
ప్రారంభమైన అమృత్ రైల్వే స్టేషన్లు.. తెలంగాణలో ఎన్నంటే..
దేశవ్యాప్తంగా 1300 రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని కేంద్ర నిర్ణయించిందని కిషన్ రెడ్డి చెప్పారు.
దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం ఆధునికీకరిస్తోంది. దశలవారీగా అన్ని రైల్వే స్టేషన్లను అత్యాధునిక టెక్నాలజీతో హటెక్ రైల్వేస్టేషన్లుగా తీర్చి దిద్దాలని ఫిక్స్ అయింది.ఇందులో భాగంగా ఇప్పటికే 103 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించింది. వీటిని గురువారం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. వీటిలో తెలంగాణకు చెందిన రైల్వే స్టేషన్లు మూడు ఉన్నాయి. తెలంగాణలో బేగంపేట్, కరీంనగర్, వరంగల్ రైల్వేస్టేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి. రూ.1,100 కోట్ల వ్యయంతో పునర్నిర్మాణమైన ఈ రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా అభివృద్ధి చెంది ప్రయాణికులకు ఆధునిక వసతులతో కూడిన హబ్‌లుగా మారనున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 86 జిల్లాల్లో ఉన్న ప్రధానమైన, చిన్న రైల్వే స్టేషన్లు కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, కేరళ, చత్తీస్‌గఢ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, పొండిచ్చేరిలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని సుల్లూరుపేట రైల్వే స్టేషన్, తెలంగాణ లోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వే స్టేషన్లు ఈ స్కీమ్ కింద ఆధునీకరించారు. ఈ స్టేషన్లను ప్రాంతీయ శైలిలో ఆకృతీకరించి, ఆధునిక ప్రయాణ వసతులు, క్లీన్ టాయిలెట్లు, డిజిటల్ డిస్ప్లేలు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు వంటి ఎన్నో ఆధునికతలతో తీర్చిదిద్దారు. ప్రస్తుతం రాజస్థాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ, బికానీర్ ముంబయి మధ్య నూతన ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు. అదే విధంగా దేశ్నోక్ లోని కర్నీ మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, దేశ్నోక్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ అభివృద్ధి కార్యక్రమం ద్వారా భారతీయ రైల్వేలు ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, ఆధునిక అనుభవాన్ని అందించనున్నాయి. ఈ రైల్వే స్టేషన్ల ప్రారంభంపై కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ మాట్లాడుతూ.. అతి త్వరలో బుల్లెట్ రైలును కూడా పరుగులు పెట్టించే ప్లాన్‌లో ప్రధాని మోదీ ఉన్నారని చెప్పారు.
‘‘రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా వరంగల్ ప్రజలకు శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో బుల్లెట్ రైళ్ళను కూడా ప్రవేశపెట్టే ఆలోచన మోదీకి ఉంది. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. భారత రైల్వే సరికొత్త అధ్యయానంకు శ్రీకారం చుట్టింది. రామప్ప కు మోడీ తో ప్రపంచ వారసత్వ గుర్తింపు వచ్చింది. రాబోయే రోజులలో రైల్వేలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు ప్రయత్నం జరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమము ఎవరు తీసుకున్న అభినందించాల్సిందే. రాజకీయాలకు అతిథితంగా అందరు పని చెయ్యాలి. తెలంగాణ కు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నారు.
ఇదే అంశంపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ వాటిలో ఒకటి అని చెప్పారు. ‘‘రూ.80వేల కోటల పనులకు సంబంధించి ప్రణాళికలు చేస్తున్నాం. దసరా రోజు కొమురవెల్లి రైల్వేస్టేషన్‌ను ప్రారంభిస్తాం. ఎంఎంటీఎస్ రెండో ఫేజ్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. యాదగిరిగుట్టకు కూడా ఎంఎంటీఎస్ పనులు ప్రారంభిస్తాం’’ అని చెప్పారు. దేశవ్యాప్తంగా 1300 రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని కేంద్ర నిర్ణయించిందని ఆయన చెప్పారు. అంతేకాకుండా వాటన్నింటిలో కూడా ప్రమాదాలను నిలువరించేలా కవచ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.