గోల్కొండ‌ను లూటీచేసి ఆ సంప‌ద‌ను నార్త్ ఇండియాకు త‌ర‌లించాడు!
x

గోల్కొండ‌ను లూటీచేసి ఆ సంప‌ద‌ను నార్త్ ఇండియాకు త‌ర‌లించాడు!

ఔరంగ‌జేబు దాడి వెనుక చీకటి నిజాలు...


ఔరంగజేబు పాలనలో మొఘల్ సామ్రాజ్యం ఆసియా ఖండమంతా దాదాపు విస్తరించి వుండేది. అంత పెద్ద సామ్రాజ్యానికి చ‌క్ర‌వ‌ర్తిగా వున్న ఔరంగ‌జేబు చిన్న రాజ్య‌మైన గోల్కొండ‌పై ఎందుకు మోజు ప‌డ్డాడు. త‌న ద‌గ్గ‌ర లేనిది ఇక్క‌డ ఏం వుంది? అదేమిటంటే వ‌జ్రాలు, వ‌స్త్రాలు.

"కోలార్‌, హుట్టి, రామగిరి, పెనగొండ, గోల్కొండ, సత్తెనపల్లి మొదలైన ప్రాంతాలన్నీ వజ్రపు గనులకు ప్రసిద్ధిచెందిన ప్రాంతాలు. ఈ ప్రాంతాలన్నీ గోల్కొండ రాజ్య ఏలుబడిలో ఉండటం వల్ల రాజ్యానికి అపరిమితమైన ఆదాయం వ‌చ్చేది. ఈ ప్రాంతం నుంచి తివాచీలు, వెల్వెట్‌ వస్త్రాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేవి. వరంగల్‌లోని కొత్తవాడ, సిరిసిల్ల ప్రస్తుత పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట ప్రాంతాల్లో విస్తరించిన వస్త్ర పరిశ్రమ. అంతర్జాతీయ స్థాయిలో వస్త్ర ఎగుమతులు ఉండేవి. అందుకే గోల్కొండ రాజ్యంపై ఔరంగజేబు కన్ను ప‌డిందని" జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిటైర్డ్ డైరెక్ట‌ర్ ఎస్వీ స‌త్య‌నారాయ‌ణ చెప్పారు.


కుతుబ్‌షాహీలు డచ్‌, ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌ ఈస్టిండియా కంపెనీలతో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల హైదరాబాద్ అప్ప‌ట్లోనే విశ్వ వ్యాపార నగరంగా మారింది. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి జాతీయ రహదారులు గోల్కొండ రాజ్యంలోనే నిర్మించారు. వీటిలో ముఖ్యమైనవి. హైదరాబాద్‌ నుంచి సూరత్‌ వయా దౌలతాబాద్‌, ఔరంగాబాద్‌. హైదరాబాద్‌ నుంచి మచిలీపట్నం వయా నల్లగొండ, మచిలీపట్నం నుంచి మద్రాస్‌ వయా విజయవాడ. హైదరాబాద్‌ నుంచి గోవా వయా బీజాపూర్‌. "ఇక్కడి ప్రజలు వ్యక్తిగత విలాస జీవితాన్ని ప్రేమించేవారని" ట్రావెర్నియర్‌ రాశాడు.

ఫ్రెంచ్‌కు చెందిన ప్రసిద్ధ అన్వేషకుడు, వ్యాపారి జీన్ బాప్టిస్ట్ టావెర్నియర్ మొట్టమొదట 1638లో భారతదేశానికి వచ్చారు. ఇక్కడ చాలా అందమైన సహజంగా ఉన్న వజ్రాలను చూసి ఆయన ఆశ్చర్యపోయారు. మన వజ్రాల గురించి ఆయన తన జర్నల్‌లో చాలా గొప్పగా రాశారు. "భారత్‌లో అత్యంత స్వచ్ఛమైన వజ్రాలు ఉన్నాయని" పేర్కొన్నారు.

టావెర్నియర్ భారత్‌కు మొత్తం ఆరు సార్లు వచ్చాడు. భారత్‌ నుంచి తిరిగి "యూరప్‌కు వెళ్లిన ప్రతిసారి ఇక్కడి నుంచి పలు వజ్రాలను తీసుకెళ్లాడు. అవి ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన వజ్రాలు. అతని వద్ద ఉన్న వజ్రాల పట్ల యూరోపియన్, రష్యన్ రాజులు, రాణులు, నోబుల్స్‌ను ఆకర్షితులయ్యారు. వజ్రాలను వారు పవర్, గొప్పతనానికి చిహ్నంగా చూశారు. కొన్ని రకాల "వజ్రాలు తమ వద్ద ఉంటే అదృష్టం కలిసి వస్తుందని, తమకు రక్షణ కలుగుతుందని" వారి నమ్మకం.

