
కాళేశ్వరం నివేదిక లీకులు ఇస్తుంది కాంగ్రెస్సా..?
అసెంబ్లీ చర్చ తర్వాత మా అభిప్రాయం చెప్తామన్న రామ్‌చందర్.
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌పై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. నివేదికలో ఏముంది? కమిషన్ ఏమని నివేదిక ఇచ్చింది? ప్రాజెక్ట్‌లో ఎంత అవినీతి జరిగిందని కమిషన్ తేల్చింది? ఇలా అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. ఇదే సమయంలో నివేదికకు సంబంధించి కొన్ని పాయింట్లు లీకుల రూపంలో బయటకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి అవినీతి చేసిందని, కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు సూత్రధారి కేసీఆర్ అని, హరీష్ సహా మిగిలిన వారు కీలక పాత్రలు పోషించారని ఈ లీకులు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు ఈ లీకులు నివేదికలోనివా.. కాంగ్రెస్ అనుకుని ఇస్తున్నవా అన్న సందేహం రేకెత్తింది. ఈ అంశంలో కాంగ్రెస్ ఎటాక్ మోడ్‌లో దూసుకెళ్తుంటే.. బీఆర్ఎస్ డిఫెన్స్ మోడ్‌లో పడింది. ఈ క్రమంలోనే ఈ అంశంలో బీజేపీ కూడా తన స్టాన్స్‌కు వెల్లడించింది. ఈ విషయంలో తాము ఇప్పుడే ఏం మాట్లాడమని బీజేపీ తెలంగాణ చీఫ్ రామచందర్ రావు ప్రకటించారు.
అప్పుడే స్పందిస్తాం..
పీసీ ఘోష్ కమిషన్ అందించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అదే విధంగా కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాతే తాము దీనిపై స్పందిస్తామని, తమ అభిప్రాయం వ్యక్తం చేస్తామని రామచందర్ చెప్పారు. నివేదికను చదవకుండా, అందులో పొందుపరిచిన సమాచారం తెలియకుండా ఎటువంటి కామెంట్స్ తాము చేయమని అన్నారు. ఇప్పుడే బయటకు వస్తున్న నివేదిక ప్రభుత్వానిదా? కాంగ్రెస్‌దా? అప్పుడు కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
బీజేపీ మొదటి నుంచే చెప్తుంది..
‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందని బీజేపీ ముందునుంచే చెప్తుంది. ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నివేదికపై బీజేపీ ఎటువంటి వ్యాఖ్యలు చేయదు. అసెంబ్లీ చర్చ తర్వాత మా అభిప్రాయం చెప్తాం. ప్రజలకు వాస్తవాలు తెలిసేలా పూర్తి వివారలతో నివేదికను అసెంబ్లీలో ఉంచాలి’’ అని ఆయన కోరారు.