
'బనకచర్లపై మా వాటా తేలాకే తరలించుకుపోండి' : పొన్నం ప్రభాకర్
ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేస్తూ లోకేశ్ కు సూచన
బనకచర్ల వివాదంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. వరదనీళ్లు బనకచర్లకు తీసుకుపోతే తాము ప్రజలను రెచ్చగొడుతున్నట్లు ఎపి మంత్రి నారాలోకేశ్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. నికర జలాలు, మిగులు జలాలు తేలాకే వరదనీళ్లు తీసుకెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. లోకేశ్ ముందు నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాల గూర్చి తెలుసుకోవాలని మంత్రి అన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల్లో నీటి వినియోగం పూర్తైన తర్వాతే వరద జలాల పై మాట్లాడాలని పొన్నం పేర్కొన్నారు. అవేవి తెలియకుండా లోకేశ్ ఎపి ప్రజలను మభ్యపెడుతూ తప్పు దోవ పట్టిస్తున్నారన్నారు. కేంద్రం, ట్రిబ్యునల్ చెప్పిన దాని ప్రకారం, తెలంగాణ ఒక్క చుక్కనీరు కూడా వదులుకునే ప్రసక్తి లేదని పొన్నం స్పష్టం చేశారు.
‘‘సీనియర్ నాయకుడిగా చంద్రబాబు ఇరు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తకుండా జాగ్రత్త పడాలి. వరద నీళ్లు సముద్రజలాల్లో కలవాలని ఎవరూ కోరుకోరు. ఆ జలాలను మీరు వాడుకుంటే అభ్యంతరం లేదు. మా వాటా తేలకముందే మీరు తరలించుకుపోతామంటే ఊరుకునే ప్రసక్తి లేదు. మా హక్కుల కోసం పోరాటం తప్పదు’’ అని పొన్నం ప్రభాకర్ తేల్చి చెప్పారు.