
‘బీసీలను నిలువునా మోసం చేసిన నేత రేవంత్ రెడ్డి’
బీసీ రిజర్వేషన్లపై కమిషన్ ఇచ్చిన నివేదికకు అసలు చట్టబద్ధత ఉందా? అని ప్రశ్నించిన ఈటల.
పదే పదే ఢిల్లీకి వెళ్తున్న రేవంత్.. డ్రామాలు చేయడమే తప్ప.. రాష్ట్రానికి పనికొచ్చే పనికి ఒక్కటీ చేయలేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. బీసీలకు న్యాయం చేస్తామంటున్న కాంగ్రెస్.. ఇప్పుడు మొండి చేయి చూపడానికి రెడీ అవుతోందని చురకలంటించారు. రేవంత్ రెడ్డిని ఎన్నుకుని పెద్ద తప్పు చేశామని ప్రజలు అంటున్నారని తెలిపారు. జీవితంలో మరోసారి కాంగ్రెస్‌కు ఓటేయకూడదని కూడా డిసైడ్ అయ్యారని వ్యాఖ్యానించారు. ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించిన ఓబీసీ మహాధర్నాలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై ఈటల మాటల ఈటలు ప్రయోగించారు. బీఆర్ఎస్.. బీసీల కళ్లలో మట్టికొట్టిందని, ఇప్పుడు కాంగ్రెస్ వారిని నిలువునా మోసం చేస్తోందని అన్నారు. అసలు ఓబీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్‌లో అనేక అంశాలు ఉన్నాయని, వాటిలో ఏ ఒక్కదాన్నీ కాంగ్రెస్ అమలు చేయలేదని దుయ్యబట్టారు. డిక్లరేషన్‌ల పేరిట హామీల వర్షం కురిపించడం అయితే చేశారు కానీ వాటిని అమలు చేయమంటే మాత్రం కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారని విసుర్లు విసిరారు.
‘‘రేవంత్ రెడ్డి అర్థం చేసుకోలేకపోయామని, మోస పోయామని ప్రజలు అనుకుంటున్నారు. రిజర్వేషన్ల పేరుతో బీసీలను రేవంత్ రెడ్డి నిలువునా మోసం చేశారు. అధికారంలోకి వచ్చి 20 నెలల దాటిపోయినా హామీలను మాత్రం అమలు చేయలేదు. ఒక్కరంటే ఒక్క వర్గం ప్రజలకు కూడా కాంగ్రెస్ న్యాయం చేయలేదు. నిరుద్యోగులకు ఇప్పటి వరకు ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయలేదు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్ అందించలేదు. పాత పద్ధతుల్లో ఫీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం, లేకపోతే సీఎం నీ భరతం పడతామని హెచ్చరికలు ఇస్తున్నాం..ఎన్ని హామీలున్నాయో గుర్తుందా రేవంత్ రెడ్డి..?’’ అని ఈటల నిలదీశారు.
రేవంత్ ఒకనైనా కుట్రలు మానుకోవాలి..
‘‘రిజవర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కమిషన్ వేసింది. ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌కు అసలు చట్టబద్దత ఉందా? రిజర్వేషన్లపై తొలిసారి కమిషన్ వేసిన రాష్ట్రం, చట్టబద్ధంగా 9వ షెడ్యూల్‌లో బిల్ చేర్చుకుని రిజర్వేషన్లను సాధించుకున్న రాష్ట్రం తమిళనాడు. ఆనాడు జయలలిత.. ఢిల్లీలో కూర్చుని పోరాడి రిజర్వేషన్లు సాధించుకున్నారు. కానీ ఈనాడు తెలంగాణ సీఎం రేవంత్ మాత్రం ఢిల్లీ వెళ్ళి డ్రామాలు ఆడుతున్నారు. తమ చేతకానితనానికి బీజేపీని బలి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్లు అమలుకాలేదన్న నెపాన్ని బీజేపీ నెత్తిన రుద్దడానికి చూస్తున్నారు’’ అని విమర్శించారు.
‘‘రిజర్వేషన్లు అనేవి 50శాతానికి మించి ఉండకూడదని కోర్టులు చెప్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని గతంలోనే స్పష్టం చేసింది. ఆర్టికల్ 340, కమిషన్ ఎంక్వరి 1942 ప్రకారం రేవంత్ రెడ్డి.. ఈ విషయంలో ముందుకు వెళ్లాలి. బీసీలను మోసం చేసే కుట్రలను రేవంత్ ఇప్పటికయినా మానుకోవాలి. బీఆర్ఎస్ ఉన్నంత కాలం బీసీ సీఎం కావడం, బీసీ అధ్యక్షుడు కావడం జరగదు. కాంగ్రెస్ హయాంలో కూడా బీసీని సీఎం చేయలేదు. భవిష్యత్తులో చేస్తారన్న నమ్మకం కూడా లేదు. చెప్పినట్లు బీసీలకు రిజర్వేషన్లు కల్పించకపోతే నీ భరతం పడతాం రేవంత్’’ అని హెచ్చరించారు ఈటల.