కాలం కాటుకు ‘యాకుత్ మహల్’ బలి?
x

కాలం కాటుకు ‘యాకుత్ మహల్’ బలి?

తొందర్లో హైదరాబాద్ గ్రాండ్ ఓల్డ్ మూవీ ధియోటర్ కూడా క్లోజ్!


87 ఏళ్ళ క్రితం అప్పట్లోనే ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన నూతన టెక్నాలజీతో యాకుత్‌ మహల్‌ సినిమా టాకీస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉండేది. నాడు ప్రారంభమైన ఈ టాకీస్‌ ఇప్పటికీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే ఉంది. పాత‌బ‌స్తీ రద్దీగా ఉండే సందులలో ఉన్న యాకుత్ మహల్ గ‌త వైభ‌వానికి అద్దం ప‌డుతుంది.

ఆ రోజుల్లో వినోదం కోసం ఓపెన్‌ ఎయిర్‌లో, గుడారాలలో మూకీ సినిమాలు ప్రదర్శించేవారు. క్రమంగా శాశ్వత ప్రాతిపదికన థియేటర్లు నిర్మించడం ఆరంభమైంది. హైదరాబాద్‌ లో తొలి సినిమా థియేటర్‌ 1920లో ఏర్పాటైనట్టు తెలుస్తున్నది. ధీరేన్‌ గంగూలీయే సినిమా థియేటర్ల నిర్మాణానికి కూడా పునాదులు వేశాడని అంటారు. క్రమంగా సినిమా థియేటర్లు ఇతర నగరాలు, పట్టణాలకు విస్తరించాయి. 1939 నాటికే 70కి పైగా తాత్కాలిక, శాశ్వత సినిమా థియేటర్లు ఉన్నట్టు ఫజల్‌ భాయ్‌ అనే సినీరంగ నిపుణుడు ‘ఇండియన్‌ ఫిల్మ్‌ రివ్యూ’ అనే ఆనాటి మ్యాగజైన్‌లో ప్రస్తావించాడని ల‌తీఫ్ ష‌ర్ఫ‌న్ ది ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో చెప్పారు.

యాకుత్‌ మహల్‌ టాకీస్‌ అందుబాటులోకి వచ్చాక హైద‌రాబాద్ లో వినోద విప్లవం వచ్చింది. బ్లాక్‌ అండ్‌ వైట్‌ టాకీ సినిమాలు, అత్యాధునిక సౌండ్‌ సిస్టంతో ఉండడంతో నగరం నుంచే కాకుండా వివిధ ప్రదేశాల నుంచి సినిమా చూసేందుకు జనం ఎక్కువ సంఖ్యలో వచ్చేవారు. సుదూర ప్రాంతాల నుంచి పలువురు కుటుంబ సమేతంగా ఎడ్ల బండ్లపై, నవాబులు సంస్థాన ఉన్నత అధికారులు గుర్రాలపై వచ్చి సినిమా చూసి వెళ్లేవారు. మహల్‌ చుట్టూ చెట్లు ఉండడంతో ఇక్కడే వంటలు వండుకొని భోజనం చేసి తర్వాత తమ ప్రాంతాలకు వెళ్లేవారట‌.

హైదరాబాద్‌ నగర ప్రహరీ గోడకు అవతల వైపు యాకుత్‌ దర్వాజా నుంచి వెళ్లే దారి ఉండేది. ఆ రోజుల్లో నిజాం పాలకులు టాకీస్‌ నిర్మాణం కోసం దాదాపు ఐదెకరాల స్థలాన్ని కేటాయించారు. యాకుత్‌ మహల్‌ టాకీస్‌ నిర్మాణాన్ని 1935లో జాఫర్‌ నవాజ్‌ జంగ్‌ ప్రారంభించారు. 1938లో నిర్మాణం పూర్తయ్యింది. ఈ టాకీస్‌ ప్రొజెక్టర్‌ గది ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది.

ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ ప్రొజెక్టర్‌ అమెరికాలో అందుబాటులో ఉందని నిజాం పాలకులు ఆరాతీశారు. 1937లో చికాగోలోని మెక్ ఆలేయ్‌ తయారు చేసిన పీర్‌లెస్‌ మాగ్నరాక్‌ మెషీన్‌ రెండు ప్రొజెక్టర్లకు ఆర్డర్‌ ఇచ్చారు. వీటిని 1938లో సముద్ర మార్గాన నౌకలో నగరానికి తీసుకువచ్చారు. ప్రొజెక్టర్‌లను ఏర్పాటు చేసి సినిమా రీళ్లను ప్రారంభించారు. హాల్‌లోని అన్ని మూలల్లో స్క్రీన్‌ ఆరు వాల్ స్పీకర్లతో కూడిన డిజిటల్‌ ధ్వని వ్యవస్థను రూపొందించారు. ఏ మూల నుంచి చూసినా సినిమా నేరుగా కనిపించేలా సీటింగ్‌ ఏర్పాటు చేశారు.

547 ఇనుప కుర్చీలు, 192 సీటు బాల్కనీలు, 81 సీట్ల ను వీఐపీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. నవాజ్‌ జంగ్‌ అనంతరం లక్ష్మీ నారాయణ్‌ యాదవ్‌, ఆ తర్వాత 2005 నుంచి షర్ఫన్‌ కుటుంబం ఈ సినిమా హాల్‌ నిర్వహణ కొనసాగిస్తున్నారు. పైకప్పు, సీట్లు, తలుపులు ఒకేలా ఉంటాయి. నవాబులు తమ కుటుంబ సమేతంగా సినిమా చూసేందుకు వచ్చే వారని, ఇందుకోసం బాల్కనీ మధ్యలో ప్రత్యేక పరదాలు ఉండేవని, హాల్‌ మధ్యలో కూడా మహిళలు, పురుషుల కోసం పరదాలు అమర్చేవారట‌. ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌తో పాటు అలనాటి హిందీ, తెలుగు సినీ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌, యాకుత్‌ మహల్‌లో సినిమాలు చూసినవారిలో ఉన్నారు. వాయిస్ః 7 90 ఏళ్ల నాటి ఈ థియేటర్ ప్రేక్షకులు సినిమా మాయాజాలాన్ని అనుభవించడానికి తరలివచ్చే ప్రియమైన గమ్యస్థానం. నేటికీ, యాకుత్ మహల్ తన పాత ప్రపంచ ఆకర్షణను నిలుపుకుంది, ఇది అప్పటి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

థియేట‌ర్‌లో ఎన్ని హంగులున్నా జ‌నం రావాలంటే మంచి సినిమాలు, భారీ సినిమాలు ఉండాలి క‌దా! పెద్ద సినిమాలు రావు. చిన్న సినిమాల‌తో న‌డ‌వాలి. కాబ‌ట్టి థియేట‌ర్‌కి జ‌నం రారు. క‌నీసం క‌రెంట్ బిల్లు క‌ట్ట‌డానికి కూడా ఆదాయం రావ‌డం లేదు. భ‌రించ‌లేని స్థితిలో మూసేస్తున్నారు. పాత థియేట‌ర్ న‌డ‌ప‌డ‌మ‌నేది చాలా భారంగా మారింద‌ని యాకుత్‌ మహల్ నిర్వాహ‌కులు ఎం.ఎ.ల‌తీఫ్ ష‌ర్ఫ‌న్ తెలిపారు.

స్వాతంత్ర్యానికి పూర్వం నిర్మించిన ఈ సినిమాలు, 70 ఎం.ఎం.పెద్ద తెర, పాతకాలపు ప్రొజెక్టర్ల మినుకుమినుకుమనే కాంతి, గ‌తం జ్జాప‌కాల‌కు స‌జీవ సాక్షంగా నిలిచింది యాకుత్‌ మహల్‌. దేశంలో తొలితరం సినిమా ప్రస్తావన వస్తే ముంబై, కోల్‌కతా, చెన్నై పేర్లే చెబుతారు. నిజానికి, భారతీయ సినిమా తొలినాళ్ల ప్రస్థానంలోనూ హైదరాబాద్‌ నగరం కీలక పాత్ర పోషించింది.

Read More
Next Story