నాలుగు గోడల మధ్య బందీ అయిన పీవీ అపురూపం జ్ఞాపకం
x

నాలుగు గోడల మధ్య బందీ అయిన పీవీ అపురూపం జ్ఞాపకం

వెలుగులోకి రాని హైదరాబాద్ పీవీ నరసింహారావు స్మారక గ్రంథాలయం


మాజీ ప్ర‌ధాని, భార‌త ర‌త్న పీవీ నరసింహారావు ను గుర్తు చేసే అనేక ఆనవాళ్లు హైదరాబాద్ లో ఉన్నాయి. ఇందులో ఒక ఆనవాలు గురించి చెబుతున్నాను. దురదృష్టమేమిటంటే, విలువైన ఈ ఆనవాలు గురించి ఎవ్వరికీ తెలియదు. దీనిని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం జరుగడం లేదు. ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అదే పీవీ స్మార‌క గ్రంథాల‌యం. ఎక్కడుందో ఎవరికీ తెలియదు. అక్కడికి వెళ్లితే ఎవరికి తెలియకుండా, ఎవరికంటా పడకుండా ఈ గ్రంథాలయాన్ని నడుపుతున్నారా అనే అనుమానం వస్తుంది.

అక్క‌డికి చేరుకోవాలంటే బేగంపేట బ్రిడ్జ్ కింద నుంచి బ్రాహ్మ‌ణ‌వాడీ లోప‌లికి వెళ్ళితే 9వ వీధి చివ‌ర్లో రోడుకు డెడ్ ఎండ్‌లో మారుమూల‌లో వుంటుంది. స్వామి రామానంద తీర్థ మెమోరియల్ ప్రాంగణంలో ఉన్న ఈ లైబ్ర‌రీ నేడు నాలుగు గోడల మధ్య బందీ అయిపోయింది. పీవీ నరసింహారావు జీవిత కాలంలో చదివిన, సేకరించిన పుస్తకాలతో కూడిన పుస్త‌కాల ఖజానా అది.

నేడు ఎవరికి అందుబాటులో లేకుండా పోయింది. ఇక్క‌డ అరుదైన ఎన్నెన్నో భాషల పుస్తకాలున్నా, అవి పాఠకులకు దూరంగా వున్నాయి. ఈ లైబ్ర‌రీ వైపు ఎవ‌రూ క‌న్నెత్తి చూడ‌రు. అస‌లు అక్క‌డ ఓ లైబ్ర‌రీ ఉంద‌న్న విష‌యం కూడా ఎవ‌రికీ తెలియ‌దు. ఒక వేళ తెలిసిన వాళ్ళు అక్క‌డి వెళ్ళ‌డానికి ప్ర‌య‌త్నిస్తే, స్కూల్ పిల్ల‌లున్నారంటూ బ‌య‌టి వాళ్ళ‌కి అనుమ‌తించ‌రు. ఎవ్వ‌రినీ రానివ్వ‌రు. ఫెడరల్ తెలంగాణ బృందం ఒక మధ్యాహ్నం వెళ్లినపుడు లైబ్రరీలో ఒక్క పాఠకుడు కనిపించలేదు.

మ‌రో ప‌క్క...... అఫ్జ‌ల్‌గంజ్‌ లో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, చిక్క‌డ్‌ప‌ల్లి సిటి సెంట్రల్ లైబ్రరీ తో పాటు హైద‌రాబాద్‌లోని ఏ గ్రంథాల‌యం చూసినా పోటీ ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌ప‌డే యువ‌త క‌నిపిస్తారు. క‌నీసం కూర్చోవ‌డానికి స్థ‌లం లేక‌పోవ‌డంతో వారంతా చెట్ల కింద‌, మెట్ల‌పైన నానా అవ‌స్థ‌లు ప‌డుతూ చ‌దువుతూ వుంటారు. గాంధీ ఆసుప‌త్రి, దిల్ షుక్ నగర్, అమీర్ పేట్ ల వైపు వెళ్ళితే ప్రైవేట్ స్ట‌డీ రూంలెన్నో క‌నిపిస్తాయి. నెల నెలా వేల రూపాయ‌లు పే చేస్తూ ఇక్కడ చ‌దువుకుంటూ ఉంటారు. మ‌ధ్య‌, పేద త‌ర‌గ‌తి యువ‌త‌కు లైబ్ర‌రీలే దిక్కు. పీవీ స్మార‌క లైబ్ర‌రీ విశాల ప్రాంగ‌ణంలో వుంది. కానీ ఇక్కడ సందర్శకులెవరూ కనిపించరు.

2004, డిసెంబర్ 23 న పి.వి.నరసింహారావు మృతి చెందారు. తెలుగుబిడ్డ, తెలంగాణ బిడ్డ అంటూ ఆకాశానికెత్తడం, తెలుగుబిడ్డ‌కు అవ‌మానం జ‌రిగిందంటూ గ‌గ్గోలు పెడ్టం 20 యేళ్లుగా చూస్తున్నాం. అంతా ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న ఆయన ఫోటోకి పూల మాల వేసి నివాళులు అర్పించడం చూస్తున్నాం. కానీ ఎవ‌రూ ఈ పీవీ స్మారక గ్రంథాలయాన్ని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేయలేదు. ఇక్కడ ఉన్న అపురూపమయిన పుస్తక సంపదను వినియోగంలోకి తెచ్చే ప్రయత్నం చేయలేదు.