"గోల్కొండ‌ విజయం తర్వాత, ఔరంగ‌జేబు "కోట గోడలను మరమ్మతు చేయడానికి, బలోపేతం చేయడానికి 80,000 రూపాయల మొత్తాన్ని ఖర్చు చేశాడ‌ని, మొఘలులు కోట పట్ల చాలా దయగల వైఖరిని కలిగి ఉన్నారని" రిచర్డ్స్ రాశాడు.

ఎనిమిది నెలల సైనిక ముట్టడి త‌రువాతే ఔరంగ‌జేబుకు గోల్కొండ హ‌స్త‌గ‌తం అయింది. కుతుబ్ షాహి అధికారి సరందాజ్ ఖాన్‌కు లంచం ఇచ్చి వెనుక ద్వారం ద్వారా మొఘల్ దళాలు కోటలోకి ప్రవేశించి కోట‌ను ఆక్ర‌మించుకున్నారు. ఖ‌జానా దోచుకున్నారు. నూర్-ఉల్-ఐన్, కారా డైమండ్, హోప్ డైమండ్, దరియా-ఎ-నూర్ మరియు రీజెంట్ డైమండ్ వంటి కొన్ని ముఖ్యమైన వజ్రాలను తానేషా చక్రవర్తి ఔరంగజేబుకు అప్పగించారు.

"తానాషా ఔరంగ‌జేబుకు క‌ప్పం క‌ట్ట‌ కుండా కోట్లాది రూపాయ‌ల సంప‌ద‌ను భూమిలో పాతిపెట్టి దానిమీద జామా మసీదును కట్టించినప్పుడు. ఔరంగజేబు ఆ మసీదును పడగొట్టి ఆ నిధుల్ని వెలికితీసి ఉత్త‌రాదికి త‌ర‌లించాడు. అరవై మిలియన్ల రూపాయలకు పైగా విలువైన సంపదను గోల్కొండ కోట ఖజానా నుండి స్వాధీనం చేసుకుని, ఒంటెల ద్వారా ఉత్తరాన ఉన్న మొఘల్ రాజధానులకు రవాణా చేశాడ‌ని" రిటైర్డ్ హిస్ట‌రీ ఫ్రొఫెస‌ర్ అడ‌ప స‌త్య‌నారాయ‌ణ ది ఫెడ‌ర‌ల్ తెలంగాణాకు చెప్పారు.

వ‌జ్రాల‌కు సంబంధించి ప్రపంచ చరిత్ర చూసిన‌టైతే 1728 ముందు భారత్‌లో త‌ప్ప ప్రపంచంలో మ‌రెక్క‌డా వజ్రాల గనులు లేవు. "ప్ర‌పంచానికే అత్యంత విలువైన వ‌జ్రాల్ని అందించిన నేల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌. 1450 నుంచి 1530 వ‌ర‌కు ఆంధ్ర‌ప్రాంతం విజ‌య‌న‌గ‌ర సామ్రాజ్యంలో వుండేది. అప్ప‌ట్లో "విజయనగర వీథుల్లో ర‌త్నాల్ని రాశులుగా పోసి అమ్మేవార‌ని పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్, న్యూనిజ్‌‌ల రచనల వలన తెలుస్తుంది.

1530 నుంచి 1686 వ‌ర‌కు గోల్కొండ చుట్టు ప్రక్కల ఎక్కడ వజ్రాల గనులు లేవు. గోల్కొండ కుతుబ్ షాహీలు ఆంధ్ర ప్రాంతాన్ని, ఆక్రమించి వ‌జ్ర‌పు గ‌నుల‌పై దృష్టి పెట్టారు. గుంటూరు, కృష్ణ, అనంతపూరు, కడప, కర్నూల్ ప్రాంతాలలో అత్యంత నాణ్యమైన వజ్రాల గనులుండేవని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిటైర్డ్ డైరెక్ట‌ర్ ఎస్వీ స‌త్య‌నారాయ‌ణ చెప్పారు.

