
‘నేతలను రెండు దెబ్బలు కొట్టయినా దారిలోకి తెస్తాం’
ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలపై పోరాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్న రేవంత్ రెడ్డి.
తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు రాజుకుంటున్న వేళ రేవంత్ రెడ్డి.. ఢిల్లీ వేదికగా చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. వక్రమార్గంలో వెళ్తున్న నేతలను రెండు దెబ్బలు కొట్టయినా దారిలోకి తెస్తామంటూ రేవంత్ చెప్పుకొచ్చారు. పలువురు నేతల మధ్య ఇప్పటికే వాగ్వాదాలు, అలకలు, మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. వీటిపై కాంగ్రెస్ అధిష్టానం కూడా ఫోకస్ పెడుతున్న సమయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు పార్టీ పరంగా కూడా తీవ్ర ప్రకంపనలు సృష్టించినట్లు తెలుస్తోంది. విభేదాలను పరిష్కరించాల్సిన రేవంత్ రెడ్డి మరో వివాదం రాజుకునేలా మాట్లాడటం ఏంటన్న చర్చ కూడా మొదలైంది. అయితే ఢిల్లీలో నిర్వహించిన కాంగ్రెస్ వార్షిక న్యాయ సదస్సులో పాల్గొన్న రేవంత్ మరిన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. దేశంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. కొందరు చరిత్ర తెలియకుండా దేశానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రశ్నిస్తుంటారని విమర్శలు చేశారు. నిద్రలో కూడా దేశ యోగక్షేమాలను, అభివృద్ధి గురించే ఆలోచించే పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనంటూ రేవంత్ చెప్పుకొచ్చారు.
స్వరాజ్యాన్ని సాధించిన పార్టీ కాంగ్రెస్
‘‘బీజేపీ, బీఆర్ఎస్, జేడీ, బీజేడీ, ఆర్‌జేడీ.. ఇలా ఏ పార్టీ అయినా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పుట్టుకొచ్చినవే. కానీ కాంగ్రెస్ అలా కాదు. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన పార్టీ ఇది. ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. ఈ దేశంలో దళితులు, ఆదివాసులకు రిజర్వేషన్లు కల్పించింది కూడా కాంగ్రెస్. ఈ దేశంలో సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇది ఇతర రాజకీయ పార్టీలలా కాదు. ఇతర రాజకీయ పార్టీలు ఎన్నికలొస్తే పోటీ చేయడం, గెలిస్తే పదవిలో కూర్చోవడం, ఓడిపోతే ఇంట్లో కూర్చోవడం అలవాటైపోయింది. బీజేపీ నుంచి మొదలుకొని చాలా విపక్ష పార్టీలు ఇలాగే వ్యవహరిస్తున్నాయి. ఓడిపోయాక ప్రజల మధ్యకు రావడం లేదు…. గెలిచినప్పుడే కనిపిస్తున్నారు’’ అని చురకలంటించారు.
కాంగ్రెస్ పార్టీతోనే సామజిక న్యాయం సాధ్యం
‘‘కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం నిత్యం ప్రజల మధ్య ఉండి, ప్రజల కోసం పని చేసే రాజకీయ పార్టీగా నిలుస్తోంది. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లు రద్దు చేయాలనే ప్రయత్నం చేస్తోంది. గత 11 ఏళ్లుగా సామాజిక న్యాయం గురించి కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించలేదు. అటువంటి సమయంలో, డిపార్ట్‌మెంట్ ఛైర్మన్ డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ నేతృత్వంలో, దేశానికి ముందువైపు దారి చూపించేలా, సామాజిక న్యాయం కోసం మేము కార్యాచరణతో ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నాం. కొందరు బీజేపీ నాయకులు తరచూ మాట్లాడుతుంటారు. "కాంగ్రెస్ పార్టీ చేసిందేమిటి?" అని.. నేను ఈ బీజేపీ నాయకులకు గుర్తు చేయాలనుకుంటున్నా…’’ అని అన్నారు.
