
హైదరాబాద్‌లో సైబర్ ఫిషింగ్
వృద్దులను లక్ష్యంగా చేసుకుని రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
హైద్రాబాద్ టోలిచౌకికి చెందిన 64 ఏళ్ల వృద్దుడు కిరాణా సామాగ్రి కొనుగోలుకు బ్లింకిట్ యాప్ ద్వారా గురువారం ఆర్డర్ చేసి మోసపోయాడు. ఆర్డర్ చేసిన తర్వాత అతను సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డారు. చెల్లింపుకోసం అతను గూగుల్లో బ్లింకిట్ కస్టమర్ కేర్ ను సంప్రదించాడు. కస్టమర్ కేర్ నెంబర్ ముసుగులో సైబర్ నేరగాడు వృద్దుడికి టోకరా వేశారు. తన వాట్సాప్ స్క్రీన్ ను వృద్దుడికి షేర్ చేశాడు సైబర్ నేరగాడు. ఇలా షేర్ చేసిన స్కీన్ వృద్దుడి బ్యాంకు ఖాతాను కొల్లగొట్టింది. వృద్దుడు తన ఫోన్ పే ద్వారా యుపిఐ చెల్లింపులు చేయడంతో ఉన్నదంతా ఊడ్చుకుపోయింది .
ఫోన్ పే ద్వారా చెల్లింపులు చేయడానికి సైబర్ నేరగాడు తన మరో నెంబర్ ఇచ్చి చెల్లింపులు చేయాలని సూచించాడు. తనను సైబర్ ఫిషింగ్ చేస్తున్న విషయాన్ని వృద్దుడు ఊహించలేకపోయాడు. సైబర్ నేరగాడు తనను దారి మళ్లించిన విషయాన్ని తన ఫోన్ కు వచ్చే మెసేజ్ ల ద్వారా తెలుసుకున్నాడు ఆ వృద్దుడు.ఈ మెసేజ్ లో తన బ్యాంకు ఖాతానుంచి రూ లక్షా నలభైవేల రూపాయలు డెబిట్ అయినట్లు ఉంది. తెలియని నెంబర్ కాలర్లతో సంప్రదింపులు జరపకూడదని సైబర్ పోలీసులు చెప్పారు. యుపిఐ చెల్లింపుల ప్రమాదకరమన్నారు.
సైబర్ నేరాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి బాధితులు కోట్లాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు. గత నెలలో హైదరాబాద్‌కి చెందిన 70 ఏళ్ల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి హనీ ట్రాప్ వలలో పడి రూ 38.73లక్షలు పోగొట్టుకున్నారు. ఈ హనీ ట్రాప్ లో మహిళ, కేబుల్ ఆపరేటర్, మైనర్ బాలికలు కీలక పాత్ర వహించారు. క్రైం సినిమాను తలపించేలా నిందితులు సైబర్ మోసానికి పాల్పడ్డారు.
రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి ఫేస్ బుక్‌లో మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దాన్ని ఆమోదం తెలిపిన వృద్ధుడు ఆమెతో చాటింగ్ చేయడం ప్రారంభించాడు. తన తండ్రి తమను వదిలేసి వెళ్లిపోయాడని నమ్మబలికింది, తల్లి టైలర్ అని పరిచయం చేసుకున్న మహిళ చాటింగ్ చేసేందుకు ఇంట్లో ఇంటర్నెట్ సదుపాయం లేదని బుకాయించింది. కేబుల్ ఆపరేటర్ నంబర్ ఇచ్చి అతనికి రూ.10వేలు ఇవ్వాలని కోరింది .కేబుల్ ఆపరేటర్ నంబర్‌తో మాట్లాడి బాధితుడు రూ10వేలు యుపిఐ చెల్లింపులతో ట్రాన్స్ ఫర్ చేశాడు. అనంతరం గుర్తు తెలియని మహిళ నుంచి ఫేస్ బుక్లోలో రెస్పాన్స్ లేకపోవడంతో కేబుల్ ఆపరేటర్‌తో చాటింగ్ చేసి మహిళ గురించి వాకబు చేశాడు.
సదరు మహిళ జబ్బు పడిందని ఆస్పత్రిలో ఉందని చెప్పడంతో బాధితుడు మరో 10లక్షలు ట్రాన్స్ ఫర్ చేశాడు. తర్వాత అతని క్రెడిట్ కార్డు నుంచి కూడా మరో 2.65లక్షలు చెల్లించాడు. కొన్ని రోజుల తర్వాత కేబుల్ ఆపరేటర్ మరో డ్రామా ఆడాడు. మహిళ దుబాయ్ వెళ్లిపోయిందని, ఆమె కాంటాక్ట్స్ ఏమీ లేదని కేబుల్ ఆపరేటర్ చెప్పడంతో బాధితుడు నిరాశ చెందాడు. ఈ విషయాన్ని గ్రహించిన కేబుల్ ఆపరేటర్ తనతల్లి,చెల్లి మీతో మాట్లాడాలని అనుకుంటున్నారని చెప్పాడు. బాధితుడు కొద్ది రోజుల పాటు తల్లి, సోదరితో విపరీతంగా చాటింగ్ చేశాడు. ఇదంతా సైబర్ నేరగాళ్ల పన్నాగం అని తెలుసుకోలేక పోయిన బాధితుడు వారికి జవాబిచ్చాడు. ఈ జవాబుల్లో అసభ్య చాటింగ్ ఉంది. దీంతో కేబుల్ ఆపరేటర్ లైన్లోకి వచ్చి తన తల్లి, మైనర్ చెల్లితో అసభ్యంగా చాటింగ్ చేశావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు. ఇలా బెదిరించి యుపిఐ చెల్లింపులు చేయమని సైబర్ నేరగాళ్లు చెప్పడంతో దశలవారిగా రూ 12. 5 లక్షలు, రూ10 లక్షలు , రూ7, 37 లక్షలు యుపిఐ చెల్లింపులు చేశాడు. మొత్తం 38.73 లక్షలు కాజేసారు సైబర్ నేరగాళ్లు.
వృద్దులను టార్గెట్ గా పెట్టుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తెలియని నెంబర్లకు యుపిఐ చెల్లింపులు చేయకూడదని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమానం వస్తే బ్యాంకు లావాదేవీలు స్థంభింపజేయాలని సూచించారు.