"గొల్కొండ‌ వజ్రాలకు అంత విలువ ఎందుకు వచ్చిందంటే, ఇక్క‌డ దొరికే వజ్రాలు మచ్చలేని, రంగులేని కన్నీటిబొట్టు వలె ఉండేవి. చూడగానే కంటికి చాలా స్వచ్ఛంగా కనిపిస్తూ కాంతి వెదజల్లుతుంటాయి. వీటి నాణ్యత అధికంగా ఉంటుంది. సహజమైన స్వచ్ఛత, పారదర్శకత, ప్రకాశిస్తూ చాలా ప్రత్యేకంగా వుంటాయి. పర్షియన్లు, అరబ్బులు వీటిని ఎంతో ఇష్టంగా కొనుక్కునేవారని" గోల్కొండ ఇన్సిట్యూట్ ఆఫ్ డైమండ్ ఛైర్మ‌న్‌ఇమ్రాన్ ష‌రీఫ్ ది ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో చెప్పారు.

ఈ వ‌జ్రాలు దేశం దాటి వెళ్ళాయి. కొన్ని వజ్రాలు మిస్‌ అయ్యాయి. గోల్కొండ వ‌జ్రం ప్ర‌త్యేక‌త ఏమిటంటే అవి "గోధుమ, నలుపు, పసుపు రంగులో ఉన్నాయి. గులాబీ, ఆకుపచ్చ, ఎరుపు, నీలం రంగులలో అరుదుగా దొరికాయ‌ని" ఇమ్రాన్ చెప్పారు.

రెండు ప్రధాన సముద్ర ఓడరేవులైన సూరత్, మచిలీపట్నం మధ్య ఈ గోల్కొండ రాజ్యం విస్తరించి ఉండేది. దీంతో ఇది వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందింది. వజ్రాలకు అందరూ గోల్కొండ రావడం మొదలుపెట్టారు. వజ్రాల వ్యాపారం ఒక స్థాయిలో వెలిగింది. కేవలం వజ్రాలను వెలికి తీసేందుకు వాటికి సాన పెట్టేందుకు ల‌క్షా పది వేల మంది అప్పట్లో పనిచేసేవార‌ని ట్రావెర్నియర్‌ రాశాడు.

వ‌జ్రాలు, ఎక్కడ, ఏ ప్రదేశంలో దొరికినవి అనేది చాలా క్లియర్ గా రికార్డ్ చేసేవారు. ప్ర‌తి డైమండ్‌కు సంబంధించిన స‌మాచారం ప‌క్కాగా న‌మోదు చేసేవారు. "గొల్కొండ రాజ్యంలోని కృష్ణ, గుంటూరు జిల్లాలకు చెందిన కొల్లూరు డైమండ్ మైన్స్ లో దొరికినది" అని, అవి కరెక్ట్ గా రాసేవారు. అప్ప‌ట్లో ఈ ప్రాంతంలో వ్యవసాయం తరువాత, వజ్రాల గనుల తవ్వకాల ద్వారా ఉపాధి పొందేవారు. "గుంటూరు ప్రాంతంలోని కొల్లూరు వజ్రాల గనిలో ఒక్క రోజుకు 60,000 మంది పని చేస్తున్నారు" అని రికార్డ్ ఉన్నది. "కర్నూల్ ప్రాంతంలోని రామళ్లకోట వజ్రాల గనిలో ఒక్క రోజుకు 30,000 వేలమంది పని చేస్తున్నారు" అని రికార్డ్ ఉంది."మీర్ జుమ్లా కడప ప్రాంతంలోని గండికోట చుట్టూ 12,000 మందితో వజ్రాలను ఏరిపిస్తూన్నాడు" అని రికార్డ్ ఉంది. గట్టి భద్రత మధ్య వజ్రాల్ని గోల్కొండ కుతుబ్‌షాహీ ఖజానాకు కొంత మంది త‌ర‌లిస్తూ వుండేవారు. మ‌రి కొంత మంది గట్టి భద్రత మధ్య వజ్రాల్ని విదేశాల ఎగుమతులకు మ‌చిలీప‌ట్నం, సూర‌త్ రేపు ప‌ట్ట‌ణాల‌కు చేరుస్తూ వుండేవారు.

వజ్రాల్ని మెరుగు పెట్టేవారు,

అలాగే వజ్రాలను అమ్ముతూ వ‌జ్రాల‌ దుకాణాల్లో ప‌నిచేసేవారు,

వజ్రాల గనులకు కాపలాగా కొంద‌రు అలా చాలా మందే ఉపాది పొందేవారు.

మొత్తంగా ఆంధ్ర, రాయలసీమలోని 38 వజ్రాల గనుల ద్వార ఉపాది దొరికేది. జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్ర‌కారం "నల్లమల కొండల అంచుల్లో ఉన్నకోల్లూరు అతి పెద్ద వ‌జ్ర‌పు గనులకు ప్రసిద్ది పొందిన ప్రాంతం. ఇందుకు సంబంధించి కుతుబ్‌ షాహీలకాలంలో నిర్మించిన వాచ్ టవర్ ఇప్పటికీ ఉంది".