‘‘కాంగ్రెస్ పార్టీ పోరాటం ద్వారానే 41 కోట్ల భారతీయుల స్వాతంత్ర్యం సిద్ధించింది. బ్రిటిష్ వలస పాలకులపై గెలిచేలా చేసిన మొదటి అడుగు కాంగ్రెస్‌దే. బ్రిటిష్ పాలనను ముగించి ఈ దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్. దేశం ఒకప్పుడు ఉగ్రవాద ప్రమాదాల్లో చిక్కినప్పుడు, పక్కనున్న పాకిస్తాన్ నుండి ముప్పు వచ్చినప్పుడు, ఇందిరా గాంధీ ధైర్యంగా యుద్ధాన్ని ప్రకటించారు. పాకిస్తాన్‌ను ఓడించి, ఆ దేశాన్ని రెండు భాగాలుగా విడదీసి, ఆ యుద్ధాన్ని జయించి, కాళీమాత గౌరవాన్ని నిలబెట్టారు. దేశం ప్రమాదంలో ఉన్నప్పుడు మహాత్మా గాంధీ ప్రాణత్యాగం చేసి ఈ దేశాన్ని రక్షించారు. అదే విధంగా ఇందిరా గాంధీ ఈ దేశాన్ని రక్షించడానికి తన ప్రాణాలనే అర్పించారు’’ అని తెలిపారు.
దేశాన్ని కాపాడిన నేత ఐరన్ లేడీ..
‘‘ఉగ్రవాదాన్ని ఎదిరించి దేశాన్ని కాపాడిన నేత ఇందిరాగాంధీ. మూడోసారి ఉగ్రవాదుల చేతిలో దేశం ప్రమాదంలో ఉన్నప్పుడు, రాజీవ్ గాంధీ తన ప్రాణాలను త్యాగం చేసి, దేశాన్ని రక్షించారు. ఉగ్రవాదాన్ని ఎదురించి, దేశాన్ని కాపాడారు. అయినా కూడా “గాంధీ కుటుంబం దేశం కోసం ఏం చేసింది?” అన్న ప్రశ్నను ఎప్పుడూ లేపుతూనే ఉంటారు. ఈ దేశం కోసం మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణత్యాగం చేశారు. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రోజు, ప్రధాని పదవిని చేపట్టాలని అందరూ కోరినప్పుడు ఆ పదవిని తిరస్కరించారు. ప్రధాని పదవిని త్యాగం చేసి ఆర్థిక నిపుణుడు డాక్టర్ మన్మోహన్ సింగ్‌ని భారత ప్రధాని చేయడం ద్వారా ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా భారత్ ఎదగడంలో సహకారం అందించారు. తర్వాత రాష్ట్రపతి పదవిని చేపట్టే అవకాశం వచ్చినప్పటికీ సోనియా గాంధీ దాన్నీ తిరస్కరించారు’’ అని చెప్పారు.
రాహుల్ చేసిన త్యాగాలు ఎవరికీ తెలియవు..
‘‘రాహుల్ గాంధీ గురించి బీజేపీ నాయకులు ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఆయన చేసిన త్యాగం వాళ్లకు అర్థం కాదు. ఎందుకంటే వారు పదవుల కోసం రాజకీయాల్లోకి వచ్చారు. వాళ్లకు పార్టీ విలువలు తెలియవు. రాహుల్ గాంధీ కావాలంటే 2009 లోనే కేంద్ర మంత్రి అయి ఉండేవారు. కావాలంటే ప్రధాని కూడా అయి ఉండేవారు. కానీ వారు ఆ పదవులకు దూరంగా ఉన్నారు. ఆ అవకాశాన్ని పార్టీ పెద్దలకి ఇచ్చి, తాను మాత్రం కేవలం ఒక కార్యకర్తగా ప్రజల కోసం పనిచేస్తున్నారు. గత ఎన్నో సంవత్సరాలుగా రాహుల్ గాంధీ దేశంలోని పేదల కోసం, వెనుకబడినవారి కోసం, దళితుల కోసం, ఆదివాసుల కోసం, ఒబీసీల కోసం, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతున్నారు. ఇక మరోవైపు చూస్తే నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ రోజు వరకూ, బీజేపీ నేతలు, ఆర్ఎస్ఎస్ కుటుంబం కూడా పదవి నుంచి మోదీని తప్పించడానికి ప్రయత్నాలు జరిగాయి’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కుర్చీ దిగడానికి మోదీ రెడీగా లేరు..
