నేడు మేడారంలో కీలక ఘట్టం.. గద్దె పైకి రానున్న సమ్మక్క
x

నేడు మేడారంలో కీలక ఘట్టం.. గద్దె పైకి రానున్న సమ్మక్క

దక్షిణ భారత కుంభమేళా గా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు రంగంసిద్ధమైంది. ఇప్పటికే సారలమ్మ గద్దెపై కొలువుదీరగా నేడు జాతరలో సమ్మక్క ఆగమనం జరగనుంది.


తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచి, ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి జరనున్న మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర బుధవారం లాంఛనంగా ప్రారంభం అయింది. ఇప్పటికే సారలమ్మ తల్లి మేడారంలో గద్దెను చేరగా, గురువారం సమ్మక్కను గద్దెపైకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.

దీంతో జాతరలో కీలక ఘట్టం మొదలవుతుంది. వనదేవతలన దర్శించుకోవడానికి ఇప్పటికే లక్షలాది మంది ప్రజలు మేడారం చేరుకున్నారు. ఎటుచూసిన జనంతో మేడారం కిటకిటలాడుతోంది. జాతరలో ఇప్పటికే 70 లక్షల మంది ప్రజలు తమ మొక్కులు సమర్పించుకున్నట్లు అధికారులు ప్రకటించారు.

చిలకలగుట్ట నుంచి గురువారం రాత్రి 9-10 గంటల మధ్య సమ్మక్క వస్తుందని జిల్లా అధికారులు తెలిపారు. సమ్మక్క రాక సందర్భంగా ఇప్పటికే మేడారంలోని ఆమె గుడిని శుద్ధి చేశారు. మామిడి తోరణాలు కట్టారు. ఆవరణ మొత్తం ఎర్రమన్నుతో అలికి, ముగ్గులు పెట్టారు. సమ్మక్క వడ్డెలు ఇప్పటికే తల్లి పూజకు అవసరమైన సరంజామాను సిద్ధం చేశారు. ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలోని పూజారులు సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో చిలకలగుట్ట చేరుకుంటారు.

కొంతదూరం వెళ్లాక అందరిని ఆపేసి కేవలం ప్రధాన పూజారీ మాత్రమే రహస్యప్రదేశానికి వెళ్తారు. అక్కడ ప్రత్యేక ద్రవ్యాలతో సమ్కక్కకు పూజలు చేసి కుంకుమ భరిణెలో అమ్మవారిని తీసుకుని ప్రధాన వడ్డే బయల్దేరుతాడు.

అమ్మవారికి మంత్రులు, ఉన్నతాధికారులు స్వాగతం పలుకుతారు. సమ్మక్క ఆగమనం సందర్భంగా తల్లి గౌరవార్థం జిల్లా ఎస్పీ మూడు రౌండ్ల కాల్పులు జరుపుతారు. తల్లి రాకడ సందర్భంగా కోయలు ప్రత్యేక పూజలు, ఆటల పాటలతో స్వాగతం పలుకుతారు. సమ్మక్కను తీసుకొచ్చి గద్దె పై కొలువుదీరడంతో జాతర కీలకఘట్టం మొదలవుతుంది. కోట్లాది మంది భక్తులు నిలువెత్తు బంగారం సమర్పించుకుంటారు. శుక్రవారం నిండు జాతర కాగా, శనివారం తల్లులు వనప్రవేశంతో జాతర ముగుస్తుంది.

Read More
Next Story