ఈ గ్రంథాల‌యంలో అనేక అరుదైన పుస్త‌కాలున్నాయి. "1948లో ప్ర‌చురిత‌మైన పుస్త‌కాల్ని ఇక్క‌డ చూడ‌వ‌చ్చు. పార్ల‌మెంట్‌లో పీవీ చేసిన ప్ర‌సంగాలు, ఆయ‌న ర‌చ‌న‌, భాష, శైలి, ప‌ద‌ప్ర‌యోగాలు తెలుసుకోవ‌డానికి రీసెర్చ్ చేసేవారు, రాజ‌కీయ‌నాయ‌కులు వ‌చ్చి ఇక్క‌డ చ‌దువుతుంటారట‌. 1947 నుంచి 1964 వ‌ర‌కు వివిధ ముఖ్య‌మంత్రుల‌కు రాసిన లేఖ‌లు, 1962 నుంచి 1987 వ‌ర‌కు లోక్‌స‌భ‌లో జ‌రిగిన డిబేట్ ను ఈ లైబ్ర‌రీలో చూడ‌వ‌చ్చు. మ‌హాభార‌తం, భాగ‌వతం, రామాయ‌ణం, బైబిల్, తెలుగు న‌వ‌ల‌లు, నెహ్రూ, గాంధీ, ఇందిరా, రాజీవ్‌, వాజ్‌పేయి, స్వామి రామానంద‌తీర్థ బ‌యోగ్ర‌ఫీలు, మాజీ రాష్ట్ర ప‌తుల బ‌యోగ్ర‌ఫీలతో పాటు ఇండియ‌న్ ఎకాన‌మీ, ఔష‌ధ సుగంధ మొక్క‌ల‌పై వెయ్యి పుస్త‌కాలు, పీవీ న‌ర్శింహారావుపై వివిధ ర‌చ‌యిత‌లు రాసిన 400 పుస్త‌కాలు, మొత్తం 11,980 పుస్త‌కాలున్నాయి. తెలుగు 1,300, ఇంగ్లీష్ 7,000, హిందీ 2,000, క‌న్న‌డ 50, మ‌రాఠీ 50, ఉర్దూ 100 పుస్త‌కాలున్నాయ‌ని" ఎమ్మెల్సీ సురభి వాణి దేవి ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో చెప్పారు.

"2019లో వ‌చ్చిన భారీ వ‌ర్షాల‌కు ఈ గ్రంథాల‌యం మునిగిపోయి చాలా పుస్త‌కాలు పాడైపాయాయి". అయితే ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకుని ఆ పుస్త‌కాల్ని కాపాడిన‌ట్లు సురభి వాణి దేవి చెప్పారు. "అరుదైన పుస్త‌కాలు నిక్షిప్తం అయివున్న పీవీ ప‌ర్స‌న‌ల్ గ్రంథాల‌యాన్ని ఈ త‌రం వారు అధ్య‌య‌నం చేసే కార్య‌శాల‌గా మార్చ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం బాధ్య‌త‌గా తీసుకోవాలని" ప్ర‌ముఖ రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో తెలిపారు.

విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన వేయిపడగలు కు పీవీ హిందీ అనువాదం, ఇన్‌సైడర్ పేరుతో రాసిన ఆత్మకథ. పన్ లక్షాత్ కోన్ ఘేతో అనే మరాఠీ పుస్తకానికి తెలుగులో అబల జీవితంగా అనువాదం చేశారు. పీవీ శ‌త జ‌యంతి ఉత్స‌వాల సంద‌ర్భంగా ఆవిష్క‌రించిన తొమ్మిది పుస్త‌కాల్ని ఈ లైబ్ర‌రీలో చూడ‌వ‌చ్చు. ప‌శ్చిమ దేశాల‌పై భార‌త సంస్కృతి ప్ర‌భావంపై పీవీ న‌ర‌సింహారావు ప్ర‌సంగాల సంక‌ల‌నం, వేర్వేరు మీడియా ప్ర‌తినిధులు చేసిన ఇంట‌ర్వ్యూల సంక‌ల‌నం. పీవీ న‌ర‌సింహారావు చేసిన ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌పై, ఆయ‌న పాల‌నా రీతుల‌పై దేశ‌, విదేశాల‌కు చెందిన అగ్ర నాయ‌కులు రాసిన వ్యాసాల సంక‌ల‌నం ఈ లైబ్ర‌రీలో చూడ‌వ‌చ్చు.

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శ‌ని అన్న‌ట్లు ఇన్ని పుస్త‌కాలున్నా పాఠకులకు ఈ లైబ్ర‌రీ అందుబాటులో లేదు. ఇటీవ‌ల కాలంలో పోటీ పరీక్షకు సన్నద్ధమయ్యే యువత, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని యువత, గ్రంథాలయాలకు బారులు తీస్తున్నారు. లైబ్ర‌రీల పనిగంటలు పెంచాలని, వాటిని సెలవు దినాల్లో కూడా తెరిచే ఉంచాలని కోరుతున్నారు. పీవీ నరసింహారావు స్మార‌క గ్రంథాల‌యాన్ని ఇలాంటి యువ‌త‌కు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం జరగలేదు. పీవీని రాజకీయాలకు వాడుకోవడం మానేసి, ఈ స్మారక లైబ్రరీని "దేశంలోనే ఒక విశిష్టమయిన గ్రంధాలయంగా" మార్చేందుకు రాజకీయ పార్టీలు స‌హ‌క‌రించాలి. దీని కోసం పీవీ కుటుంబ సభ్యులు కూడా కృషి చేయాలి.

Read More
Next Story