కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై బీఆర్ఎస్ ఎదురుదాడి
x
KTR and Harish Rao

కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై బీఆర్ఎస్ ఎదురుదాడి

కేసీఆర్(KCR) పై కుట్రచేయటంలో భాగంగానే కమిషన్-ప్రభుత్వం కుమ్మకైనట్లు మాజీమంత్రులు నానా రచ్చచేస్తున్నారు


కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలకు కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ ముఖ్య కారకులని జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh Commission) ఇచ్చిన రిపోర్టుపై బీఆర్ఎస్ ఎదురుదాడి మొదలుపెట్టింది. పార్టీ సీనియర్ నేతలు, మాజీమంత్రులు గంగుల కమలాకర్ రెడ్డి, గుంటకండ్ల జగదీష్ రెడ్డి తదితరులు మాట్లాడుతు బీఆర్ఎస్ పై బురదచల్లటమే ధ్యేయంగా కమిషన్ తో తమకు కావాల్సినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం రిపోర్టు ఇప్పించుకున్నట్లు ఆరోపణలు చేస్తోంది. తమ అధినేత కేసీఆర్(KCR) పై కుట్రచేయటంలో భాగంగానే కమిషన్-ప్రభుత్వం కుమ్మకైనట్లు మాజీమంత్రులు నానా రచ్చచేస్తున్నారు. ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వానికి కమిషన్ రిపోర్టు ఇచ్చిన మూడురోజులు అసలు పార్టీ తరపున ఎవరూ నోరిప్పలేదు. కమిషన్ లోని అంశాలంటు మీడియాలో కేసీఆర్, హరీష్(Harish Rao) బాధ్యులుగా జస్టిస్ ఘోష్ ప్రస్తావించారనే కథనాలపై కారుపార్టీ నేతలు ఎవరూ మాట్లాడలేదు. సోమవారం క్యాబినెట్ సమావేశం అయ్యే ఉదయం నుండి బీఆర్ఎస్(BRS) నేతలు ఎదురుదాడి మొదలపెట్టడం ఆశ్చర్యంగా ఉంది.

నిజానికి పీసీ ఘోష్ ప్రభుత్వానికి రిపోర్టు సబ్మిట్ చేసిన 48 గంటలవరకు బీఆర్ఎస్ కీలకనేతలు కేటీఆర్, హరీష్ తో పాటు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. రిపోర్టులోని అంశాలు లీకుల రూపంలో మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగ ప్రచారంలోకి వచ్చినా ఎవరూ నోరెత్తలేకపోయారు. విచారణ జరిపి రిపోర్టు ఇచ్చిన పీసీ ఘోష్ గతంలో చీఫ్ జస్టిస్ గా పనిచేశారు. కాబట్టి ఆయన వ్యవహారశైలిపై ఆరోపణలు చేసేందుకు ఏమీ దొరకలేదు. పైగా ప్రచారంలో ఉన్న రిపోర్టులోని అంశాలు అధికారికం కావు. అందుకనే ఎవరూ నోరిప్పలేకపోయారు. ఎప్పుడైతే క్యాబినెట్లో రిపోర్టుపై చర్చించిన తర్వాత అధికారికంగా రిపోర్టు బయటకు వచ్చిందో అప్పటి నుండి బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడులు మొదలుపెట్టారు.

పార్టీ నేతలతో అధినేత కేసీఆర్ మాట్లాడుతు ‘‘కాళేశ్వరం కమిషన్ రిపోర్టు కాదు కాంగ్రెస్ రిపోర్ట’’ని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఇక కేటీఆర్ మాట్లాడుతు కమిషన్ రిపోర్టంతా ఉత్త ట్రాష్, గ్యాస్ అని ఎద్దేవాచేశారు. తన్నీరు హరీష్ రావు మాట్లాడుతు కమిషన్ల పేరుతో పాలన నడుస్తోందన్నారు. రాజకీయ దురుద్దేశ్యాలతో ఇచ్చే రిపోర్టులు కోర్టుల ముందు నిలబడవు అన్నారు. ఎప్పటికైనా ధర్మం గెలుస్తుందని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. కాళేశ్వరం, మేడిగడ్డ నిర్మాణలను నాసిరకంగా కట్టి, నీటివినియోగానికి పనికిరాకుండా నిర్మించింది కేసీఆర్ ప్రభుత్వమే. వాళ్ళ హయాంలో కట్టిన ప్రాజెక్టులు వాళ్ళ హయాంలోనే పాడైపోయాయి. అయినా తాము అద్భుతమైన ప్రాజెక్టు కట్టామని బీఆర్ఎస్ నేతలు చెప్పుకోవటమే విచిత్రంగా ఉంది. ప్రాజెక్టుల పిల్లర్లు కుంగిపోయి, చీలిపోవటం, డ్యాం ప్లాట్ ఫారమ్ లో చీలకలు మామూలు జనాల కళ్ళకు కూడా కనబడతాయి. అంత నాసిరకంగా నిర్మించారు వేల కోట్లరూపాయల ప్రజాధనం ఖర్చుచేసి.

కమిషన్ సబ్మిట్ చేయబోయే రిపోర్టుగురించి బీఆర్ఎస్ నేతల స్పందన ఇలాగే ఉంటుందని అందరు ఊహించిందే. ఇదే విషయాన్ని రేవంత్ మీడియాతో మాట్లాడుతు బీఆర్ఎస్ నేతల స్పందన ఇలాగే ఉంటుందని ఊహించిందే అన్నారు. తాము నిర్మించిన ప్రాజెక్టు నాసిరకమని బీఆర్ఎస్ నేతలు అంగీకరిస్తే ఆశ్చర్యపోవాలి కాని ఎదురుదాడులు చేస్తే ఆశ్చర్యపోవక్కర్లేదు.

Read More
Next Story