాల కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. కరీంనగర్- నిజామాబాద్ ప్రధాన మార్గంలోనే కొండగట్టు ఉంది.
సమక్క- సారలమ్మ..
తెలంగాణ కుంభమేళాగా పేరుపొందిన గిరిజనుల జాతర సమ్మక్క- సారలమ్మ జాతర. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున సమ్మక్క- సారలమ్మ జాతర సాగుతుంది.
ఈ సంవత్సరం జనవరి 28 నుంచి మేడారంలో జాతర ప్రారంభం కానుంది. ఇక్కడ దేవతలు కుంకుమభరిణే రూపంలో గద్దెల మీదకు వచ్చి మూడు రోజుల పాటు కొలువుదీరతారు. ఆదివాసీ పూజారూలు మాత్రమే, అది కూడా వంశపారంపర్యంగా వనదేవతలను ప్రత్యేక పద్దతుల్లో మేడారానికి తీసుకువస్తారు.
ఇక్కడ అమ్మవార్లకు బెల్లాన్ని ప్రసాదంగా సమర్పిస్తారు. బెల్లాన్ని బంగారంగా పిలుస్తారు. కోరిన కోరికలు తీరితే అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని(బెల్లం) సమర్పించడం ఆచారంగా ఉంది. సమక్క- సారలమ్మ జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర. ఈ పండగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండగగా ప్రకటించింది.
Next Story