గోల్కొండ డైమండ్స్ గురించి ప్రపంచానికి ఎలా తెలిసిందంటే, "క్రీస్తు పూర్వం 327లో అలెగ్జాండర్ ది గ్రేట్ తన సైన్యంతో భారతదేశానికి వచ్చారు. ఇక్కడి నుంచి యూరప్‌కు తిరిగి వెళ్లేటప్పుడు ఆయన కొన్ని వజ్రాలను తీసుకువెళ్లారు. అనంతరం, చాలా సంవత్సరాల తరువాత 1292లో మార్కో పోలో అనే యాత్రికుడు భారత్‌ను సందర్శించి ఇక్కడి వజ్రాలు ఎంత అందంగా ఉన్నాయో తెలుసుకుని తన పుస్తకంలో రాశారు".

డైమండ్ అన‌గానే అంద‌రికీ గుర్తుకు వ‌స్తుంది కోహినూర్‌. ఇంత‌కీ కోహినూరు అస‌లు క‌థ ఏమిటంటే?

కోహినూర్ వ‌జ్రం కోసం 500 సంవత్సరాలకుపైగా యుద్ధాలు జరిగాయి. ఈ వజ్రం చుట్టూ రక్త చరిత్రే కనిపిస్తుంది. కోహినూర్‌ వజ్రం దొరికింది గుంటూరు జిల్లా కృష్ణానదిని ఆనుకుని ఉండే కోల్లూరు గ్రామంలో. ఈ వజ్రం దొరికినప్పుడు 793 క్యారెట్స్‌ ఉండేదట. కానీ, దాన్ని కోసి కుదించారు. ప్రస్తుతం ఈ కోహినూర్‌ డైమాండ్‌105.6 క్యారెట్లు గా ఉంది. మ‌న తెలుగు నేల‌పై దొరికిన ఈ వ‌జ్రం కోసం చ‌రిత్ర‌లో ఎన్నో యుద్ధాలు జ‌రిగాయి. ఈ వ‌జ్రం ప్రపంచంలో అత్యంత విలువైదంటారు. కానీ, దాని కచ్చితమైన విలువ ఎంత అన్నది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే. ఇంత వరకు దానిని ఎవరూ కొన లేదు, అమ్మ‌లేదు. ఒకరి నుంచి మరొకరు లాక్కొవడం. దోచుకోవడం లేదంటే డిమాండ్ చేసి ఎత్తుకెళ్లటం మాత్రమే జరిగింది. కోహినూర్ వ‌జ్రం ఎన్నో మలుపులు తిరుగుతూ, లండన్ మ్యూజియం చేరిన కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది.తెలుగువారి అమూల్య సంప‌ద‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నం కోహినూర్.

"21.12 గ్రాముల బరువు తూగే కోహినూర్ వజ్రం 105. 602 కేరట్లుంది. 66 ముఖాలుండే ఈ డైమండ్ 3.6 సెం.మీ పొడవు, 3.2 సెం.మీ వెడల్పు, 1.3 సెం.మీ లోతుగా కన్పిస్తుంది. 1980లో ‘ది కోహినూర్ డైమండ్ – ది హిస్టరీ అండ్ ది లెజెండ్’ పుస్తకంలో కోహినూర్ వజ్రం కోల్లూరులో దొరికిందని" స్టీపెన్ హోవర్త్ రాశారు.

"ప్ర‌పంచ వ‌జ్రాల గ‌నుల‌కు కోల్లూరు వ‌జ్రాల గ‌నులు ఆత్మ లాంటివ‌ని" మార్ష‌ల్ అన్నారు. (Earl marshal of England. Henry Howard in 1677 to the Royal Society of London) ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత ప్రసిద్ధ వజ్రాలలో కోహినూర్ వజ్రం ఒకటి.

ఒక పర్షియన్ పాలకుడు ఈ వజ్రాన్ని తొలిసారిగా చూసి ఆశ్చర్యంతో వాహ్‌.. ‘కోహ్‌ ఇ నూర్‌’ అని పిలిచాడు. దాంతో ఈ వజ్రానికి కోహినూర్‌ వజ్రం అనే పేరు అలాగే స్థిరపడింది. అంతేకాదు, ఈ వజ్రం చుట్టూ రక్త చరిత్రే కనిపిస్తుంది. కోహినూర్‌ వజ్రం దొరికింది గుంటూరు జిల్లా కృష్ణానదిని ఆనుకుని ఉండే కోల్లూరు గ్రామంలో.

