బంగారం జోలికి వెళితే బుక్కయిపోయినట్లే...
x

బంగారం జోలికి వెళితే బుక్కయిపోయినట్లే...

దీపావళి సీజన్‌లో గోల్డ్ పై పెట్టుబ‌డి నష్టమా..? లాభమా..?


గత 24 నెలల్లో ఆగస్టు 2023 నుంచి ఆగస్టు 2025 మధ్య గోల్డ్ ధర 108% పెరిగింది. అంతర్జాతీయంగా గోల్డ్ ధర $1,900 నుండి $3,860కి చేరగా, భారత మార్కెట్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఈ వారంలో తులం బంగారం ధర లక్షా 25 చేరుకుంటుంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు.

అక్టోబర్ 18న ధంతేరాస్ ఉంది. దీపావళి ముందు వచ్చే ధంతేరాస్ నాడు బంగారం కొనుగోళ్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ధన త్రయోదశి నాడు బంగారం కొంటే శుభమని, లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడంతో సమానం అని నమ్ముతుంటారు. ఈ నేప‌థ్యంలో బంగారం ధర ఎంత పెరుగుతుంద‌నే ఉత్కంఠ‌త నెల‌కొంది.

ఈ సంవత్సరం ప్రారంభం నుండి బంగారం ధర వేగంగా పెరుగుతోంది. జనవరిలో, 1 గ్రాము బంగారం రూ. 7,000 కు అమ్ముడైంది. ఏప్రిల్‌లో అది రూ. 9,000 కు చేరుకుంది. ఆ తర్వాత, అక్టోబర్‌లో, ఒక గ్రాము ఇప్పుడు రూ. 12,600/-. వెండి ధర కూడా పెరిగి కిలో వెండి రూ.1,67,000కి అమ్ముడవుతోంది.

గత ప‌దేళ్ల‌లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. 2014లో 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు) ధర రూ. 28,000 ఉండగా, 2024 నాటికి ఇది రూ. 73,000కి చేరింది. అంటే, 10 ఏళ్లలో దాదాపు 160% పెరుగుదల.

“బంగారం ధరలు ఇంతగా పెరిగినా, మా సంస్కృతిలో దీని విలువ తగ్గలేదు. ఇంట్లో పెళ్లి వుంది. కొనడం కష్టంగా వున్నా త‌ప్ప‌డం లేదు. అవ‌స‌రం మేర‌కే కొన్నాను,” అని హైదరాబాద్‌కు చెందిన విజ‌యల‌క్ష్మీ చెప్పారు.

"బంగారం జోలికి వెళితే బుక్కయిపోయినట్లే. అమెరికాతో భార‌త్ సంబంధాలు మెరుగుప‌డితే ఖ‌చ్చితంగా ప‌రిస్థితుల్లో మార్పులు వ‌స్తాయి. ట్రంప్ నిర్ణ‌యాలు అమెరికా పాలిట శాపంగా మారాయి. ఆయ‌న వ్య‌వ‌హార‌శైలిలో మార్పు వ‌స్తే బంగారం ధ‌ర‌లు త‌గ్గుతాయి. అందుకే అవ‌స‌రం మేర‌కే బంగారం కొనాలి. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బంగారంపై పెట్టుబ‌డి పెట్ట‌వ‌ద్ద‌ని సీనియ‌ర్ స్టాక్ మార్కెట్ విశ్లేష‌కుడు మాలెంపాటి ప్ర‌భు ది ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో చెప్పారు.

"షట్ డౌన్ వైపు అమెరికా వెళ్ళడంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితమైన మార్గాల వైపు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సేఫ్ గా వారికి బంగారం కనిపిస్తోంది. అందులోనే పెట్టుబడులు పెట్టడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇన్వెస్టర్లు డాలర్ సంబంధిత రంగాల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. గోల్డ్ మీద పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇది కూడా బంగారం పెరుగుదలకు కారణమవుతోందని" గోల్కొండ ఇన్సిట్యూట్ ఆఫ్ డైమండ్స్ ఛైర్మ‌న్ ఇమ్రాన్ ష‌రీఫ్ ది ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో చెప్పారు.

ప‌సిడి రికార్డ్ స్థాయిలో పరుగులు పెడుతోంది. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ కొనసాగుతుండడం బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతోంది. డాల‌ర్‌ను దెబ్బ‌కొట్ట‌డానికే, చైనా బంగారాన్ని భారీస్థాయిలో కొని స్టాక్ చేసుకుంటోంది. అమెరికా సుంకాలు, అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితులు, దేశాల కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్ల వంటి ప్రధాన అంశాలు బంగారానికి డిమాండ్ పెంచాయి. జ‌నం న‌లుగురు క‌లిస్తే బంగారం గురించి మాట్లాడుకుంటున్నారు. "తులం బంగారం ధ‌ర ల‌క్ష‌న్న‌ర‌కు చేరుకుంటుందా?".

అక్టోబ‌ర్ 7వ తేదీ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు బెంబేలెత్తించాయి. 24 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర కొత్త రికార్డ్ సృష్టించింది. తులం రేటు రూ.1,20,770 వద్దకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల తయారీ తులం గోల్డ్ రేటు రూ. 1,10,700 వద్దకు చేరింది. బంగారం మాత్రమే కాదు వెండి రేటు సైతం భారీగా దూసుకెళ్తోంది. ఊహించని విధంగా వెండి ఆకాశంలో ట్రేడవుతోంది. మార్కెట్లో కిలో వెండి రేటు రూ.1,66,000 మార్క్ వద్దకు చేరుకుంది.

Read More
Next Story