ఎన్నాళ్లీ గ్రూప్ 1 ప‌రీక్ష వివాదం
x

ఎన్నాళ్లీ గ్రూప్ 1 ప‌రీక్ష వివాదం

విమర్శలు + వివాదాలు + వైఫల్యాలు = టీజీపీఎస్సీ


ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్సీ అయినా, తెలంగాణలో టీజీపీఎస్సీ TGPSC అయినా అదే ఒరవడి కొనసాగుతోంది. ఫలితంగా లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు అగమ్య గోచరమవుతోంది. తెలంగాణ వచ్చాక బీఆర్‌ఎస్‌ హయాంలో ఆ కమిషన్‌ పని విధానంపైన తీవ్ర విమర్శలు వ‌చ్చాయి. అప్పట్లో టీజీపీఎస్సీ తప్పిదాల వల్ల రెండుసార్లు ప్రిలిమ్స్‌ రద్దు కావటంలో నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు కాంగ్రెస్‌ హయాంలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షకు సంబంధించి ఇలాంటి విమర్శలే. తెలంగాణలో గ్రూప్-1 అంటేనే పొలిటికల్ కాంట్రవర్సీగా మారిపోయింది.

గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి సంబంధించి ఇటీవ‌ల రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు "ఆ కమిషన్‌ పనితీరును మరో సారి ప్రశ్నార్థకం చేసింది. మెయిన్స్‌ పరీక్షా పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలంటూ ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది. పరీక్షా ప్రక్రియలో అనేక సమస్యలను ఈ తీర్పు ఎత్తి చూపింది".

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ "హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. పరీక్షా ప్రక్రియలో పారదర్శకత, న్యాయబద్ధతను కాపాడేందుకు తాము అన్ని చర్యలు తీసుకున్నామని TGPSC చెబుతోంది".

స‌మైక్య రాష్ట్రంలో అంటే 14 ఏళ్ళ క్రితం కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 2011లో గ్రూప్-1 పరీక్షలు సజావుగా జరిగి రిక్రూట్‌మెంట్ సైతం కంప్లీట్ అయింది. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పుడు బీఆర్ ఎస్‌, ఇప్పుడు కాంగ్రెస్ ప్ర‌భుత్వంలోనూ గ్రూప్-1 వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది కానీ గ్రూప్ -1 అపాయింట్‌మెంట్ జ‌ర‌ప‌లేక‌పోతున్నారు. ఘోరంగా వైఫ‌ల్యం చెందుతున్నారు. నిరుద్యోగుల జీవితాల‌తో చెల‌గాటం ఆడుతున్నారు.

BRS హయాంలో 2022లో గ్రూప్ వన్ కోసం మొదటిసారిగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. షెడ్యూలు ప్రకారం నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు దాదాపు 2.80 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యరు. ఆ తర్వాత పేపర్ లీకేజీ అయిందనే బాంబు లాంటి వార్త రావడంతో పలు స్థాయిల్లో దర్యాప్తు జరిగిన అనంతరం చివరకు పరీక్షలను రద్దు చేస్తున్నట్టు కమిషన్ ప్రకటించింది.

రెండోసారి ప్రిలిమ్స్‌ను 2023 జూన్‌లో నిర్వహించింది. బయోమెట్రిక్ విషయంలో సరైన నిబంధన పాటించలేదని, OMR షీట్స్‌ పైన హాల్ టికెట్ నెంబర్ లేదనే కారణంతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా కమిషన్ వైఫల్యం బట్టబయలైంది. దీంతో ఆ పరీక్షలు మరోసారి రద్దయ్యాయి.

అప్పట్లో అభ్య‌ర్థుల‌కు అండ‌గా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది. సీన్ కట్ చేస్తే..కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత కూడా గ్రూప్-1 వివాదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. "2024 అక్టోబర్ లో TGPSC ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 21వేల, 75 మంది హాజరైతే..ఫలితాలు ప్రకటించే సమయానికి 21వేల, 85 మంది అభ్యర్థులు ఉన్నారని ప్రకటించడం వివాదాస్పదమైంది.