ఈ వజ్రం దొరికినప్పుడు 793 క్యారెట్స్‌ ఉండేదట.. కానీ, దాన్ని కోసి కుదించారు. ప్రస్తుతం ఈ కోహినూర్‌ డైమాండ్‌105.6 క్యారెట్లు గా ఉంది. మ‌న తెలుగు నేల‌పై దొరికిన ఈ వ‌జ్రం కోసం చ‌రిత్ర‌లో ఎన్నో యుద్ధాలు జ‌రిగాయి. ఈ క్ర‌మంలో ఎన్నో రాజ‌వంశాల చేతులు మారిన కోహినూర్ మ‌న భార‌త‌దేశం దాటి చివ‌ర‌కు బ్రిట‌న్ చేరింది. అక్క‌డి రాజ‌కుటుంబానికి వార‌సత్వ సంప‌ద‌గా మారింది.

1) కోల్లూరులో ఒక వితంతువుకి 1657 లో ఈ వజ్రం దొరికింది. ఆమె దీన్ని గ్రామ పెద్దకు ఇచ్చారు. ఆయన దగ్గర నుంచి నాటి కుతుబ్ షాహీల మంత్రి, వజ్రాల వ్యాపారి అయిన మీర్ జుమ్లాకు ఈ వజ్రం చేరింది. షాజహాన్ తరచూ గోల్కొండ సంస్థానంపై దాడులు చేస్తుండేవారు. దీంతో "షాజహాన్‌ని ప్రసన్నం చేసుకోవడానికి ఆ వజ్రాన్ని బహూకరించారు". అలా మొఘలుల దగ్గరకు చేరిన "ఆ వజ్రం నెమలి సింహాసనంలో అద్భుత ఆభరణం అయింది’’ అని జీన్ బాప్టిస్ట్ టావెర్నియర్ రాశారు. మీర్ జుమ్లా, మొగ‌ల్ చక్రవర్తి షాజహాన్‌కు కత్తిరించని రూపంలో కోహినూర్‌ను సమర్పించారు. షాజహాన్ దీనిని తన సింహాసనంలో అలంక‌రించుకున్నాడు. సింహాసనం పైభాగంలో నెమలి తలపై కోహినూర్ వ‌జ్రం కొలువుదీరి ఉండేది. నెమలి సింహాసనం తయారీకి ఏడేళ్లు పట్టిందట. దీని కోసం చేసిన ఖర్చు, నాలుగు తాజ్‌మహల్‌లు నిర్మించేందుకు ఎంత ఖర్చు అవుతుందో..ఈ సింహాసం తయారీ అంత వ్యయం అయింద‌ట‌.

2) 1665లో ఈ వజ్రాన్ని ఔరంగజేబు ఖజానాలో ఉంచాడు. ఫ్రెంచ్ యాత్రికుడు తవానీర్ ఔరంగజేబ్ పాలనలోకి ప‌ర్య‌టించాడు. అప్పుడే ఔరంగజేబు అతనికి కోహినూర్‌ను చూపించగా, అతను దాని బొమ్మ గీయడానికి సిద్ధపడ్డాడట. అలా మొదటిసారిగా కోహినూర్ మొదటి చిత్రం బ‌ట‌య‌టి ప్ర‌పంచానికి చూసే అవ‌కాశం దొరికింది. "వెనిస్‌కు చెందిన రత్నాల నిపుణుడు బోర్గియాకు కోహినూర్‌ను మరింత అందంగా తీర్చిదిద్దే బాధ్యతను ఔరంగజేబు అప్పగించాడు. కానీ అతను దానిని నిర్లక్ష్యంగా కత్తిరించటం వల్ల 793 నుండి 186 క్యారెట్‌లకు తగ్గిపోయింది. అత‌ని మూర్ఖత్వం, నైపుణ్యం లేకపోవడం వల్ల బోర్గియో భారీ జరిమానా చెల్లించి, శిరచ్ఛేదం నుండి తప్పించుకున్నాడు" అని టావెర్నియ‌ర్ రాశాడు.