‘‘మోదీ పదవిని వదలడానికి ఏ సందర్భంలోనూ సిద్ధంగా లేరు. రెండు నెలల క్రితం నేను మోహన్ భగవత్ చేసిన ప్రకటన చూశా. కానీ మోదీ మాత్రం తన పదవిని వదిలి కొత్తవారికి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా లేరు. పార్టీ లీడర్‌ను ఎంపిక చేసినా, మోదీ షరతులు పెట్టి మొత్తం తన నియంత్రణలో ఉండాలని భావిస్తున్నారు. మోదీ ని గద్దె దించడమే రాహుల్ గాంధీ లక్ష్యం. ఇది రాబోయే ఎన్నికల్లో జరగబోతోంది. సంఘ్ కుటుంబం చేయలేకపోయిన పనిని, అటల్ బిహారీ వాజ్‌పేయి చేయలేకపోయిన పనిని, రాహుల్ గాంధీ చేస్తారు. ఒక సందర్భంలో వాజ్‌పేయి కూడా మోదీ ని సీఎం పదవి నుండి తప్పించాలని ప్రయత్నించారు. ఈరోజు మోహన్ భగవత్ కూడా మోదీ ని ప్రధాని పదవి నుండి తప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు.
‘‘కారణమేమంటే, మిస్టర్ నిషికాంత్ దూబే లాంటి వారు చెబుతుంటారు. “మోదీ లేకుండా బీజేపీకి 150 సీట్లు దాటి రాదని”. ఇది మీరు మీ డైరీలో రాసుకొని గుర్తుంచుకోండి. రాహుల్ గాంధీ నేతృత్వంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు దాటకుండా తగిన గుణపాఠం చెప్పే బాధ్యతను మేము తీసుకుంటాం. రాహుల్ గాంధీ నేతృత్వంలో మోదీ ని ఓడించేందుకు, దేశాన్ని రక్షించేందుకు, రాజ్యాంగాన్ని కాపాడేందుకు, రిజర్వేషన్లను అమలు చేయేందుకు, సామాజిక న్యాయాన్ని స్థాపించేందుకు కాంగ్రెస్ కుటుంబం మొత్తం సిద్ధంగా ఉంది. ఓబీసీలకు సామాజిక న్యాయం అందించడానికి, ఈ దేశంలో జనగణన (కుల గణన) చేపట్టే రోజులు వస్తున్నాయి’’ అని గుర్తు చేశారు.
‘‘బీసీలకు వారి జనాభా నిష్పత్తి మేరకు రిజర్వేషన్లు కల్పించేలా కొత్త చట్టాన్ని రూపొందించడానికి, రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశం ముందుకు సాగుతుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వేల కిలోమీటర్లు నడిచారు. ఆ ప్రయాణంలో, విచ్ఛిన్నత, విద్వేషానికి వ్యతిరేకంగా ప్రేమను పంచే ఉద్యమాన్ని కొనసాగించారు. ఈ ఉద్యమంలో భాగంగా భారతదేశానికి తెలంగాణ మోడల్‌గా మారింది. ఈ దేశంలోని రాజ్యాంగాన్ని కాపాడాలనుకునే ప్రతి ఒక్కరు, ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేవారు, ఈ వేదికపై ఉన్న ప్రతి ఒక్కరు... అందరం రాహుల్ గాంధీ వెంట నిలబడాలి. రాహుల్ గాంధీ ని భారత ప్రధాని చేయాలన్న లక్ష్యంతో, ఈ దేశాన్ని సామాజిక న్యాయ మార్గంలో నడిపించాలన్న సంకల్పంతో, మేమంతా సిద్ధంగా ఉన్నాం! మీరు సిద్ధంగా ఉన్నారా? సామాజిక న్యాయానికి సిద్ధంగా ఉన్నారా? రాహుల్ గాంధీ నాయకత్వంలో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారా? అయితే, కలిసి ముందుకు నడుద్దాం!’’ అని పిలుపునిచ్చారు.