‘ఇది చరిత్రలో నిలిచే పోరాటం’
x

‘ఇది చరిత్రలో నిలిచే పోరాటం’

బీసీ బిల్లుపై బీజేపీ లేవనెత్తిన అనుమానాలకు సీఎం సమాధానం చెప్పాలన్న కవిత.


బీసీలకు రాజకీయంగా సమ ప్రాధాన్యం దక్కాలన్న ఉక్కు సంకల్పంతో తాము ఈ దీక్ష చేపట్టామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. బీసీలకు న్యాయం జరిగే వరకు తాము పోరాటం ఆపమని అన్నారు. తెలంగాణలోని ప్రతి ఒక్కరికీ రాజ్యాధికారంలో వాటా కావాలి అని ఆమె కోరారు. బీసీ రిజర్వేషన్ల కోసం ధర్నాచౌక్ వద్ద నిరాహారదీక్ష చేపట్టారు. ఈ దీక్ష 72 గంటల పాటు కొనసాగనుంది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ బిల్లుపై బీజేపీ లేవనెత్తిన అనుమానాలను సీఎం రేవంత్, కాంగ్రెస్ నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. ‘‘బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి అనేక పోరాటాలు చేసింది. సబ్బండవర్గాలు బాగుండాలని తెలంగాణ తెచ్చుకున్నాము’’ అని అన్నారు.

‘‘తెలంగాణ వచ్చాక అనేక పనులు చేసుకున్నాము. తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం రావాలి. సమాజంలో సగం జనాభా బీసీలు ఉన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని వెంటపడుతున్నాం. తెలంగాణ జాగృతి పోరాటాలతో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై అసెంబ్లీలో బిల్లు పెట్టారు. సావిత్రిభాయి పూలే జయంతిని ఉమెన్స్ టీచర్స్ డే గా ప్రకటించారు. జ్యోతిభా పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టమంటే ప్రభుత్వం ట్యాంక్ బండ్ పై పెట్టింది. ఈ రోజు జరిగేది బీసీల ఆత్మగౌరవ పోరాటం ప్రారంభించాం. ముస్లిం 10 శాతం రిజర్వేషన్లకు ప్రత్యేకంగా బిల్లు పెడతామని కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వాలి’’ అని కోరారు.

‘‘ముస్లింలకు 10శాతం ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నాం. బీజేపీ అప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. బీజేపీ కేంద్ర ప్రభుత్వం,గవర్నర్ సంతకం పెట్టకపోతే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తాము. ఉమ్మడి ఏపీలో అంబేద్కర్ విగ్రహం కోసం 48 గంటలు దీక్ష చేశాము. ఆంధ్రా వాళ్ళ కంటే మీరు పాపం అయ్యారా...? తెలంగాణలో ధర్నా చౌక్ లు ఓపెన్ చేశామని సీఎం ఢిల్లీలో గప్పాలు కొడుతున్నారు. తెలంగాణ జాగృతి దీక్షకు పర్మిషన్ ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు భయం. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద 72గంటలు దీక్ష చేయడానికి ప్రభుత్వం మాకు అనుమతి ఇవ్వాలి. బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలు అంతా ఏకంకావాలి’’ అని పిలుపునిచ్చారు.

‘‘రెండు ఏళ్లనుంచి ఊర్లల్లో సర్పంచులు,ఎంపీటీసీలు ఉన్నారా. బీసీలకు హక్కులు వచ్చాకే స్థానికసంస్థల ఎన్నికలు జరపాలి. బీసీ రిజర్వేషన్ల కోసం తమిళనాడులో 9 సంవత్సరాలు స్థానికసంస్థల ఎన్నికలు జరగలేదు. తమిళనాడు పట్టుపట్టడంతోనే బీసీ రిజర్వేషన్లు సాధ్యంఅయ్యాయి. తెలంగాణ జాగృతి ఎప్పుడూ శాంతియుతంగానే దీక్షలు చేసింది. 72 గంటలు పర్మిషన్ ఇవ్వకుండా నన్ను తీసుకువెళ్లి పోలీసు స్టేషన్ లో పెట్టినా,హాస్పిటల్ లో పెట్టినా,ఇంటి దగ్గర పెట్టినా అక్కడే దీక్ష చేస్తాను. రాజకీయ పార్టీలు ఏం మాట్లాడినా పట్టించుకోకుండా బీసీ రిజర్వేషన్ల సాధనకోసం బీసీలు ఏకం కావాలి’’ అని ప్రశ్నించారు.

‘‘బీసీల హక్కులు సాధించేవరకు 72గంటల దీక్షను కొనసాగిస్తాను. హాస్పిటల్ తీసుకెళితే హాస్పిటల్లో.. ఇంటికి తీసుకెళితే ఇంట్లో దీక్ష చేస్తాను. బీసీల హక్కులు సాధించేవరకు దీక్ష విరమించను. కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ చెప్పింది చెప్పినట్లు అమలు చేయాలి. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ జంతర్ మంతర్ లో సైతం దీక్షకు దిగుతాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. నాది రాజకీయ పోరాటం కాదు.. బీసీల ఆత్మగౌరవ పోరాటం. గాంధీ చెప్పిన అహింసా మార్గంలోనే 42శాతం రిజర్వేషన్లు సాధిస్తాం. కేంద్రంపై నెపాన్ని నెట్టి కాంగ్రెస్ చేతులు దులుపుకోచాలని చూస్తుంది. రిజర్వేషన్లు రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారమని బీజేపీ చెప్తుంది. బీసీ, ముస్లిం రిజర్వేషన్లు వేర్వేరుగా ఉండాలి. కేంద్రంలో ఉన్న బీజేపీ సంతకాలు పెట్టడం లేదని బీసీలను కాంగ్రెస్ మోసం చేయవద్దు. బీసీలకు హక్కులు వచ్చాకనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి’’ అని అన్నారు.

Read More
Next Story