3) ఈ కోహినూర్ వజ్రం మొఘల్‌ రాజుల చేతులు మారుతూ ఔరంగజేబు మనవడైన సుల్తాన్‌ మహమ్మద్ షా రంగిలా వ‌ద్ద కు చేరింది. షా రంగిలా కోహినూర్‌ వజ్రాన్ని తన తలపాగాలో ధరించేవాడు. మొఘల్ సామ్రాజ్య పతనావస్థలో దండయాత్రకు వచ్చిన నాదిర్షా ఈవజ్రాన్ని సొంతం చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. మహమ్మద్ షా విలాసాలలో మునిగి తేలుతున్నప్పుడు, నాదిర్ షా సైన్యం 1739లో ఖైబర్ పాస్ దాటి భారతదేశంలోకి ప్రవేశించింది. నాదిర్ షా సైన్యం ముందుకు వస్తోందని మహమ్మద్ షాకు ఎప్పుడు సమాచారం ఇచ్చినా, "ఢిల్లీ చాలా దూరం ఉంది, ఇప్పటి నుంచే కంగారెందుకు అనే వారడ‌ట‌".నాదిర్ షా దిల్లీకి వంద మైళ్ల దూరంలోకి చేరినపుడు, మొఘల్ చక్రవర్తి తన జీవితంలో మొదటిసారి తన సైన్యాన్ని ముందుకు నడిపించాల్సి వచ్చింది. అప్పటి పరిస్థితి ఎలా ఉందంటే ఆయన "సైన్యం లక్షల్లో ఉన్నా అందులో ఎక్కువ భాగం వంటవాళ్లు, సంగీత కళాకారులు, కూలీలు, సేవకులు, మిగతా ఉద్యోగులే" ఉన్నారు. ఇక "సైన్యంలో యుద్ధం చేసే వారి సంఖ్యకొస్తే లక్ష కంటే కాస్త ఎక్కువ" మాత్రమే ఉండేవారు.ఇరాన్ సైన్యంలో కేవలం 55 వేల మందే ఉన్నారు. కానీ నాదిర్ షా పోరాట దళం మొఘల్ సేనలతో ఆడుకుంది. కేవలం మూడు గంటల్లో కర్నాల్ మైదానంలో యుద్ధం ముగిసింది. మహమ్మద్ షాను బంధించిన నాదిర్ షా దిల్లీ విజేతగా నగరంలోకి ప్రవేశించాడు. తర్వాత రోజు బ్ర‌కిద్ పండుగ‌. దిల్లీ మసీదుల్లో జరిగిన నమాజుల్లో నాదిర్ షా పేరు చదివారు. ముద్రణాలయాల్లో ఆయన పేరున నాణేలను ముద్రించారు.

1739 మే 12న సాయంత్రం..

దిల్లీలో సంబరంగా ఉంది. షాజహాన్‌బాద్, ఎర్రకోట నలువైపులా వేడుకలు అంబరాన్నంటాయి.పేదలకు షర్బత్, తినుబండారాలు, పండ్లు పంచుతున్నారు. ఫకీర్ల జోలె నిండా కాసులు నింపుతున్నారు.ఈ రోజు మొఘల్ రాజసౌధం పైఅంతస్తులో ఇరాన్ బాద్షా నాదిర్ షా ముందు, మహమ్మద్ షా తల వంచుకుని కూర్చుని ఉన్నాడు. ఈ సారీ ఆయన తలపై రాజ మకుటం లేదు. దానికి ఒక కారణం ఉంది. అప్పటికి రెండున్నర నెలల కిందటే నాదిర్ షా ఆయన్నుంచి సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు.56 రోజులు దిల్లీలో ఉన్న తర్వాత ఇక నాదిర్ షా తిరిగి ఇరాన్ వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు భారతదేశ పగ్గాలను ఆయన తిరిగి మహమ్మద్ షాకు అప్పగించాలనుకుంటున్నాడు.శతాబ్దాల నుంచి సేకరించిన మొఘల్ సంపదను నాదిర్ షా ఊడ్చేశాడు. పట్టణంలో ఉన్న సంపన్నులు, ప్రముఖులందరి జేబులూ ఖాళీ చేశాడు.

ఈ నేపథ్యంలో.. దిల్లీలోని ఒక వేశ్య నూర్ భాయి, నాదిర్ షాకు ఒక సమాచారం అందించింది.మీరు సేకరించిన ఈ మొత్తం సంపద కంటే విలువైనది ఒకటుందని చెప్పింది. దాన్ని మహమ్మద్ షా తన తలపాగాలో దాచాడని ఉప్పందించింది.

నాదిర్ షా అప్పటికే తన ఎత్తులతో ఎంతో మంది చక్రవర్తులకు చుక్కలు చూపించారు. ఎంతో సంపద దోచుకున్నాడు. ఆ సమయంలో ఆయన వేసిన ఎత్తు తిరుగులేనిదిగా చెబుతారు.ఆయన మహమ్మద్ షాతో "ఇరాన్ లో ఒక సంప్రదాయం ఉందన్నారు. సంతోషంగా ఉన్న సమయంలో సోదరులు తమ తలపాగాలు మార్చుకుంటారని చెప్పారు. ఈ రోజు నుంచి మనం సోదరులం. నా సంతోషం కోసం మనం కూడా తలపాగాలు మార్చుకుందామా?" అన్నారు.

