
కుంభమేళకు 2వేల కోట్లు! మరి మేడారం జాతరకు...?
ఇది ఆదివాసీలను అవమానించడం కాదా?
దేవాలయాల చుట్టే రాజకీయం! దేశంలో రాజకీయం టెంపుల్స్ చుట్టూ తిరుగుతోంది. బీజేపీ రామాలయాన్ని నమ్ముకుంది శరవేగంగా ఎదిగింది మూడవ టర్మ్ కూడా అధికారంలోకి వచ్చింది. "బీజేపీ దూకుడుని తట్టుకోవాలంటే తన పొలిటికల్ ఎజెండాలో టెంపుల్ వుండాలని" కేసీఆర్ అనుకున్నారు. అందులో భాగంగానే యాదాద్రిని నమ్ముకున్నారు. తాను మెజార్టీ ప్రజల మనోభావాల్ని గౌరవిస్తున్నానని చెప్పుకునేందుకు బలమైన సాక్షంగా యాదాద్రి దేవాలయం నిర్మాణాన్ని చూపించారు. ఇదే పంథాలో సి.ఎం. రేవంత్‌రెడ్డి దూసుకుపోతున్నారు. మేడారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
గతంలో ముఖ్యమంత్రులు, మంత్రులు జాతరకు వెళ్లడం, దర్శనాలతో సరిపుచ్చేవారు. అందుకు భిన్నంగా అన్నీ తానై మేడారం పనుల్ని సమీక్షిస్తూ గ్లోబల్ జాతరకు ఇక గోల్డెన్ రోజులు వచ్చాయంటున్నారు. ప్రపంచ పటంలో జాతరకు మరింత వన్నె తేవాలని సీఎం రేవంత్ పదే పదే చెబుతున్నారు. ఆదివాసీల సంప్రదాయాలు, ఆకాంక్షలకు అద్దంపట్టేలా మేడారం జాతరను నిర్వహించనున్నారు. నిన్న మంగళవారం రోజు ప్రత్యక్షంగా మేడారం క్షేత్ర స్థాయి సందర్శించారు. "సమ్మక్క - సారలమ్మ మందిరాన్ని రాతితో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని, ఈ గద్దెలను పునరుద్ధరించే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని" చెప్పారు.
బిజెపి గిరిజనులపై దృష్టి పెట్టిన విషయం, బహిరంగ రహస్యమే. అయితే బిజెపి ఎత్తుగడలకు చెక్ పెడుతూ గిరిజనుల్ని కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌గా డిపాజిట్ చేసుకోవడానికి రేవంత్ తనదైన స్టైల్‌లో మేడారంను గ్లోబల్ జాతరగా తీర్చిదిద్దుతున్నారు. "తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని ఈ జాతర వేదిక" అంటారు సి.ఎం. రేవంత్ రెడ్డి. 236 కోట్ల రూపాయలతో సర్వహంగులు, ఏర్పాట్లను స్వయంగా సి.ఎం.యే పర్యవేక్షిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం కుంభమేళాకు వేల కోట్లు కేటాయిస్తారని, అయితే తెలంగాణలోని మేడారం జాతరకు మాత్రం నిధులు ఇవ్వడం లేదని సి.ఎం. రేవంత్ ఆరోపిస్తున్నారు. “యూపీలోని అయోధ్య మాత్రమే దేవాలయం కాదు, మేడారం కూడా కోట్లాది భక్తుల మనసుకు ప్రతిబింబం” అని స్పష్టం చేశారు. మేడారం జాతర నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ కుంభమేళాకు రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్. మేడారం జాతరకు కేవలం 3 కోట్ల రూపాయల బడ్జెటా ఇదెక్కది అన్యాయం అని నిలదిస్తున్నారు.
మేడారం అభివృద్ధి కేవలం నిర్మాణాల పరిమితి కాదని.. ఆదివాసీ సంప్రదాయాలు, వారసత్వాన్ని కాపాడే కృషి కావాలని సీఎం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెనకడుగు వేయదని, ఎంత ఖర్చయినా సమ్మక్క-సారలమ్మ ఆలయాన్ని ఘనంగా తీర్చిదిద్దుతామని సి.ఎం.రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
"గంగానది శుద్ది చేయడానికి గత పదేళ్లలో 39 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు" లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.
హైదరాబాద్ మధ్యగా మూసీ ప్రవహిస్తోంది. నగర ప్రజలతో పాటు ఉమ్మడి నల్గొండ ప్రజలు మూసీ కాలుష్యంతో నరక యాతన అనుభవిస్తున్నారు. ఇటువంటి నది ప్రక్షాళనకు బడ్జెట్ అడిగితే పైసా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో ఉచిత సలహాలిస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, టి.బి. మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. "కేంద్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు మంత్రులున్నా మూసీ ప్రక్షాళనకు ఒక్క పైసా అడగడం లేదు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నా ఏనాడూ మాట్లాడని కిషన్‌రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు అడుగడుగునా అడ్డు తగులుతున్నారు" టి.బి. మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపిస్తున్నారు.
2026 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగే ఈ మహోత్సవంను ఓ గ్లోబల్ జాతరగా నిర్వహించడానికి తెలంగాణా ప్రభుత్వం సన్నద్దం అయింది. తెలంగాణ జాతి ఆత్మగౌరవానికి ప్రతీకైన ఈ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. గతంలో ఎప్పుడూ లేని ఏర్పాట్లు, సౌకర్యాలు శాశ్వతంగా నిలిచి ఉండేలా చేసేందుకు కంకణం కట్టుకున్నది. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయనే స్వయంగా ఇక్కడి ప్రాంగణాన్ని దర్శించుకుని.. పరిస్థితులను దగ్గరుండి మరీ సమీక్షిస్తున్నారు.
రవాణా సౌకర్యం మెరుగుపరుస్తూ రహదారులు, సౌకర్యాలు, జంపన్నవాగు అభివృద్ధి, సోలార్ గ్రామాలు, శుభ్రతా కార్యక్రమాలు.. ఇలా అన్నింటి కోసం ఏకంగా రూ. 236 కోట్లను కేటాయించారు. ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం ఇదే తొలిసారి.సమ్మక్క సారలమ్మ పూజారులతో చర్చించి వారి అభిప్రాయం మేరకు ఆధునికరణ పనులు చేపడుతున్నారు. భక్తుల సందర్శనార్థం అమ్మవారి గద్దెల ఎత్తు పెంచాలని పూజారులు ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా... తగిన మేరకు డిజైన్లు మార్చుతున్నారు. భక్తుల సందర్శనార్థం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దెలు ఒకే వరుస క్రమంలో ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా ఎలాంటి జాప్యం లేకుండా సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను భక్తులు దర్శించుకునేందుకు అనువుగా ఉంటుందని సమ్మక్క సారలమ్మ పూజారులు చెబుతున్నారు.