ఎక్కడ షూటింగ్ లు అక్కడే బంద్
x

ఎక్కడ షూటింగ్ లు అక్కడే బంద్

తెలుగు ఫిల్మ్ చాంబర్ కీలక నిర్ణయం


సినీ కార్మికుల వేతనాల పెంపు అంశంపై నిర్మాతలు - ఫిల్మ్‌ ఫెడరేషన్‌ నాయకుల మధ్య కొన్ని రోజులుగా జరుగుతున్నచర్చలు ఫలించకపోవడంతో తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎలాంటి షూటింగ్ లు చేయొద్దని నిర్మాతలను ఆదేశించింది. ఫిల్మ్‌ ఫెడరేషన్‌ యూనియన్లతో ఎవరూ సంప్రదింపులు చేయొద్దని కూడా తెలిపింది. తదుపరి సూచనలు ఇచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని వెల్లడించింది.

ముప్పై శాతం వేతనాలు పెంచాలన్న తమ సుదీర్ఘ డిమాండ్‌ నెరవేరే వరకు షూటింగ్స్‌లో పాల్గొనేది లేదంటూ తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఇటీవలే బంద్ ప్రకటించింది. సమ్మె ఫలితంగా ఐదు రోజులుగా అన్ని షూటింగ్స్‌ ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఫెడరేషన్‌ ప్రతినిధులతో నిర్మాతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా నాలుగు ప్రతిపాదనలపై చర్చలు చేసినప్పటికీ సమస్య ఒక కొలిక్కి రాలేదు. దీంతో షూటింగ్‌లను నిలిపివేయాలని ఫిల్మ్ చాంబర్ నిర్ణయించింది.

నాలుగు ప్రతిపాదనలు

ఫెడరేషన్‌ ముందు నిర్మాతలు పెట్టిన నాలుగు ప్రతిపాదనల్లో ఫ్లెక్సిబుల్‌ కాల్‌షీట్లు ఒకటి. (ఉదయం 6 నుంచి సాయ్రంతం 6 గంటల వరకు; ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు) కాల్షీట్లు కావాలి. ఇక్కడ సరైన నిపుణులు లేనప్పుడు ఎలాంటి సభ్యత్వం లేని వారి తో కూడా పనిచేయించుకునే మినహాయింపు ఉండటం రెండో ప్రతిపాదన.షూటింగ్‌ ఎక్కడ చేసినా ఎలాంటి పరిమితులు ఉండకపోవడం మూడో ప్రతిపాదన. రెండో ఆదివారం, పండుగ రోజుల్లో పనికి మాత్రమే డబుల్‌ కాల్‌ షీట్‌, మిగిలిన ఆదివారాల్లో సింగిల్‌ కాల్‌షీట్‌ విధానం నాలుగో ప్రతిపాదన. ఈ నాలుగు ప్రతిపాదనలపై ఫెడరేషన్‌ తమ అభిప్రాయం చెబితేనే వేతన పెంపుపై ఒక నిర్ణయం తీసుకుంటామని నిర్మాతలు తేల్చి చెప్పారు.

ఈ సమావేశం అనంతరం ఫెడరేషన్‌ నాయకుడు అనిల్‌ వల్లభనేని మాట్లాడారు. ‘నిర్మాతల వైపు నుంచి అందిన నాలుగు ప్రతిపాదనలపైనే చర్చ జరిగింది. రెండింటిని ఆమోదించాం. మరో రెండు ప్రతిపాదనలపై యూనియన్‌లో చర్చించాల్సి ఉంది’’ అని ఆయన అన్నారు. ‘‘ఈ సమస్యను ఫిల్మ్‌ ఛాంబర్‌, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌లోనే తేల్చుకుంటాం. రెండ్రోజుల్లో చాంబర్‌ మీటింగ్‌ ఉండొచ్చు. చిరంజీవి, బాలకృష్ణ అందరికీ న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది’’ అని అనిల్ వల్లభనేని అన్నారు.

నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని ధీమావ్యక్తం చేశారు. ‘‘నిర్మాతల ప్రతిపాదనలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. దినసరి వేతనం తీసుకునే వారు ఎన్ని రోజులు పనిచేస్తారనేది ముఖ్యం. సాఫ్ట్‌వేర్‌ వాళ్లతో సినీ కార్మికులకు పోలిక అనవసరం. నిర్మాతలు, కార్మికులు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుంటారని నమ్ముతున్నాను’ అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.

Read More
Next Story