
వేలంలో గణపతి లడ్డూ దక్కించుకున్న ముస్లిం బాలుడు
ఈసారి అ'ధర'హో అనిపించిన గణపతి లడ్డూ
రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సంబరాలు అంబరాన్ని అంటాయి. లడ్డూ వేలం పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ రోజు గణపయ్య గంగమ్మ తల్లి ఒడికి చేరడంతో వినాయకచవితి సంబరాలు ముగింపుకు వచ్చేశాయి. ఇక ఈ ఉత్సవాల్లో అందరిని ప్రధానంగా ఆకర్షించేది లడ్డూ వేలం పాట.
వినయాక చవితి ఉత్సవాల్లో లడ్డూ వేలానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. గణనాథుని చేతిలో నవరాత్రులు పూజలు అందుకున్న ఆ మహా ప్రసాదాన్ని సొంతం చేసుకుంటే తమకు శుభం కలుగుతుందని, భోగభాగ్యాలు దక్కుతాయని భక్తులు భావిస్తారు. దీంతో ఎంతైనా వెచ్చించి వేలంలో దక్కించుకోవడానికి సిద్ధపడుతారు.
ఇక బాలాపూర్ గణపతి లడ్డూ వేలం పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలాపూర్ వినాయకుడి లడ్డూ దక్కించుకోవడం కోసం ఎంతో మంది పోటీ పడతారు. ఇదిలా ఉంటే గణపతి లడ్డూ వేలం పాట అంటే సాధారణంగా హిందువులే పాల్గొంటారు. కానీ ఓ చోట మాత్రం ముస్లిం బాలుడు గణపతి లడ్డూ దక్కించుకున్నాడు.
ఈ సంఘటన నిర్మల్ జిల్లా , కుంటాల మండలంలోని అంబకంటిలో వెలుగు చూసింది. శుక్రవారం నాడు స్థానిక యూత్ సభ్యులు గణేష్ లడ్డూకు వేలంపాట నిర్వహించారు. ఈక్రమంలో గ్రామానికి చెందిన ఏడవ తరగతి విద్యార్థి కే. రెహాన్ రూ.1111 (వెయ్యి నూటపదకొండు)వేలం పాట పాడి లడ్డూను దక్కించుకున్నాడు. ముస్లిం బాలుడు గణేష్ లడ్డూని దక్కించుకోవడం సంచలనంగా మారింది. కులమతాలకు అతీతంగా ఐక్యతను చాటిన రెహాన్‌ను గ్రామస్తులు అభినందించారు. ఓ ముస్లిం బాలుడు గణేష్ లడ్డూని దక్కించుకోవడం విశేషం.
బాలాపూర్ లడ్డూ 35 లక్షల రూపాయలు
గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లడ్డూ వేలం వేయడం అనే సంప్రదాయం సుమారు 21 సంవత్సరాల క్రితం అనగా 1994లో బాలాపూర్‌లోనే మొదలైంది. ముందుగా రూ.450 రూపాయలు పలికిన బాలాపూర్ లడ్డు.. ప్రతి ఏటా తన ధరను పెంచుకుంటూ ఇప్పుడు లక్షల రూపాయలకు చేరింది. 1994లో మొదలైన ఈ వేలంపాట నేటికి కూడా కొనసాగుతూనే ఉంది. ఇక ఈ లడ్డూ వేలంలో దక్కించుకున్న డబ్బును గ్రామ అభివృద్ధికి ఉపయోగిస్తారు. గత ఏడాది బాలాపూర్ లడ్డూని 30 లక్షల ఒక వెయ్యి రూపాయలకు బీజేపీ నేత కొలన్ శంకర్ రెడ్డి దక్కించుకున్నారు.
