జూబ్లిహిల్స్‌లో మజ్లిస్‌ వ్యూహాత్మక మౌనం..
x

జూబ్లిహిల్స్‌లో మజ్లిస్‌ వ్యూహాత్మక మౌనం..

ఎవరికీ బలం, ఎవరికీ భారం?


ఆల్ ఇండియా మ‌జ్లిస్-ఇ-ఇత్తేహదుల్ ముస్లిమీన్ (ఎం.ఐఎం.) అలియాస్ మజ్లిస్ - కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య స్నేహం మ‌ళ్ళీ చిగురించింది. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సిఎంగా వున్న‌ప్పుడు ఇరు పార్టీల మ‌ధ్య‌ మంచి సంబంధాలుండేవి. అయితే కిర‌ణ్‌కుమార్‌రెడ్డి సి.ఎం.గా వున్న‌ప్పుడు పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి.

తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం మజ్లిస్, బీఆర్ఎస్ లు అవిభక్త కవలలుగా కలిసి మెలిసి ఉన్నాయి. మిత్రపక్షాలుగా ఎన్నికలలో ఒకరికి ఒకరు తోడ్పడ్డాయి. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఎలాంటి దాపరికం లేకుండా మజ్లిస్, బీఆర్ఎస్ లు మిత్రులు అని బహిరంగంగానే ప్రకటించేశారు.

అయితే మజ్లిస్ రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే.. ఆ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచీ కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీతోనే స్నేహ సంబంధాలు కొన‌సాగించింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీతోనే చెట్టాపట్టాలేసుకు తిరిగింది. అప్పటి వరకూ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు మద్దతుగా ఉన్న ఎంఐఎం, తర్వాత కాంగ్రెస్ కు అనధికార మిత్రపక్షంగా తయారైంది. ఎంఐఎం వైఖరి మారింది.

మజ్లిస్ బీఆర్ఎస్ కు దూరం జరగడం, కాంగ్రెస్ కు దగ్గరవ్వడం అనూహ్య పరిణామం ఏమీ కాదు. ఎందుకంటే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీతోనే నడుస్తుందన్న విషయం తెలిసిందే. ఎందుకంటే పాత బస్తీలో తన పట్టు నిలుపుకోవాలంటే మజ్లిస్ కు రాష్ట్రంలో అధికార పార్టీ అండ అవసరం.

మ‌రో వైపు కాంగ్రెస్ పార్టీ, మ‌జ్లిస్ తో స్నేహం పెంచుకోవ‌డానికి ప్ర‌య‌త్నించింది. "అసెంబ్లీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నా వారిని కాదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా ఎంచుకున్న రేవంత్‌రెడ్డి, ఎంఐఎం ప‌ట్ల తన వైఖ‌రి" ఏమిటో చెప్పేశారు.

"ఏ రేవంత్ రెడ్డిని అయితే ఆరెస్సెస్ నేపథ్యముందని విమర్శించారో ఆయన పక్కనే కూర్చుని అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీ క‌మిటీ హాల్‌లో సమీక్షల‌లో పాల్గొంటున్నారు. అలాగే ఎంఐఎం ఎమ్మెల్యేలు లేవనెత్తిన అంశాల్ని పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి హామీలు కూడా ఇచ్చేస్తున్నారు". అలా అటు కాంగ్రెస్, ఇటు ఎంఐఎం మ‌ధ్య బంధం క్రమంగా బలపడుతోంది.

మేడిగడ్డ సందర్శనకు రేవంత్ సర్కార్ మ‌జ్లిస్ పార్టీని ఆహ్వానించింది. మజ్లిస్ ఎమ్మెల్యేలు మేడిగడ్డ సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ఆరోపణలు వాస్తవమేనంటూ ఎంఐఎం నోరు విప్పింది.

ఈ నేప‌థ్యంలో జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక‌లు వ‌చ్చాయి. మజ్లిస్‌ వ్యూహాత్మక మౌనం వ‌హిస్తూ, కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణాన్ని సృష్టించింది. మ‌రో వైపు బిజెపి గ‌ట్టిగా ఫైర్ అవుతోంది. ఎంఐఎం సూచించిన వ్యక్తికే కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చిందంటూ హిందూ ఓట్ల‌ను పొల‌రైజ్ చేయ‌డానికి బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంది.

జుబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి, మ‌జ్లిస్ దోస్తీ ఏవిధంగా ఉప‌యోగ‌ప‌డుతుందో చూద్దాం. న‌వీన్ యాద‌వ్ ఇప్ప‌టికి రెండు సార్లు జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేశారు. 2014లో ఎంఐఎం నుంచి పోటీ చేసిన‌ప్పుడు 41,565 ఓట్లు ద‌క్కించుకుని రెండో స్థానంలో నిలిచారు. 2018 ఎన్నిక‌ల్లో స్వ‌తంత్రంగా పోటీ చేసి 18,817 ఓట్లు ద‌క్కించుకున్నారు. మ‌రి ఇప్పుడు అధికార పార్టీ త‌ర‌ఫున పోటీ చేస్తున్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే దివంగ‌త నేత మాగంటి గోపీనాథ్ ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 3 సార్లు గెలిచారు.

మొద‌టి సారి 2014లో టీడీపీ - బీజేపీ పొత్తుతో

2వ సారి 2018లో బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా

3వ సారి 2023లో బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా గెలిచారు.

ఇక్క‌డ ఎంఐఎం పాత్ర గురించి మనం విశ్లేషించుకుంటే

2014లో మ‌జ్లిస్ అభ్య‌ర్థిగా న‌వీన్ యాద‌వ్ పోటీ చేసి 41 వేల 656 ఓట్లు పొందారు. 2వ స్థానంలో నిలిచారు.

2018లో మ‌జ్లిస్ పార్టీ పోటీ చేయ‌కుండా బీఆర్ ఎస్‌కు స‌పోర్ట్ చేసింది. బీఆర్ ఎస్ గెలిచింది.

అప్పుడు న‌వీన్‌యాద‌వ్ స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసి 18 వేల 817 ఓట్లు గెల్చుకున్నారు.

2023లో కాంగ్రెస్ పార్టీని ఓడించే ల‌క్ష్యంతోనే మ‌జ్లిస్ పార్టీ త‌న అభ్య‌ర్థిని ఎన్నిక‌ల బ‌రిలో దింపింది. ఎంఐఎం చీల్చిన ఓట్ల‌తో కాంగ్రెస్ ఓడింది. మ‌ళ్ళీ బీఆర్ఎస్ గెలిచింది.

ఇక లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాల్ని విశ్లేషిస్తే,

2014లో సికింద్రాబాద్ ఎంపీగా బండారు ద‌త్తాత్రేయ గెలిచారు. అప్పుడు రాష్ట్ర విభ‌జ‌న సెటిల‌ర్ల ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపించింది.

2019లో కిష‌న్ రెడ్డి గెలిచారు. బీఆర్ ఎస్ ఓడిపోయినా, జూబ్లీహిల్స్‌, నాంప‌ల్లి సెగ్మెంట్‌లో 27 వేల‌కు పైగా భారీ మెజార్టీ వ‌చ్చింది. ఎందుకంటే బీఆర్ ఎస్ అభ్య‌ర్థి త‌ల‌సాని సాయి కిరణ్ యాదవ్ కు ఎంఐఎం స‌పోర్ట్ చేసింది.

2024లో మ‌ళ్ళీ కిష‌న్‌రెడ్డినే గెలిచారు. కాంగ్రెస్ త‌ర‌ఫున దానం నాగేంద‌ర్ పోటీ చేసి ఓడిపోయారు. అయినా ఆయ‌న‌కు జూబ్లీహిల్స్‌, నాంప‌ల్లి సెగ్మెంట్‌లో 25 వేలకు పైగా మెజార్టీ వ‌చ్చింది. అంటే జూబ్లిహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎంఐఎంకు మంచి ప‌ట్టు వుంది. ల‌క్ష‌కు పైగా ఓట‌ర్లు వున్నారు. అందుకే కాంగ్రెస్ మ‌జ్లిస్ పార్టీతో స్నేహం కొన‌సాగిస్తోంది. మజ్లిస్‌ సహకారం జూబ్లిహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీకి ప్ల‌స్ అవుతుంది.

Read More
Next Story