మహమ్మద్ షా అప్పుడు తలవంచడం తప్ప వేరే ఏదీ అనలేని పరిస్థితిలో పడిపోయాడు. "నాదిర్ షా తన తలపాగా ఆయన తలపై పెట్టాడు. మహమ్మద్ షా తలపాగాను తీసి తన తలపై పెట్టుకున్నాడు". అక్కడితో ఒక చరిత్రకు తెరపడింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కోహినూర్ వజ్రం భారతదేశం హద్దులు దాటి ఇరాన్ చేరుకుంది.

4) ఈ వజ్రం అసాధారణమైన కాంతితో మెరుస్తుండటంతో, నాదిర్ షా 'కోహినూరు' (కాంతి పర్వతం) అని పేరు పెట్టాడు. ఈ వ‌జ్రం విలువను త‌న‌దైన స్టైల్‌లో "ఒక వ్యక్తి నాలుగు దిక్కులకు రాయి విసిరి, ఆ మధ్యలో ఉన్న ఖాళీని బంగారంతో నింపినట్టయితే దాని మొత్తం విలువ కూడా, ఈ కోహినూర్‌తో సరిపోదని" చెప్పాడు. అలా కోహినూర్ వజ్రాన్ని దక్కించుకున్న నాదర్ షా ఆ తరువాతి కాలంలోనే హత్యకు గురయ్యాడు. అతని కుమారులు ఆదిల్ షా, ఇబ్రహీం కూడా హత్యకు గురైయ్యారు. వారి మరణానంతరం నాదిర్‌షా మనవడు షారుఖ్ కోహినూర్‌ వజ్రాన్ని ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన అహ్మద్ షాకు అప్పగించాడు.

5) షారూఖ్‌ నుంచి కోహినూర్‌ను సొంతం చేసుకున్న అహ్మద్ షా హఠాత్తుగా చనిపోయాడు. అతని రాజ్యం అల్లకల్లోలంగా మారింది. అతని కొడుకుల మధ్యే వజ్రం కోసం వివాదాలు, అంతర్యుద్దాలు జరిగాయి. అప్పుడు వారిలో ఇద్దరు కొడుకులు వజ్రంతో పంజాబ్‌కు పారిపోయారు.

6) త‌న వ‌ద్ద శ‌రణు కోరి వ‌చ్చిన ప‌ర్షియ‌న్ రాజుల నుంచి కోహినూర్ వ‌జ్రాన్ని లాహోర్ కేంద్రంగా పంజాబ్ సామ్రాజ్యాన్ని పాలిస్తున్న‌ మ‌హారాజా రంజిత్ సింగ్ సొంతం చేసుకున్నాడు. కానీ,అతను కూడా అతి తక్కువ సమయంలోనే మరణించాడు.

7) రంజిత్ సింగ్ మరణానంతరం సింహాసనం కోసం జరిగిన పోటీతో బ్రిటిష్‌ వారు పంజాబ్‌ను ఆక్రమించేశారు. సిక్కు రాజులను అంతం చేసి పంజాబ్ ఆస్తులు కైవసం చేసుకుంది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆ వెంటనే కోహినూర్‌ వజ్రాన్ని లాహోర్‌లోని బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీ ఖజానాకు తరలించింది.

