Kishan Reddy ‘సీఎం సీటులో ఓవైసీ కూర్చున్నా ఆశ్చర్యమక్కర్లేదు’
x

Kishan Reddy ‘సీఎం సీటులో ఓవైసీ కూర్చున్నా ఆశ్చర్యమక్కర్లేదు’

కాంగ్రెస్.. బీసీల మెడలు కోసి మజ్లీస్ చేతులో పెడుతోందన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.


తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల రచ్చ రోజురోజుకు ఎక్కువైపోతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య ఈ విషయంలో విమర్శల యుద్ధం జరుగుతోంది. బీసీ రిజర్వేషన్ కాన్సెప్ట్ అంతా కూడా బీసీలను మోసం చేయడానికేనని బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. బీసీల పేరు చెప్పి ముస్లింలకు రిజర్వేషన్లు పెంచడానికి కాంగ్రెస్ పన్నాగాలు పన్నుతోందని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇదే విషయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం పెరుగోతంది. తాజాగా ఇదే అంశంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ బీసీల మెడలు కోసి మజ్లిస్ చేతిలో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మజ్లీస్ మాటే వీరికి శాసనంగా మారుతోందని, మజ్లీస్ ఆడించినట్లు వీళ్లు ఆడుతారని విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీని అడ్డుకోవడం కోసం మజ్లిస్ కుటుంబానికి సీఎం కుర్చీ కట్టబెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదని అన్నారు. మాటకొస్తే దేశానికే తెలంగాణ స్ఫూర్తి అని అంటున్నారని, అది ఎందులోనో చెప్పాలని ప్రశ్నించారు.

‘‘బీసీలను మోసం చేయడంలో దేశానికి తెలంగాణ ఆదర్శమా? బీసీల మెడలు కోయడంలో తెలంగాణ రోల్‌మోడలా? ఒకరి పేరు చెప్పి మరొకరికి లబ్ది చేకూర్చడంలో మార్గదర్శకమా? తూత మోడల్స్, సర్వేలు చేసి ప్రజలను మోసం చేయడంలో స్ఫూర్తిదాయకమా?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 50 సీట్లు రిజర్వ చేస్తే వాటిలో 31 మంది నాన్ బీసీలు గెలిచారు అని గుర్తు చేశారు. తన ప్రశ్నలకు రేవంత్, రాహుల్, కేసీఆర్ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతిపై తెలంగాణ మంత్రి కొండాసురేఖ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

కొండా సురేఖ వ్యాఖ్యలకు సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని కోరారు. ‘‘ఎన్నో రాష్ట్రాలలో కాంగ్రెస్ కు దిక్కు లేదు. రాహుల్ ప్రధాని అవుతాడో కాదో కానీ.. రేవంత్ మాత్రం ఘోరంగా ఓడిపోతాడు. రేవంత్ స్థాయికి మించి మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అవినీతి పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతాం. అసదుద్దీన్, అజహరుద్దీన్ బీసీలు అవుతారా. 10 శాతం ముస్లింల రిజర్వేషన్లు తొలగిస్తే.. బీసీ రిజర్వేషన్ల కోసం బాధ్యత నేను తీసుకుంటా. ప్రధాని, రాష్ట్రపతితో మాట్లాడి వాటిని తీసుకొస్తా’’ అని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.

Read More
Next Story