ఈ సంవత్సరం బాలాపూర్ లడ్డూ 35 లక్షల రూపాయలు పలికింది. లింగాల దశరథ్ గౌడ్ అనే వ్యక్తి బాలాపూర్ లడ్డూని దక్కించుకున్నాడు. బాలాపూర్ లడ్డూ గెలుచుకున్న దశరథగౌడ్‌ను ఉత్సవ కమిటీ సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలాపూర్ లడ్డూ అంటే నాకు చాలా ఇష్టం. ఆరేళ్లుగా ఈ లడ్డూ కోసం ప్రయత్నిస్తున్నా. ఇన్నేళ్ల తర్వాత ఈ సంవత్సరం బాలాపూర్ లడ్డూ దక్కించుకోగలిగాను. ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చారు.
ఖైరతాబాద్ గణేశుడి తర్వాత బాలాపూర్ గణేశుడికి ఎక్కువ ఆదరణ ఉంది. ఖైరతాబాద్ లడ్డూ వేలం వేసే సంప్రదాయం లేదు కాబట్టి బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలానికి ఆధరణ పెరుగుతూ వచ్చింది. హైదరాబాద్ సహా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బాలాపూర్ లడ్డూకు విశేషమైన ఆదరణ ఉంది. లడ్డూ ప్రసాదం స్వీకరించేవారికి కోరిన మొక్కులు తీరుతాయని.. కుటుంబాలు విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో సంతోషంగా ఉంటాయనే విశ్వాసం ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతియేటా బాలాపూర్ లడ్డూ వేలాన్ని ప్రత్యేకంగా ప్రజలు చూస్తుంటారు.
బండ్లగూడ లడ్డూ వేలంలో అక్షరాల రూ.2.32 కోట్లు
హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్‌లో శుక్రవారం నిర్వహించిన వేలంలో గణేశుని లడ్డూ ఏకంగా రూ.2,31,95,000 పలికింది. దీనిని కీర్తీ రిచ్మండ్ విల్లావాసులు సొంతం చేసుకున్నారు. గతేడాది కూడా ఇదే కమ్యూనిటీలో నిర్వహించిన వేలం పాటలో లడ్డూ రూ.1.87 కోట్లు పలికింది.
మై హోంలో లడ్డూ ... 55 లక్షలు
రాయదుర్గం మైహోమ్ భుజాలో గణేష్ లడ్డు రూ.51,77,777 లక్షలు పలికింది. గత ఏడాది రాయదుర్గంలోని మై హోమ్ భుజ ప్రాంతంలో ఏర్పాటు చేసిన గణపతి లడ్డును వేలం వేయగా దాదాపు 20 లక్షలకు పైగా పలికింది. ఖమ్మం నగరానికి చెందిన ఓ వ్యక్తి ఆ లడ్డును సొంతం చేసుకున్నారు.
అయితే ఇప్పుడు అదే రాయదుర్గంలోని మై హోమ్ భుజా ప్రాంతంలో ఏర్పాటు చేసిన గణపతి లడ్డూను వేలం వేయగా ఏకంగా 51,77,777 ధర లభించింది. ఈ లడ్డును ఓ వ్యాపారవేత్త సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. పోటాపోటీగా సాగిన వేలం ధర 50 లక్షలకు పైచిలుకు పెరిగింది. గత ఏడాదితో పోల్చి చూస్తే 30 లక్షలు అదనంగా వచ్చాయని తెలుస్తోంది.
మై హోమ్ భుజ ప్రాంతంలో వ్యాపారవేత్తలు అధికంగా ఉంటారు. ఫార్మా, ఐటి, నిర్మాణరంగం, స్థిరాస్తి, ఎలక్ట్రానిక్స్ విభాగాలలో పనిచేసే పెద్ద పెద్ద వ్యక్తులు.. అధిపతులు ఇక్కడ నివాసం ఉంటారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. ఇక్కడ ఆగర్భ శ్రీమంతులు ఉండడంతో లడ్డును సొంతం చేసుకోవడానికి పోటాపోటీగా వేలం పాడారు. తద్వారా రికార్డు స్థాయిలో ఈ గణపతి లడ్డుకు ధర లభించింది. అయితే లడ్డు వేలం ద్వారా వచ్చిన నగదును సమాజ హిత కార్యక్రమానికి ఉపయోగిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.