
‘పదవి కన్నా ప్రజలే ముఖ్యం’
మరోసారి మంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
మంత్రి పదవిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తర్వాత వచ్చిన వారికి, జూనియర్లకు కూడా పార్టీ అదిష్ఠానం మంత్రి పదవి అందించిందని గుర్తు చేశారు. తాను మునుగోడు ప్రజల కోసమే మంత్రి పదవిని వదులుకున్నానని అన్నారు. ఆయన వ్యాఖ్యలు మరోసారి కీలక చర్చలకు దారితీస్తున్నాయి. తనకు పదవులకన్నా మునుగోడు ప్రజలే ముఖ్యమని, వారి కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. సంస్థాన్ నారాయనపురంలో పర్యటించిన రాజగోపాల్ రెడ్డి.. మంత్రి పదవిపై స్పందించారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం అనేది అదిష్ఠానం నిర్ణయం అని, దానిని తాను తప్పుబట్టనని తెలిపారు. తాను ఎప్పుడూ కూడా తన స్వార్థం కోసం మంత్రి పదవి కోరలేదని, ప్రజల మేలు కోసమే అడిగానని వెల్లడించారు.
‘అప్పుడు నాకూ మంత్రి పదవి వచ్చుండేది’
‘‘ఎల్‌బీ నగర్ నుంచి పోటీ చేసి ఉంటే నాకూ మంత్రి పదవి వచ్చేది. కానీ మునుగోడు ప్రజల కోసం మంత్రి పదవిని వదులుకున్నా. నేను పార్టీలోకి వచ్చినప్పుడు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత భువనగిరి ఎంపీ స్థానాన్ని గెలిపించినప్పుడు అదే హామీ ఇచ్చారు. మంత్రి పదవి ఇస్తే మునుగోడు ప్రజలకు మంచి జరుగుతుందని ప్రజలు భావించారు. పదవులను అడ్డుపెట్టుకుని సంపాదించడం నాకు చేతకాదు. అది నా వ్యక్తిత్వం కూడా కాదు’’ అని అన్నారు.
మళ్ళీ త్యాగానికి సిద్ధం..
‘‘నాలాంటి నేతకు మంత్రి పదవి ఇస్తే మరింత మంచి జరుగుతుందని, ప్రజాసేవా కార్యక్రమాలు పెరుగుతాయని ప్రజలు నమ్ముతున్నారు. రాజగోపాల్ రెడ్డికి పదవులకన్నా ప్రజలే ముఖ్యం. నాకు మంత్రి పదవి ఇస్తారా? ఇవ్వరా? అనేది మీ ఇష్టం. నేను ఎప్పుడూ ప్రజల కోసమే పనిచేస్తా. ఎవరి కాళ్లో మొక్కి పదవి తెచ్చుకోవాలని నేను అనుకోవట్లేదు. దిగజారి బతకడం నాకు తెలీదు. అవసరమైతే మళ్ళీ త్యాగం చేయడానికైనా రెడీ. మునుగోడు ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తా. నా నియోజకవర్గ ప్రజలు తలదించుకునే పని నేను ఎప్పుడూ చేయను’’ అని అన్నారు.