మొత్తం 46 సెంటర్లు ఏర్పాటు చేస్తే 15 సెంటర్ల నుంచే మొత్తం టాపర్లు ఉండటం, మిగతా సెంటర్ల నుంచి ఒక్కరంటే ఒక్కరూ లేకపోవడంపై అనుమానాలు వ్యక్తం" అవ్వ‌డంతో అభ్య‌ర్థులు కోర్టును ఆశ్ర‌యించారు.టాప్‌-500లో కోఠి మహిళా కాలేజీ సెంటర్‌లో రాసిన అభ్యర్థులే 75 మంది ఎంపికవ్వడంపై అనుమాలకు తావిచ్చింది. టాప్‌-100, టాప్‌-500లో ఒక్క తెలుగు మీడియం అభ్యర్థి కూడా లేరని అభ్యర్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. TGPSC గ్రీవెన్స్‌సెల్‌ను వెయ్యి మంది ఆశ్రయిస్తే ఇప్పటి వరకు ఒక్కరికి కూడా సమాధానమివ్వలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

"హాల్‌ టిక్కెట్ల పంపిణీ నుంచి మూల్యాంకనం వరకూ అన్నీ వివాదాస్పద నిర్ణయాలే తీసుకున్నారనే ఆరోపణలను కమిషన్‌ ఎదుర్కొంటోంది. నిబంధనలు, సూత్రాలను అది పూర్తిగా ఉల్లంఘించింది. 21 ఉల్లంఘ‌న‌లు జ‌రిగాయ‌ని" బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.

మూల్యాంకనానికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే… "సోషియాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సు సబ్జెక్టులకు ప్రత్యేక ప్రొఫెసర్లు, తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలపై ప్రత్యేక అవగాహన ఉన్నవారు, జనరల్‌ అంశాలపై పట్టున్న వారు ప్యానెల్‌లో లేనే లేరన్నది అభ్యర్థుల వాదన". అదీ గాక చాలాకాలం క్రితమే ఉద్యోగవిరమణ చేసిన రీడర్లు, ప్రొఫెసర్లను ప్యానెల్‌లో చేర్చుకోవటం దారుణం అంటారు అభ్య‌ర్థులు. చాలా మందికి పదిలోపే మార్కులు వ‌చ్చాయి. లక్షలాది రూపాయలు పోసి, కోచింగ్‌ సెంటర్లలో ప్రిపేర్‌ అయిన నిరుద్యోగుల ఆశలను వమ్ముచేశాయి.

"గత బీఆర్‌ఎస్‌ సర్కారు చేసిన తప్పులను సరిచేసి…టీజీపీఎస్సీని యూపీఎస్సీ తరహాలో సరిదిద్దుతామంటూ కాంగ్రెస్‌ పార్టీ, ఆ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అనేకసార్లు నిరుద్యోగులకు హామీనిచ్చారు. ఈ క్రమంలో గతాను భవాలను దృష్టిలో ఉంచుకుని, టీజీపీఎస్సీ పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించి, లోపాలను సరిదిద్దాల్సిన ప్రభుత్వం ఆ పనిచేయలేదని" ఎస్‌.ఎఫ్‌.ఐ. రాష్ట్ర సెక్ర‌ట‌రీ టి.నాగ‌రాజు తెలిపారు.

"మూల్యాంకనానికి నిపుణులైన ప్రొఫెసర్లను నియమించటం, తెలుగు, ఇంగ్లీషు పేపర్లను అదే మాద్యమాలకు సంబంధించిన వారితో మూల్యాంకనం చేయించటమనే నిబంధనలకు తిలోదకాలిస్తున్నా సర్కారు చూస్తూ ఊరుకుందే తప్ప, టీజీపీఎస్సీకి సరైన దిశా నిర్దేశం చేసి, గాడిన పెట్టలేదు. ఫలితంగా చరిత్ర మళ్లీ పునరావృతమైంది. అభ్యర్థులకు జరగాల్సిన నష్టం జరిగిపోయిందని" ఉమ్మ‌డి రాష్ట్రంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ స‌భ్యుడు ది ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో తెలిపారు.

"సబ్జెక్టు నిపుణులతోనే జవాబు పత్రాల మూల్యాకనం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలి. తద్వారా పోస్టుల భర్తీకి ఎలాంటి అడ్డంకులు లేకుండా నియామకాలను పారదర్శకంగా చేపట్టాలి. తద్వారా అత్యున్నత స్థాయి కమిషన్‌గా టీజీపీఎస్సీని తీర్చిదిద్దాలని" మెయిన్ ప‌రీక్ష రాసిన అంబ‌ర్‌పేట్‌కు చెందిన‌ వెంక‌ట ర‌మ‌ణ దీనంగా ప్ర‌భుత్వానికి వేడుకుంటున్నారు.

Read More
Next Story