8) కోహినూర్‌ వజ్రాన్ని ఇంగ్లాండ్‌కు నౌకలో తరలిస్తుండగా ఆ నౌకలో కలరా వ్యాపించింది. దాంతో ఆ నౌకను రోగులతో పాటుగా సముద్రం ఒడ్డున వదిలిపెట్టేశారు. కోహినూర్‌ వజ్రాన్ని వెంటతీసుకెళ్తున్న బ్రిటిష్‌ అధికారితో పాటుగా మరికొందరు ఉన్నతాధికారులు, సిబ్బంది మాత్రం క్షేమంగా ఇంగ్లాండ్‌కు వెళ్లిపోయారు. కోహినూర్‌ వజ్రం ఇంగ్లాండ్‌ గడ్డపై దిగిన రోజునే అక్కడ అనుకోని సంఘటన జరిగిందని ప్రచారంలో ఉంది. ఇంగ్లాండ్‌ రాణి విక్టోరియాను గుర్తుతెలియని దుండగులు హతమార్చేందుకు ప్రయత్నించారు. ఈ దాడిలో ఆమె తలకు బలమైన గాయమైంది. మరోవైపు, అప్పటి ప్రధానమంత్రి రాబర్ట్‌ పిల్‌ ప్రమాదవశాత్తు గుర్రంపై నుంచి కిందపడి మరణించారు. భారతదేశానికి చెందిన వెలకట్టలేని సంపద కోహినూర్‌ వజ్రం విలువ, దాని సహజ సౌందర్యానికి ముగ్ధులైన ఈస్ట్ ఇండియా కంపెనీ 1850లో అప్పటి ఇంగ్లండ్ రాణి క్వీన్ విక్టోరియాకి బహుమతిగా అందజేసింది.1852లో కోహినూర్‌ వజ్రం కాంతి, వన్నే తగ్గిందని భావించిన విక్టోరియా మహారాణి దానికి మెరుగులు పెట్టించారు. డచ్‌కు చెందిన జ్యూవెలర్ కాంటోర్‌కు ఆ బాధ్యతను అప్పగించారు. దాంతో 186 క్యారెట్స్‌ ఉన్న కోహినూర్‌ కాస్త 108.93 క్యారట్లకు కరిగిపోయింది. ఆ త‌ర్వాత ఈ వ‌జ్రాన్ని క్వీన్ అలెగ్జాండ్రా, క్వీన్ మేరీ, క్వీన్ ఎలిజబెత్ ధ‌రించారు. ప్ర‌స్తుతం ఈ కోహినూర్ వ‌జ్రం బ్రిట‌న్ రాజ‌కుటుంబంలో వార‌స‌త్వ కానుక‌గా మారింది. ఈ వ‌జ్రాన్ని త‌మ ఇంటి పెద్ద కోడ‌లికి వార‌సత్వంగా అంద‌జేస్తున్నారు.1947 నుంచే కోహినూర్ ను భారత్ కు తెప్పించాలని ప్రయత్నం చేస్తోంది భారత ప్రభుత్వం. 1953లో బ్రిటన్ రాణిగా పట్టాభిషిక్తురాలైన ఎలిజబెత్-2కు విన్నపం చేసింది భారత్. అప్పట్లో కోహినూర్ ను భారత్ కు తెప్పించాలంటూ రాజ్యసభలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టి 50 మంది ఎంపీలు సంతకాలు చేశారు. 2009లో దీన్ని తిరిగి ఇండియాకు తెప్పించాలని డిమాండ్‌ చేశారు మహాత్మా గాంధీ మనవడు తుషార్‌ గాంధీ. 2013లో కోహినూర్ తిరిగి ఇవ్వాలని భారత్ చేస్తున్న డిమాండ్ ను తోసిపుచ్చారు నాటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్. గోల్కొండ రాజ్యం నుంచి ఇంగ్లాండ్‌ వెళ్లిన ఈ వజ్రం మాదంటే మాదంటూ అనేక దేశాలు వాదిస్తున్నాయి. భారతదేశం, పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్ ఈ వజ్రం తమదేనని చెబుతున్నాయి. 1976లో బ్రిటన్‌ ప్రధానికి లేఖ రాశారు పాక్‌ ప్రధాని భుట్టో. 2000 సంవత్సరంలో కోహినూర్ మాదేనంటు డిమాండ్ చేశారు తాలిబన్లు. బ్రెజిల్‍లో వజ్రాలు కనుగొనే వరకు భారతదేశ‌మే వజ్రాలకు మూలం. ఇక్కడ చాలా పెద్దవి, అత్యుత్తమ నాణ్యతగల వజ్రాలు లభించాయి. ప్లినీ, టోలెమీ వంటి గ్రీకు, రోమన్‍ రచయితలు భారతదేశాన్ని వజ్రాలు ల‌భించే ప్ర‌దేశంగా పేర్కొన్నారు. మార్కో పోలో రచనలలోనూ వజ్రాల ప్రసక్తి ఉంది. అయితే ప్రస్తుతం మన దేశంలో వజ్రాల ఉత్పత్తి పూర్వంతో పోలిస్తే బాగానే తగ్గింది. ఆస్ట్రేలియా, రష్యా, ఆఫ్రికా వంటి దేశాల్లో వజ్రాల మైనింగ్ పెరిగిపోయింది. ఎన్ని వజ్రాలు వచ్చినా గోల్కొండ వజ్రానికి ఉన్న నాణ్యత మాత్రం ఇప్పటి వరకు ఏ వజ్రాలలో కనిపించలేదు.

Read More
Next Story