
రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి బదిలీ చేయండి
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఢిల్లీలోని కేంద్ర మంత్రి అధికారిక నివాసంలో బుధవారం సమావేశమయ్యారు.
మూసీ, ఈసా నదుల సంగమ స్థలిలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. ఈ రెండు నదుల సంగమ స్థలిలో గాంధీసర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణం చేపడతామని, ఇందుకు అక్కడ ఉన్న 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ శాఖ మంత్రిని సీఎం కోరారు.
జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు ,ల్యాండ్ స్కేప్, ఘాట్లు, శాంతి విగ్రహం మ్యూజియం నిర్మిస్తామని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు.
హైదరాబాద్‌లోని ట్రాఫిక్ రద్దీ క్రమంగా పెరుగుతోందని...ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ను తగ్గించడానికి స్కైవేలు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం అత్యవసరం అని సీఎం వివరించారు. అయితే ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న భూములను రాష్ట్రానికి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మెహదీపట్నం రైతుబజార్ వద్ద స్కై వాక్ నిర్మాణానికి భూమి అవసరమని, దీనివల్ల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు లభిస్తాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు.
సమావేశంలో ఎంపీలు పోరిక బలరాం నాయక్, కడియం కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఇ.వి.నరసింహారెడ్డి, కేంద్ర ప్రాజెక్టులు, పథకాల సమన్వయకర్త డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.