
తెలంగాణలో భారీ వర్షాలు
ఎనిమిదో తేదీవరకు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిక
తెలంగాణాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.దక్షిణ, పశ్చిమ, మధ్య తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 8 వరకు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గత రెండు గంటలుగా ఏకధాటిగా వర్షాలు కురవడంతో హైదరాబాద్ తడిసి ముద్ద అయింది. రోడ్లపై వర్షపు నీరు ఏరులై పోరుతోంది. నగరం చిత్తడైపోయింది. గత ఐదారు రోజుల నుంచి వర్షాలు కురవలేదు. ఆగస్టు మొదటి వారంలో వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పినప్పటికీ వర్షాలు కురవలేదు. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. కరీంనగర్ జిల్లాలో కప్పలకు పెళ్లి చేసి వర్షాల కోసం ఎదురు చేశారు. కప్పల పెళ్లి చేస్తే వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాసుల నమ్మకం. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో హైదరాబాద్ లో ట్రాఫిక్ స్థంభించి పోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. భారీ వర్షాలకు నగర వాసులు అల్లాడిపోయారు. హైదరాబాద్ లో వర్షం పడే ముందు చిమ్మచీకటై పోయింది. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, పంజాగుట్ట, కూకట్ పల్లి, మాసాబ్ ట్యాంక్, గోల్కొండ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పాతబస్తీలో నిజాం కాలం నాటి మ్యాన్ హోల్స్ కొనసాగడంతో రోడ్లపై వర్షపు నీరు డ్రైనేజిలోకి చేరింది. దీంతో మురుగునీరు రోడ్లపై పారింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. హైడ్రా, జీహెచ్ ఎంసీ సహాయక చర్యల్లో నిమగ్నమైంది.